గిరిజన గురుకులంలో పచ్చకామెర్ల కలకలం–ఇద్దరు బాలికలు మృతి

పార్వతీపురం మన్యం గురుకుల పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధితో 60 మంది బాలికలు బాధపడుతున్నారు.

Update: 2025-10-04 15:00 GMT

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలో పచ్చకామెర్లు (జాండీస్‌) వ్యాధి విస్తరిస్తుండటం సర్వత్రా ఆందోళన రేపుతోంది. ప్రస్తుతం 60 మంది బాలికలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతూ వారం వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. ఈ ఘటనలు అటు తల్లిదండ్రులు, స్థానికులు, అధికార వర్గాల్లో కలవరానికి గురి చేశాయి. కలుషిత తాగునీరు కారణంగా ఈ సమస్య ఏర్పడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలు గత వారం రోజుల నుంచి కలకలం రేపుతోంది. దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన బాలికలు తిరిగి వచ్చిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, దీని వెనుక ఇళ్ల చుట్టూ కలుషిత నీటి మూలాలు ఉండవచ్చని కురుపాం ఏరియా సూపరింటెండెంట్‌ డా. వాణి తెలిపారు. పాఠశాలలో 38 మందికి పచ్చకామెర్లు తీవ్రంగా ఉన్నాయి. మొత్తం 50 మంది బాలికలను కురుపాం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో చేర్పించగా, మరో 19 మందిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ (కేజీహెచ్‌)కు తరలించారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కురుపాం, రామభద్రాపురం, చిన మేరంగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా బాధితులు చికిత్సలు పొందుతున్నారు. 
మృతి చెందిన బాలికల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కురుపాం గురుకులంలో 8వ తరగతి చదువుతున్న గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖళ్లు పంచాయతీ పరిధిలోని కంబగూడ గ్రామానికి చెందిన పువ్వల అంజలి తొలుత ఈ వ్యాధితో మరణించినట్లు తెలిసింది. గత వారం అంజలి పోయిన నెల సెప్టెంబరు 26  న పాఠశాలలోనే మృతి చెందినట్లు సమాచారం. ఇదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తోయక కల్పన కూడా మృత్యువాత పడింది. కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక కల్పన చికిత్స తీర్చుకుంటూ కేజీహెచ్‌లో చేర్చిన కొద్ది రోజుల్లోనే మరణించింది. ఈ వరుస ఘటనలు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. మా పిల్లల ప్రాణాలు పోతున్నాయి.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే వైద్య బృందం తక్షణమే చర్యలు ప్రారంభించింది. కురుపాం గ్రామంలో తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. పీడియాట్రిక్‌ వైద్యులు బాలికలకు పూర్తి వైద్య పరీక్షలు చేస్తున్నారు. గురుకులం, ఏకలవ్య మోడల్‌ పాఠశాలల్లోనూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, 24 మందికి పచ్చకామెర్లు వ్యాధి సోకినట్లు ధృవీకరించారు. వ్యాధి విస్తరణను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ అనారోగ్య పరిస్థితులకు కలుషిత నీరు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల పరిమితిని, తాగునీరు సమస్యలను మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ విషయంలో విచారణకు ఆదేశించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News