TOMATO CRISIS | కిలో టమాటా రూ.1కి కొనరా? వ్యాపారుల తీరుకు రైతుల నిరసన
రిటైల్ మార్కెట్ లో కిలో టమాటా రూ.20, 25 రూపాయల మధ్య పలుకుతుంటే కష్టపడి పండించిన రైతుకు మాత్రం కిలోకి రూపాయి కూడా రావడం లేదు. దీంతో రైతులు రగిలిపోతున్నారు.
By : The Federal
Update: 2024-12-13 04:49 GMT
టమాటా ధరలు మళ్లీ దారుణంగా పడిపోయాయి. కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అనే సామెతగా తయారైంది. రిటైల్ మార్కెట్ లో కిలో టమాటా రూ.20, 25 రూపాయల మధ్య పలుకుతుంటే కష్టపడి పండించిన రైతుకు మాత్రం కిలోకి రూపాయి కూడా రావడం లేదు. దీంతో రైతులు రగిలిపోతున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు కిలో టమాటా రూపాయి, అంతకంటే తక్కువ ధరకి మాత్రమే కొంటామని చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. ఉత్తపుణ్యానికి అమ్ముకోలేమంటూ మార్కెట్ యార్డులోనే నేలపై పారబోశారు. సమీపంలోని పత్తికొండ- గుత్తి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. మంచి నాణ్యత ఉన్న సరకుకు కూడా వ్యాపారులు ధర పెట్టడం లేదు. తక్కువకు వేలం పాడుతున్నారని రైతులు మండిపడ్డారు. దీనిపై మార్కెట్ యార్డు కార్యదర్శి కార్నోలీస్ మాట్లాడుతూ ‘వారం రోజులుగా టమాటా ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, పూర్తిగా పడిపోలేదు. ఈ రోజు నాణ్యతలేని సరకును మాత్రమే వ్యాపారులు తక్కువ ధరకు అడిగారు. తోటల్లో సాగు చేసిన టమాటా క్వింటాలు ధర రూ.1,800 వరకు పలికింది. మెట్ట భూముల్లో సాగు చేసిన పంట నాణ్యత దెబ్బతింటోందని వివరించారు.
అధికారులు చెప్పిన లెక్క ప్రకారం చూసినా కిలో రూపాయి 80 పైసలకు మించడం లేదు. బయట మార్కెట్ మాత్రం వినియోగదారులు కిలో 20 రూపాయలకు తక్కువ కాకుండా కొనుక్కోవాల్సి వస్తోంది. ఈసీజన్ లో దిగుబడి ఎక్కువగా ఉండే మాట నిజమే అయినా ఇంత దారుణంగా రేటు పడిపోవడాన్ని రైతు సంఘాల నేతలు తప్పుబట్టారు. వ్యాపారులు సిండికేట్ అయి రైతులకు కనీసం సాగుబడి ఖర్చులు కూడా రాకుండా చేస్తున్నారని ఏపీ రైతు సంఘం నాయకుడు కేవీవీ ప్రసాద్ అన్నారు. రైతులకు న్యాయం చేసేలా రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ చర్యలు చేపట్టాలని కోరారు.
కొన్ని రోజుల క్రితం కళ కళలాడిన టమాటా ఇప్పుడు ధర లేక నేలచూపులు చూస్తోంది. ఆరుగాలం శ్రమించి, రూ.లక్షల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి రావడం లేదని టమాటా రైతన్నలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పతనమై రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే సమయంలో గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కిలో టమాటా రూపాయి, అంతకంటే తక్కువ ధరకు అడగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రహదారిపై నిరసనకు దిగారు.దీనివల్ల రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.