తిరుమల ప్రకృతి అందాల నడుమ తుంబురతీర్థ ముక్కోటి..
తిరుమల గిరుల్లో ఏకంగా 3.50 కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నట్లు బ్రహ్మ, స్కంధపురాణాలు పేర్కొంటున్నాయి.;
పచ్చని ఒడిలో శిలా సౌందర్యంతో కట్టిపడేసే తుంబురు క్షేత్రం భక్తులకు, పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. తిరుమల శ్రీవారి ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. శుక్ర, శనివారం తిరుమలలో తుంబురతీర్థ ముక్కోటి జరుగుతున్నాయి . ముక్కోటికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
శేషాచలం గిరులు జంతుకోటికి ఆలవాలమే కాకుండా జలసంపదకు నిలయాలుగా ఉన్నాయి. తిరుమల గిరుల్లో ఏకంగా 3.50 కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నట్లు బ్రహ్మ, స్కంధపురాణాలు పేర్కొంటున్నాయి. ఈ తీర్థాల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం. తిరుమల గిరుల్లోని పుణ్య తీర్థాల్లో సంవత్సరానికి ఒకసారి కొన్ని పుణ్యఘడియలు ప్రవేశిస్తాయి. ఈ సందర్భంగా ఆయా తీర్థాల్లో ముక్కోటి ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.
తుంబుర తీర్ధంలో ముక్కోటి పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి కలుగుతుందని పురాణ వైశిష్ట్యం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. తుంబుర తీర్థానికి మరొక పేరు కూడా ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తుంది.
నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో అలిగిన తుంబురుడు వెనక్కి తగ్గి ఈ తీర్థంలోనే కూర్చుండి పోతారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్వయంగా వేంకటేశ్వర స్వామి వెళ్లి తుంబురుడిని బుజ్జగించారని, అందుకే ఆ ప్రాంతానికి తుంబుర తీర్థంగా పేరు గాంచిందని స్థల పురాణం. శ్రీవారి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలోనే స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి. తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినాన తిరుమల నుంచి ఉత్సవమూర్తులను మేళతాళాలతో మాడవీధులలో ఊరేగించి అనంతరం ఊరేగింపుగా తుంబుర తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడ వైఖానస ఆగమ పద్ధతిలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణి చేస్తారు.
తీర్థ స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకుని దానధర్మాలు చేస్తే ముక్తి కలుగుతుందని పురాణ వచనం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. తుంబుర తీర్ధ ముక్కోటిలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.