జర్నలిజం నుంచి అసెంబ్లీకి...

రాయలసీమ నుంచి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు అసెంబ్లీ అడుగుపెడుతున్నారు. వారిద్దరూ టిడిపి నుంచే ఎన్నికయ్యారు.

Update: 2024-06-04 15:12 GMT

జనం సమస్యలే కాదు. జర్నలిస్టుల సమస్యలు కూడా అసెంబ్లీలో ప్రతిబింబించనున్నాయి. రాయలసీమ నుంచి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి గెలుపొందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. మరొకరు చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించిన డాక్టర్ పి మురళీమోహన్ కూడా ఒకరు.

ఐ అండ్ పిఆర్ మంత్రిగా జర్నలిస్ట్

రాష్ట్ర మంత్రివర్గంలో ఐ అండ్ పిఆర్ శాఖకు మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన మొదటి సీనియర్ జర్నలిస్ట్ కాలువ శ్రీనివాసులుకే దక్కింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బీసీ సామాజిక వర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులు సీనియర్ జర్నలిస్టు. టిడిపి నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం లోక్సభ స్థానం నుంచి కాలువ శ్రీనివాసులు మొదటిసారి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి పై 21, 102 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అధికంగా ఉన్న పరిస్థితుల్లో 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాలువ శ్రీనివాసులు జూన్ 21వ తేదీ నుంచి 2017 వరకు ప్రభుత్వ చీఫ్ విప్ గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కాలువ శ్రీనివాసులు 2019 వరకు పనిచేశారు. అది కూడా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా ఆయన పని చేయడం ప్రస్తావనాశనం. ఐ అండ్ పి ఆర్ శాఖకు మంత్రిగా పనిచేసిన మొదటి జర్నలిస్టు కూడా కాలువ శ్రీనివాసులే కావడం గమనార్హం.

2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. తాజాగా 2024 ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్ఆర్ సీపీ సెట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో 37,268 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ప్రజల గొంతుక వినిపిస్తా..

ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా జర్నలిస్ట్ డాక్టర్ పి మురళీమోహన్ 14,948 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తలపట్టు మండలం గొడుగుచింత మారుమూల గ్రామంలో దళిత రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ పి మురళీమోహన్... వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో ఆయన పోటీపడ్డారు. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్. బాబు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. వీరిద్దరికి తోడు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి టిడిపికి రాజీనామా చేసి వైఎస్ఆర్సిపి లో చేరడం ద్వారా ఆ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ కు అండగా నిలిచారు.

వీరందరిపై పార్టీ శ్రేణులు నాయకులు ఇచ్చిన ధైర్యంతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జర్నలిస్టు డాక్టర్ పి. మురళీమోహన్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. పోటీ చేసిన మొదటి సారి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం ద్వారా రికార్డు సాధించారు. "ఇప్పటివరకు జర్నలిస్టుగా సమాజంలోని సమస్యలు అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి పనిచేశా" నన్ను ప్రజలు ఆశీర్వదించారు. టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజలతో పాటు జర్నలిస్టు సమస్యలు కూడా పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ కలికిరి మురళీమోహన్ అంటున్నారు. కష్టాల కడలి ఈదుతూనే పీహెచ్డీ పూర్తి చేసిన తనకు అన్ని అంశాల పట్ల సమగ్రంగా అవగాహన ఉందని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News