శ్రీరామనవమి రోజు ఏపీలో విషాదం

కృష్ణా నదిలో ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందారు.;

By :  Admin
Update: 2025-04-06 13:03 GMT

శ్రీరామనవమి పర్వదినం రోజున ఆంధ్రప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో మోదుమూడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు కృష్ణా నదిలో స్నానం చేద్దామని దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో బాధిత కుటుంబాలు తీరని శోక సముద్రంలో మునిగి పోయాయి. శ్రీరామనవమి పర్వదినం నాడు కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటున్న సమయంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఒకే సారి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకోవడంతో మోదుమూడి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

శ్రీరామనవమి పండుగైన ఆదివారం రోజున సరదాగా నదీ స్నానం చేద్దామని మత్తి గోపికిరణ్‌(15), ఎం వీరబాబు(15), ఎం వర్థన్‌(16)లు కృష్ణా నదిలోకి దిగారు. కొద్ది సేపు ఈత కొట్టిన ఈ ముగ్గురు బాలురు తర్వాత గల్లంతయ్యారు. సరిగా ఈతరాని ఈ ముగ్గురు బాలురు నది లోతును అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నది నీటిలో మునిగి కొట్టుకొని పోయారు. అయితే మునిగి పోతున్న సమయంలో ఆ ముగ్గురు బాలురు పెద్దగా అరిచారు. ఈ అరుపులు విన్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ముగ్గురు బాలురు ప్రమాదం అంచున ఉండటంతో స్థానికులు కాపాడలేక పోయారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గల్లంతైన ఆ ముగ్గిరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నీటిలో మునిగి పోయి మరణించి ముగ్గరిలో తొలుత మత్తి వెంకట గోపి కిరణ్‌ మృత దేహం దొరికింది. తర్వాత తక్కిన ఇద్దరు ఎం వీరబాబు, ఎం వర్థన్‌ల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. పోస్టుమర్టం నిమిత్తం ఆ ముగ్గురి మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న వయసులోనే మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ దుర్ఘటన స్థానికులను సైతం కలచివేసింది. కన్నీటి పర్యంతమయ్యారు.
Tags:    

Similar News