ALLU ARJUN | రాష్ట్రాన్ని'అల్లు'కున్న ప్రకంపనలు
పుష్ప వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఆ ప్రభావం ఏపీలో ఎక్కువగా ఉంది. అధికారపక్షం ఓ రకంగా స్పందిస్తే, ప్రతిపక్షాలు బాసటగా నిలుస్తున్నాయి.
By : SSV Bhaskar Rao
Update: 2024-12-23 14:10 GMT
రాష్ట్రంలో తరచూ భూ ప్రకంపనలు భయం రేపుతున్నాయి. పుష్ప అరెస్టు వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ ఇప్పటి వరకు అండగా ఉంది. తాజాగా టీడీపీ కూటమిలోని బీజేపీ కూడా అభయం ఇచ్చింది.
రాయలసీమలో విస్తరించి ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా పుష్ప, పుష్పా-2 సినిమాలు చిత్రీకరించారు. క్రేజ్ ఉన్న హీరో కావడంతో పుష్పా-2 సినిమా అభిమానుల వల్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ బద్దలు చేసింది. దీనికి ప్రభుత్వాల సహకారం కూడా లభించడం వల్లే సాధ్యమైందని చెప్పడంలో సందేహం లేదు. చిత్ర పరిశ్రమకు పాలకులు స్నేహహస్తం లభించడం వల్లే ఇది సాధ్యమైంది. ఇదే మొదటిసారి కాదు. చివరిది కూడా కాకపోవచ్చు.
దురదృష్టం వెంటాటడం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా పుష్పా-2 ప్రీరిలీజ్ సినిమా ప్రదర్శన వల్ల హైదరాబాద్ సంధ్య ధియేటర్ వద్ద అభిమానులు పోటెత్తారు. అదే రోజు అల్లు అర్జున్ కూడా అదే ధియోటర్ లో సినిమా చూడడానికి రావడం వల్లే అభిమానులు నుంచి మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పటి వరకు అంతా ప్రశాంతంగానే ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియర్ చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వడమే కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధర పెంపుదలకు ఏకంగా జీఓలు కూడా ఇవ్వడం తెలిసిందే. టికెట్ ధర పెంచడానికి అనుమతి ఇవ్వకున్నా, అభిమానులు ఎంత మొత్తం చెల్లించి అయినా సరే. టికెట్ కొనడానికి వెనుకాడరు. అది కేవలం అల్లు అర్జున్ సినిమానే కాదు. ఏ కథానాయకుడి చిత్రమైనా వారి అభిమానులు ఎగబడడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయం పక్కకు ఉంచుదాం.
పుష్పా-2 సినిమా రిలీజ్ సమయం దగ్గర పడింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచవ్యాపితంగా రిలీజ్ చేసిన ఈ సినిమాకు అభిమానులు వేలంవెర్రిగా ఎగబడ్డారు. అదే హైదరాబాద్ లో కూడా చోటుచేసుకుంది. అంతా సవ్యంగా జరిగి ఉంటే, ఇక సమస్య ఏమీ ఉండేది కాదు.
పక్కకు జరిగిన అదృష్ట దేవత
పుష్పా-2 కథానాయకుడు అల్లు అర్జున్ సినిమా ధియేటర్ వద్దకు వచ్చే వరకు వెంట ఉన్న అదృష్ట దేవత పక్కకు తప్పుకున్నట్లు ఉంది. పోటెత్తిన అభిమానం మధ్య జరిగిన తొక్కిసలాటలో ఈ సినిమా చూడడానికి హైదరాబాద్ నగరం దిల్ సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన రేవతి తన కొడుకుతో సహా వచ్చింది. అల్లు అర్జున్ సినిమా ధియేటర్ లోకి వెళ్లిన తరువాత చోటుచేసుకున్న పరిణామాల మధ్య జరిగిన తోపులాటలో అభిమానం హద్దులు మీరి, రేవతి చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ, మృత్యువుతో పోరాటం సాగిస్తున్నాడు.
వివాదానికి బీజం...
ఈ సంఘటన తరువాత అల్లు ఫ్యామిలీపై రాజకీయ నీడలు వ్యాపించాయి. అప్పటికే సొంతం చేసుకున్న వైసీపీ అల్లు అర్జున్ కు అండగా నిలిచింది. దీనికి కారణం కూడా లేకపోలేదు.
2024 ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (శిల్పా రవి) పోటీ చేశారు. ఆయన కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా నంద్యాలలో ప్రత్యక్షం అయ్యారు. ఈ హఠాత్ పరిణామం రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. టీడీపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న స్వయానా బాబాయ్ (మామ ) కొణిదెల పవన్ కల్యాణ్ ను ఇరకాటంలో పడేసిన విషయం తెలిసిందే.
మారిన సీన్
పుష్పా-2 సినిమా ప్రీరిలీజ్ నేపథ్యంలో "మా కోసం నువ్వు వచ్చావ్. నీ కోసం మేము ఉన్నాం" అని వైసీపీ శ్రేణులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాను స్వాగతించాయి. సంధ్య ధియోటర్ అవాంఛిత ఘటన నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు కన్నెర్ర చేస్తే, ప్రతిపక్షాలు బన్నీకి బాసటగా నిలిచాయి.
అరెస్ట్ తరువాత
సంధ్య ధియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తరువాత రాజకీయంగా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒత్తిళ్లు, విమర్శల తరువాత ప్రీరిలీజ్ సందర్భంగా బందోబస్తు నిర్వహించిన పోలీసులే కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి, చంచల్ గూడ జైలుకు తరలించినా, అదే రోజు సాయంత్రం మంజూరైన మధ్యంతర బెయిల్ పత్రాలు రావడం ఆలస్యం కావడం వల్ల మరుసటి రోజు ఉదయం అల్లు అర్జున్ బయటికి వస్తూ,, జైలు వద్ద చేరిన అభిమానులకు అభివాదం చేస్తూ, సాగారు. అయితే,
బెయిల్ వచ్చిన తరువాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. "వివాదం కోర్టులో ఉన్న కారణంగా బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించం చట్టం అంగీకరించదు" అని కూడా వ్యాఖ్యానించారు. జరిగిన సంఘటనకు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. ఈ మాటలు పోయిన రేవతి ప్రాణం తిరిగి రాదు. చావుబతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు శ్రీతేజ్ కోలుకోలేడు. ఈ ఎపిసోడ్ అంతా, "బాధిత కుటుంబానికి పరామర్శ, పరిహారం చుట్టూ పరిభ్రమిస్తే.. అధికార పార్టీలపై దుమ్మెత్తి పోయడానికి ప్రతిపక్షాలకు ఆయుధం"లా దొరికింది.
వైసీపీకి తోడు బీజేపీ అండ
సంధ్య ధియోటర్ సంఘటనే కాదు. మొదటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మేనల్లుడు అయిన అల్లు అర్జున్ ను వైసీపీ సొంతం చేసుకుంది. న్యాయవాది అయిన తమ పార్టీ రాజ్యసభ సభ్యుడిని స్వయంగా రంగంలోకి దించి, న్యాయ సహాయం కూడా అందించింది. దీని ద్వారా అల్లు అర్జున్ కు రాజకీయంగా మద్దతు దొరికింది.
"జరిగిన సంఘటనకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సరైంది కాదు" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రెండు రోజుల కిందట ప్రకటన ఇవ్వడం ద్వారా అల్లు అర్జున్ కు అండగా నిలిచారు.ఈ ఘటనలో ఏ-1 , ఏ-2 ను కాదని 11 వ నిందితుడిని అరెస్టు చేయడం ఏమిటనే ప్రశ్న కూడా లేవనెత్తడం గమనార్హం. స్వయాన తెలుగు సినిమా లెజెండ్ ఎన్టీ. రామారావు కూతురిగా సినిమా వ్యవహారాలను చిన్నప్పటి నుంచి ఆస్వాదించిన వ్యక్తిగా కూడా ఎంపీ పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు సినిమారంగానికి అండగా నిలిచినట్టే కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ఆసక్తి రేకెత్తించాయనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ నిప్పులు చెరిగారు. ఓ వ్యక్తి కోసం అసెంబ్లీలో ఇంత చర్చ జరగడం. రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. నిందలు పడిన వ్యక్తి గా అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా తన వివరణ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం మరింత ఆజ్యం పోసింది. దీనిపై పోలీస్ అధికారుల స్పందన రాజకీయ నేతలను మించి పోయింది. ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ఏపీలోని ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ, "పోలీసులపై రాజకీయ విమర్శలు ఉంటాయి. సర్వీస్ రూల్స్ ఒకటే కాదు. తమ శాఖలో క్రమశిక్షణ అనే లక్ష్మణ రేఖ దాటకూడదు" అని గుర్తు చేశారు.
"రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఉండబోదు." అంటూ,నే పోలీసులు బహిరంగ ప్రకటనలు జారీ చేయడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతా జరిగాక నాలుక కరుచుకున్నట్టు హైదరాబాద్ సీపీ సహా, ఏసీపీ కూడా క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి కల్పించుకున్నారు.
ఈ వ్యవహారంలో వైసీపీ పుష్పాకు అండగా నిలవడం కూడా టీడీపీ కూటమికి మింగుడు పడని పరిస్థితి. ఈ పరిణామాలు రాజకీయంగా ఇంకా ఎలాంటి ప్రకంపనలు సృష్టిందనేది వేచిచూడాలి.