ఎపి రాజకీయాలు ప్రజలకు ఏ మేరకు మేలు చేస్తాయి

రాష్ట్రంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయా? అందులో భాగంగానే తిరుపతి లడ్డూ వ్యవహారం తెరపైకొచ్చిందా?

Update: 2024-09-22 11:53 GMT

వరద రాజకీయాలు, ఇప్పుడు తిరుపతి లడ్డూ రాజకీయాలు, మరో పక్క సనాతన ధర్మ రాజకీయాలు, ఇంకో పక్క సినీనటి జత్వానీ కేసు, అంతకు ముందు రెవెన్యూ రికార్డుల కాల్చివేత, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు ఏ స్థాయిలో మేలు చేస్తాయనే దానిపై చర్చ మొదలైంది. పాలకులపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా హుందాగా స్వీకరించి వాటిలో మంచిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ నేటి రాజకీయాలు అలా లేవు. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడంతోనే సరిపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ప్రచారాల్లో ప్రజలకు జరిగే మేలు ఏదైనా ఉందా అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఈ రాజకీయ నాయకులు, పాలకుల తీరును మేధావులు పూర్తి స్థాయిలో తప్పు పడుతున్నారు.

మూడు నెలలను పక్కన బెడితే మూడు రోజులుగా తిరుపతి లడ్డు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అన్న క్యాంటిన్‌లు ప్రారంభిస్తూ తిరుపతి లడ్డుకు వాడే నెయ్యిలో గొడ్డు కొవ్వు కలుపుతున్నారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన రెండో రోజు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామికి అపచారం జరిగింది. తిరుపతి ప్రసాదాన్ని దేశమంతా మహా ప్రసాదంగా భావిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆదివారం నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నట్లు ప్రకటించి దీక్ష బూనారు. ఈ అంశం మరో సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ దీక్ష బూనారు. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనగానే నా మనసు వికలమైందని వ్యాఖ్యానించి ఎంతో మంది అభిమానుల మనస్సును తాకారు. అందుకే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినట్లు చెప్పారు. తప్పు చేసిన వారు మాత్రమే ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ప్రాయశ్చితమంటే తనను తాను శిక్షించుకోవడం. అంటే దేవుడిని ఆరాధించడంలో కూడా పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.
వరద బీభత్సం సృష్టించి ఎంతో మంది ప్రాణాలను తీసింది. లక్షలాది మంది ఆస్తులు నష్ట పోయారు. నేటికీ కొన్ని ఇళ్లల్లో పొయ్యి వెలిగించలేని దుస్థితి ఉంది. వరదలను కూడా కూటమి ప్రభుత్వం రాజకీయాలకే ఉపయోగించుకుందనే విమర్శలు వచ్చాయి. వరద వచ్చి విజయవాడ మునగడానికి జగనే కారణమని కూటమి నేతలు అటు వైపు వేలెత్తి చూపించి ప్రచారం చేయడంలో సక్సెస్‌ అయ్యారని పలువురు చర్చించుకోవడం విశేషం. వరద విజయవాడను ముంచెత్తి నేటికి 20 రోజులు. సాయం చేస్తామన్న ప్రభుత్వం ఇంత వరకు పైసా ఇవ్వ లేదు. కొంత మందికి సివిల్‌ సప్లైస్‌ రైస్, కొన్ని నిత్యావసర వస్తువులు నాలుగైదు రోజులకు సరిపడేలా ఇచ్చారు. ఇంత పెద్ద విపత్తుపై కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుపై బాధితులు పెదవి విరుస్తున్నారు.
అంతకు ముందు మదనపల్లిలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారనే దానిపైన పెద్ద తతంగం నడిచింది. డీజీపీ నుంచి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, ఇతర పోలీసులు, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సమగ్ర దర్యాప్తు జరిపాయి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఇద్దరు రెవెన్యూ అధికారులను, ఒక ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఇందులో ఉందని సీఎంతో సహా ఇతర ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అది కాస్త సద్దుమనగగానే కాదంబరి జెత్వానీ కేసును తెరపైకి వచ్చింది. ఆమెతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మాట్లాడి కేసు పెట్టించి, ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను సెస్పెండ్‌ చేయగలిగారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కార్యాలయంలో పని చేసిన వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో జగన్‌ను కూడా నిందితునిగా చేర్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించేలా వారికి కనిపించ లేదు.
ఇప్పుడు దేవాలయాల వ్యవహారం రాజకీయ చర్చకు వేదికైంది. తిరుమల లడ్డూ ప్రసాదాల్లో గొడ్డు కొవ్వును వాడుతున్నారని, అలాగే రాష్ట్రంలోని అన్నీ దేవాలయాల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చని ప్రభుత్వ పెద్దలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశిస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేయాల్సి పథకాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు ఇచ్చిన హామీల్లో ఒక్కటి మాత్రమే అమలవుతోంది. అది సామాజిక పెన్షన్ల పెంపు పథకం. అది కాకుండా సూపర్‌ సిక్స్‌లో ఉన్న మిగిలిన ఐదు పథకాలు ఊసే ఇప్పటి వరకు లేదు. మద్యం వ్యవహారంపై అప్పుడప్పుడు బాణాలు వదులుతున్నారు. గత ప్రభుత్వంలో మద్యం కొనుగోల్లో అవినీతి జరిగిందని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చే అంశాలపై దృష్టి పెట్టకుండా దేవుళ్లు, మతాలు, నేరాలు వంటి అంశాలపై దృష్టి పెట్టి ప్రజల దృష్టిని ప్రతిపక్షం అటెన్షన్‌ను మరల్చే రాజకీయాలు అధికార పక్షం చేస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మత రాజకీయాల అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధి అధ్యాయన వేదిక అధ్యక్షులు టీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ తన విద్యార్థి దశలో తిరుమల కొండపై ఉన్న పరిస్థితికి నేటికీ ఉన్న తేడాను వివరించారు. ఉన్నత పాఠశాల విద్యార్థుల సమస్యలపై 1977–78 విద్యా సంవత్సరంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ నాయకుడిగా ఒక సమావేశం నిర్వహించడానికి తిరుమల వెళ్లాను. కొండపై సమావేశాలు నిర్వహించకూడదని ఉపాధ్యాయులు చెప్పారు. మారు మాట్లాడకుండా దేవస్థానం అమలు చేస్తున్న నిబంధనలను గౌరవించి వెనుదిరిగి వచ్చేశాను. కొంత కాలంగా చూస్తున్నాం. చట్ట సభల సభ్యులు, మంత్రులు, హంగూ ఆర్భాటాలతో దేవుడి దర్శనం చేసుకొని బయటకు రాగానే ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో కుసంస్కారంగా నోటికొచ్చినట్లు సంకుచిత రాజకీయ వ్యాఖ్యలు, కువిమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ‘భగవంతుడు సర్వాంతర్యామి’. అని భక్తుల విశ్వాసం కదా. అవినీతి రాజకీయ నాయకులు, పాలకులు అవినీతిని సర్వాంతర్యామిగా విస్తరింప చేశారు. దీని గురించి ప్రజలు ఆలోచించాలన్నారు. రైతులకు కావలసిన విత్తనాలు, పురుగు మందులు, రసాయనిక ఎరువులు, పశువుల దానా, అన్నింటిలోను కల్తీ జరుగుతోంది. పర్యవసానంగా తల్లి పాలు , కొబ్బరి నీళ్లతో పాటు అన్ని కల్తీ అవుతున్నాయనే ఆవేదన సమాజంలో ఉంది. దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందనే ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని మతోన్మాద శక్తులు విజృంభించి తమ స్వార్థానికి వాడుకునే అవకాశం ఉందని, దీనిని ప్రజలు సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కల్తీ జరిగి ఉంటే తప్పకుండా విచారణ జరిపి, దోషులను శిక్షించాలని అన్నారు.
ఆదివారం ఉదయం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటిని బీజేపీ యువ మోర్చా నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. భారీ స్థాయిలో తరలి వచ్చిన కార్యకర్తలు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ ఉన్న సెక్యురిటీ కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. జగన్‌ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ గేటుకు బీజేపీ రంగు కూడా వేశారు. నిదానంగా రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసుల దళం వీరందరినీ అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. తిరుమలలో లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీకి జగనే బాధ్యుడని వారు ఈ ముట్టడిని చేపట్టారు.
Tags:    

Similar News