TIRUMALA | పెంచలయ్యా.. శ్రీవారి హుండీనే ఎలా దోచావయ్యా!
ఓ అరకోటి బంగారం బిస్కెట్లు, ఓ పావుకిలో చిన్నా చితకా ఆభరణాలు, ఓ 200 గ్రాముల వెండి వస్తువులు పెంచలయ్య ఇంట్లో దొరికాయి. చూద్దాం ఏమవుద్దో..;
By : The Federal
Update: 2025-01-14 01:30 GMT
ఇతని పేరు వీరిశెట్టి పెంచలయ్య.. ఊరు తిరుపతి. వయసు మహాఅయితే 35,40 ఏళ్లుండవచ్చు. తిరుమలలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి. కాంట్రాక్ట్ ఉద్యోగే కదా అని తీసిపారేయకండి.. ఎక్కడ చేతి వాటాన్ని ప్రదర్శించవచ్చో తెలిసిన వాడు. ఎక్కడుంటే ఆదాయం వస్తుందో బాగా ఆరితేరిన వాడు. తెలివైన వాడు. అందరికీ తల్లో నాలుకలా మెలిగే వాడు. తనకు ఏమి కావాలో బాగా తెలిసిన వాడు. అగ్రిగోస్ కంపెనీ ద్వారా చేరిన వాడు. వడ్డికాసుల వాడు, గోవింద నామ స్మరణీయుడు శ్రీవెంకటేశ్వర స్వామి హుండీకే కన్నం వేసిన వాడు.
ఎంతటి తెలివిగల దొంగైనా ఎక్కడో చోట ఏదో ఒకటి మరచిపోతాడని, తద్వార పట్టుబడతాడని నానుడి. ఇప్పుడు పెంచలయ్య పరిస్థితీ అదే. సాగినంత కాలం నా అంతటి వాడు లేడందరు అనే పాట ఉండనే ఉండే.
తిరుమల పరకామణిలో బంగారం మాయం కావడం కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా మంది దోచారు, చిక్కారు. కటకటాల పాలయ్యారు. పెంచలయ్య కూడా అదే పని చేశాడు. కాకపోతే ఇతను కాంట్రాక్ట్ ఉద్యోగి. పొయ్యేదేమీ లేదు, వచ్చేదే తప్ప అనుకున్నాడు గాని ఇన్ని కష్టాలు వస్తాయనుకోలేదు.
కాంట్రాక్ట్ ఉద్యోగి. రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చుకుంటే జీతం కూడా తక్కువే. ఇంతమందిని ఆదుకునే దేవుడు తనను ఆదుకోలేక పోతాడా అనుకున్నాడు. ఎందరెందరికో కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన శ్రీవారు తనకూ ఏదో ఛాన్స్ ఇవ్వకపోతాడా అనుకున్నాడు. నక్కను తొక్కి వచ్చినట్టుగా నిజంగానే ఛాన్స్ దక్కింది. ఎందరెందరికో దక్కని పరకామణి (శ్రీవారి హుండీలో పడే డబ్బుు, బంగారం లెక్కించే) అవకాశం దొరికింది. అందరి మెప్పు పొందిన పెంచలయ్య "వచ్చిన ఛాన్స్ ను దుర్వినియోగం" చేసుకోకుండా సీసీ కెమెరాల కన్నుగప్పి, "చుట్టుపక్కల వారి సహాయ సహకారాలతో" చేతి వాటాన్ని ప్రదర్శించారు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటే తప్ప... ఏదైనా చేయగలమనే ధీమా పెంచలయ్యది. ఆ దారిలోనే జనవరి 11న పరకామణి నుంచి ఓ 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగిలించాడు. అయినా కెమేరాలు పసిగట్టలేదు. అష్టకష్టాలు పడి ఓ వంద గ్రాముల బంగారాన్ని దోచి ఎక్కడెక్కడో దాస్తే ఆ విజిలెన్స్ వాళ్లెవరో (వాళ్లకి దక్కాల్సింది వాళ్లకి దక్కక పోవడం వల్లనో ఏమో- ఇది మా మాట కాదు, సహ ఉద్యోగులు చెబుతున్నదే) కనిపెట్టి ఈ పెంచలయ్యను బుక్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని నాలుగు తగిలించి విచారిస్తే విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
ఈ విస్తుపోయే నిజాలు ఏంటంటే...
తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య లాంటి వారు శ్రీవారి పరకామణిలో చాలామందే ఉన్నారట'. అయినా దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర. అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించడం పెంచలయ్య టార్గెట్. దానికి తగ్గట్టే పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉద్యోగం సంపాయించారు. శాంపిల్ గా చిన్న చిన్న బంగారు వస్తువులను తస్కరించడం మొదలు పెట్టాడు. ఆ డబ్బుతో కొండ కింద జల్సా చేయడం మొదలుపెట్టాడు. పెంచలయ్య తీరుపై అనుమానం టీటీడీ విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. సిబ్బందితో నిఘా పెట్టించారు. జనవరి 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బిస్కెట్‌ను దొంగిలించాడు. ట్రాలీకి ఉన్న పైపులలో దాచిపెట్టాడు. అసలే అనుమానంతో ఉన్న విజిలెన్స్ సిబ్బంది సోదాలు మొదలుపెట్టారు. అక్కడున్నది పెంచలయ్య ఒక్కడే. బిస్కెట్ ఎలా మాయం అయిందబ్బా అని భద్రతా సిబ్బంది మల్లగుల్లాలు పడుతుంటే.. ఇతగాడు అక్కడి నుంచి పరారయ్యాడు.
విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు కట్టారు. దర్యాప్తు మొదలుపెట్టారు. పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలి అనే మాట ఒకటుందిగా అలా నాలుగు తగిలించి విచారించారంటున్నారు.
ఆ విధంగా పెంచలయ్య నోరు విప్పాడు. తన చోరీల చిట్టతో పాటు మరికొందర్ని కూడా ఇరికించాడంటున్నారు. మొత్తం మీద ఈ దొంగల ముఠా గుట్టురట్టయినట్టు సమాచారం.
పరకామణి నుంచి పెంచలయ్య ఇప్పటి వరకు ఓ అరకిలోకి పైగా బంగారాన్ని కాజేశాడు. ఇంచుమించు 600 గ్రాములని అంచనా. ఇవన్నీ బంగారు బిస్కెట్లే. ఇవి గాక భక్తులు వెంకటేశ్వర స్వామి హుండీలో వేసిన చిన్నా చితకా అభరణాలు అంటే ముక్కుపుడకలు, చెవిపోగులు, గాజులు వంటివి సుమారు ఓ పావు కేజీ, ఓ 160, 170 గ్రాముల వెండి వస్తువులను కాజేశానని, కావాలంటే వాటన్నింటినీ ఇచ్చేస్తానని, కొట్టొద్దని పోలీసులకు దండం పెట్టి మరీ చెప్పాడు. ఎప్పుడెప్పుడు ఈ విషయాన్ని చెబుతాడా అని ఎదురుచూస్తున్న పోలీసులు.. పెంచలయ్య ఆ మాట చెప్పిన వెంటనే ఆయనింటికి వెళ్లారు. మొత్తం గాలించి ఓ అరకొటికి పైగా విలువైన బంగారపు బిస్కెట్లని, వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదిట్లా ఉంటే.. పెంచలయ్య ఇంకెవరెవర్ని ఈ కేసులో ఇరికించి ఉంటాడో అని పరకామణిలోని ఇతర సిబ్బంది హడలి చస్తున్నారు. పెంచలయ్య చెప్పిన పేర్లున్న వాళ్లను వెంటనే ఏమీ చేయకపోవచ్చు గాని వాళ్లని ఓ కంట కనిపెట్టి ఉండడం మాత్రం నిజం.
పాత సినిమాల్లో మాదిరే ఈ కేసులో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన తిరుమల వన్ టౌన్ పోలీసు సిబ్బందిని తిరుమల అదనపు ఎస్పీ, డీఎస్పీ అభినందించారు. అంతవరకు బాగానే దొంగల్ని పట్టుకున్న వాళ్లకి నాలుగు రాళ్లు ఏమైనా ఇస్తారో లేదో చూడాలి.