ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు ఈరోజు ఇలా..

ఆంధ్రలో ఎన్నికల ప్రచార హోరు రోజురోజుకు అధికం అవుతోంది. ఎన్నికల దగ్గరపడుతుండటంతో ప్రతి పార్టీ ప్రచారంలో దూకుడు పెంచుతోంది.

Update: 2024-05-01 03:18 GMT

ఆంధ్ర ఎన్నికలకు మరెంతో సమయంలో లేదు. దీంతో రాష్ట్రమంతటా పార్టీల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. తమను గెలిపించండంటే తమను గెలిపించమని ప్రధాన పార్టీలు ఓటర్లను కోరుకుంటున్నాయి. అందుకోసమే తాము అధికారంలోకి వస్తే అందరికీ సంక్షేమం ఉంటుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బహిరంగ సభలు పెట్టి మరీ వివరిస్తున్నారు. అంతేకాకుండా తమ ప్రత్యర్థుల వైఫల్యాలను కూడా ఎండగడుతున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీ కూటమి తమ మేనిఫెస్టోను కూడా విడుదల చేశాయి. దీంతో తమ కాన్సంట్రేషన్ అంతా ప్రస్తుతం ప్రచారంపై పెట్టేశాయి. మిగిలి ఉన్న ఈ 10 రోజుల్లో ప్రజలను తమవైపు తిప్పేసుకుని గెలవాలని పార్టీలు తెగ ఉబలాటపడుతున్నాయి. మరి పార్టీలు చేస్తున్న ప్రచారాలు ఈరోజు ఎక్కడెక్కడ జరగనున్నాయంటే..

జనసేనాని పవన్ కల్యాణ్.. ఈసారి ఎలాగైనా తాను పోటీ చేస్తున్న చోట గెలవాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలని శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఈరోజు ఉదయం 10 గంటలకు మండపేట పట్టణంలో పర్యటించి అక్కడ ఓ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎలమంచిలి నియోజకవర్గం అచ్చాపురంలో వారాహి విజయభేరి సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు పెందుర్తిలో మరో సభను నిర్వహించనున్నారు.

ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈరోజు బద్వేల్‌లో దాదాపు ఆరు గ్రామాల్లో ఆమె ప్రసంగించనున్నారు. తొలుత కాసినాయన మండలంలోని వారికుంట్ల గ్రామంలో ఆమె రోడ్‌షో నిర్వహించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కలసపాడు మండలం చేరుకుని అక్కడ రాంపురం, తంబళ్లపల్లి ప్రసంగాలు ఇవ్వనున్నారు. అదే విధంగా సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె పోరుమామిళ్ల మండలంలోని పోరుమామిళ్ల గ్రామంలో మూడో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం భోజన విరామం.. విరామం తర్వాత బీ. కోడూరులో షర్మిల పర్యటించి అక్కడ, పెద్ద గోపవరంలో సభ నిర్వహించనున్నారు. సాయంత్రం సమయంలో బద్వేల్ టౌన్ చేరుకుని ఎస్ వెంకటాపురంలో ఈరోజుకు ఆఖరికి సభను నిర్వహిస్తారు.

సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఈరోజు ఉదయం 10 గంటలకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో ప్రారంభం కానుంది. బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్‌లో ఆయన ప్రచార సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పాయకరావుపేట నియోజకవర్గంలో మరో సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంటు పరిధిలో ముచ్చటగా మూడో సభను జగన్ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News