యాత్రికుల రక్షణపై టీటీడీ దృష్టి..

అలిపిరి, తిరుమలలో ప్రత్యేకంగా తనిఖీలు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-13 04:37 GMT

ఆధ్యాత్మిక నగరం తిరుపతి, తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. రోజువారి తనిఖీల కంటే భిన్నంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనాలతో పాటు, లగేజీని కూడా పరిశీలించిన తరువాతే యాత్రికులను తిరుమలకు అనుమతిస్తున్నారు. తిరుమలకు ముఖద్వారంగా ఉన్న అలిపిరి చెక్ పాయింట్ వద్ద టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంతో పాటు, తిరుపతి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు మరింత ఎక్కువ చేసింది.


తనిఖీలు ఆలస్యం..
అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీలు ఆలస్యం కావడం వల్ల పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు దీరుతున్నాయి. ఇక్కడ 12 లేన్లు ఉన్నప్పటికీ ప్రతి వాహనాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బందితోపాటు బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో వాహనాలు ముందుకు కదలడం ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపించింది.
అలిపిరి వద్ద వాహనాలు వెళ్లడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దీనిపై అలిపిరి ఏవీఎస్ఓ రమేశ్ ఏమంటారంటే..

Full View

"భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ కొన్ని ప్రామాణికాలు పాటిస్తుంది. సీవీఎస్ఓ ఆదేశాలతో గతంలో వాహనాలు వెళ్లడానికి ఉన్న లేన్లు పెంచారు. ఇక్కడ ఎనిమిది లేన్లలో యాత్రికుల వాహనాలు అనుమతిస్తాం. 9,10 లేన్లు ద్విచక్ర వాహనాలు,11, 12 లేన్లలో ఆర్టీసీ బస్సులు అనుమతిస్తాం" అని ఏవీఎస్ఓ రమేశ్ చెప్పారు.
"నిత్యం అన్ని వాహనాలు తనిఖీ చేయడం, యాత్రికులను మెటల్ డిటెక్టర్ మార్గంలో నుంచి తనిఖీలు చేస్తుంటాం. యాత్రికుల లగేజీ కూడా స్కానింగ్ జరుగుతుంది. ఆ తరువాతే అది ఆర్టీసీ బస్సు అయిన, ప్రవేయిటు వాహనమైనా తిరుమలకు వెళ్లడానికి అనుమతిస్తాం" అని రమేశ్ వివరించారు. దీనికోసం టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ విభాగంలోని సిబ్బంది, ఎస్పీఎఫ్ దళాలు రోజంతా అప్రమత్తంగా విధుల్లో ఉంటారని ఆయన వివరించారు.
"తిరుమల, తిరుపతిలో యాత్రికులకు భద్రత కల్పించే దిశగానే చర్యలు తీసుకుంటున్నాం" అని టిటిడి cvso మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్పష్టం చేశారు.
ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసుల తోపాటు టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది కూడా మరింత అప్రమత్తమయ్యారు.
తిరుమలకు రోజుకు సరాసరిగా పది వేలకు పైగానే వ్యక్తిగత వాహనాల్లో యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. మరో ఐదు వేల టాక్సీలు కూడా తిరుపతి, తిరుమల మధ్య తిరుగుతుంటాయి. ఆర్టీసీ బస్సులు 350 వరకు తిప్పుతున్నారు. ఈ వాహనాల తోపాటు యాత్రికులను తనిఖీ చేయడంలో టీటీడీ భద్రతా సిబ్బందికి క్షణం కూడా విశ్రాంతి లేని పరిస్థితి అలిపిరి వద్ద కనిపిస్తుంది. అలిపిరి టోల్ గేట్ లో జరిగే తనిఖీలను ఇక్కడే ఏర్పాటు చేసిన కార్యాలయం కంట్రోల్ రూం నుంచి టీటీడీ ఏవీఎస్ఓ, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు గమనిస్తూనే ఉంటారు.
డేగకళ్లతో...

అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద ఎస్ పి ఎఫ్ (special protection force) సిబ్బంది రోజువారి సాధారణంగానే తనిఖీలు చేయడం సర్వసాధారణం. నిషేధిత వస్తువులు తిరుమల కొండపైకి వెళ్లకుండా నివారించడంలో వీరి పాత్ర కీలకమైనది. అంతేకాకుండా యాత్రికులను, వారి లగేజీలను కూడా స్కానింగ్ చేయడానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్ ల నుంచి యాత్రికులు కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రతి యాత్రికుని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. లగేజీని కూడా స్కానింగ్ చేసిన తర్వాతే అనుమతించడం ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తుంది.
పటిష్ట రక్షణ వ్యవస్థ
టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం (TTD vigilance and security wing) లో సుమారు 2400 మంది రక్షణ భద్రత విధుల్లో ఉంటున్నారు. ఇందులో ఏపీఎస్పీ, ఏ ఆర్ విభాగాల నుంచి డిప్యూటేషన్ పై టీటీడీ బిజినెస్ విభాగంలోకి తీసుకున్నారు. వీరికి తోడు ఎస్పీఎఫ్ సిబ్బంది మరో 500, ప్రత్యేకంగా టిటిడి సెక్యూరిటీ గార్డులు మరో 200, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఔట్సోర్సింగ్ కింద తీసుకున్న యువకులు కూడా వందల సంఖ్యలో ఉన్నారు.
టీటీడీ అనుబంధ ఆలయాలు, అలిపిరి చెక్ పోస్ట్, అలిపిరి కాలిబాట, శ్రీవారి మెట్టు కాలిబాట తో పాటు తిరుమల లోని అనేక విభాగాలు కేంద్రాల్లో వీరు 24*7 విధుల్లో ఉంటారు.
నిషేధిత వస్తువులపై గురి..

తిరుపతి, తిరుమలలో సాధారణంగానే సివిల్ పోలీసులతోపాటు టిటిడి ఆలయాల వద్ద విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనుమానాస్పద ప్రాంతాలలో సివిల్ పోలీసులు నిఘా పెంచారు. టిటిడి సెక్యూరిటీ విభాగం సిబ్బంది కూడా తనిఖీలతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్న దృశ్యాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ తనిఖీలతో యాత్రికులు ఆందోళనకు గురికాకుండా వారికి నచ్చ చెబుతున్నారు.
"ఇవి సాధారణంగా జరిగే తనిఖీలే. ఆందోళన చెందకండి. ఆనందంగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోండి. క్షేమంగా మీ ఊర్లకు తిరిగి వెళ్ళండి. అంతవరకు మీకు మేము అండగా ఉంటాం" అని టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సిబ్బంది యాత్రికులకు ధైర్య వచనాలు చెబుతున్నారు. శ్రీవారిని దర్శించుకోవాలనే సంకల్పంతో వచ్చే యాత్రికులు ఇవేమీ పట్టించుకోకుండా భద్రతా సిబ్బందికి కూడా సహకార అందిస్తూ ఆ తర్వాత తిరుమలకు వెళుతున్న దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News