తిరుమల: నాలుగువేల మందితో రక్షణ కవచం
బ్రహ్మోత్సవ సంబరానికి తుది సన్నాహాలు.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-18 13:56 GMT
తిరుమలలో ప్రస్తుతం ఉన్న అక్టోపస్ దళాల( Octopus Commandos ) తో పాటు 1,500 మంది టీడీడీ విజిలెన్స్ (TTD Vigilance and Security ) సిబ్బంది ఉన్నారు. అదనంగా తిరుపతి, తిరుమలలో నాలుగు వేల మంది పోలీసులను రంగంలోకి దించనున్నారు. నాలుగు వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 23వ తేదీ అంకురార్పణ జరుగుతుంది. 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వాహనసేవల నేపథ్యంలో పోలీస్ డేగకన్నుతో నిఘా ఉంచబోతోంది.
తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు గురువారం సాయంత్రం మీడియాకు చెప్పారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్యచౌదరి, సీవీ అండ్ ఎస్ఓ (TTD Chief Vigilance and Security Officer CVSO ) మురళీకృష్ణతో కలిసి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆ వివరాలు వెల్లడించారు.
మీడియాతో మాట్లాడుతున్న తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన వాహనసేవల్లో గరుడోత్సవం. ఈ ఉత్సవం పూర్తయితే సగం బ్రహ్మోత్సవం పూర్తయినట్టు భావిస్తారు. గరుడ వాహనంపై శ్రీవేంకటేశ్వరస్వామి ఊరేగింపును చూడడానికి తక్కువలో తక్కువ అంటే తిరుమలకు ఆ రోజు ఐదు లక్షల మంది యాత్రికులు హాజరవుతారు. దీంతో
"ఈ నెల 28వ తేదీ గరుడోత్సవం రోజు అదనంగా కూడా సిబ్బందిని విధుల్లో ఉంటారు" అని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు చెప్పారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"తిరుమలతో పాటు తిరుపతిలోని అలిపిరి సమీప ప్రాంతాల్లో ఐదు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశాం. గరుడోత్సవం రోజు ద్విచక్ర వాహనాలు తిరుమలకు అనుమతించం. ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ప్రయాణ చేయాలి" అని ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు.
భక్తుల భద్రత, సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూలో క్రమశిక్షణ, అత్యవసర వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఎస్పీ వివరించారు.
సమన్వయంతో విధులు
తిరుమలలో టీటీడీ భద్రతా సిబ్బందితో కలిసి పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తోపాటు టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ చెప్పారు.
"అదనపు పోలీస్ సిబ్బందిని నియమిస్తాం. యాత్రికుల కదలికలపై సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పరిస్థితిని గమనిస్తాం" అని ఎస్పీ సుబ్బారాయుడు వివరించారు. యాత్రికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా, టిటిడి, ఇతర విభాగాలతో సమన్వయంగా పోలీసులు పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు.
భద్రతకు ప్రాధాన్యం
యాత్రికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, విజిలెన్స్, పోలీసు శాఖలను సమన్వయం చేసే విధంగా బాధ్యతలు వికేంద్రీకరించామని టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ చెప్పారు. యాత్రికులు సొంత వాహనాలు కాకుండా, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం శ్రేయస్కరం అని ఆయన సూచించారు. సివిల్ పోలీసులతో కలిసి 1,500 మంది టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారని ఆయన తెలిపారు. విజిలెన్స్ తో పాటు అనుబంధ విభాగాలైన ఆక్టోపస్, ఎన్డీ.ఆర్.ఎఫ్ బలగాలు నిరంతరం భక్తుల భద్రతను పర్యవేక్షిస్తారని, నిఘా వ్యవస్థలో ఎలాంటి లోపం లేకుండా పనిచేస్తామన్నారు.
వసతులకు ఇబ్బంది లేదు..
బ్రహ్మెత్సవాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల, తిరుపతిలో ఎక్కడెక్కడ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఉన్నాయనే వివరాలు, ఆ ప్రదేశాలకు ఎలా వెళ్లాలనే దిశలు సూచించే వీడియో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
"శ్రీవారి ఆలయం సమీపంలో గ్యాలరీల నుంచి వాహన సేవలు జరిగే సమయంలో చిల్లర నాణేలు విసరవద్దు" అని వెంకయ్య చౌదరి సూచించారు. గ్యాలరీల్లోకి యాత్రికులు చెప్పులు ధరించడం, లగేజీ తీసుకురావద్దని ఆయన సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన), రవిమనోహరాచారి (శాంతిభద్రతలు), రామకృష్ణ తిరుమల, కులశేఖ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.