Tirumala - No Fly Zone | మరో సరిహద్దు వివాదంగా 'తిరుమల గగనతలం'

శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు వెళ్లడం వివాదం అవుతోంది. నో ఫ్లైజోన్ (No Fly Zone) చేయాలనే టీటీడీ వినతికి కేంద్రం నుంచి స్పందన లేదు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-04 09:20 GMT

2024 ఫిబ్రవరి 15వ తేదీ శ్రీవారి ఆనందనిలయం పైభాగం నుంచి రెండు జెట్ ఫ్లైట్లు ప్రయాణించాయి. డిసెంబర్ చివరిలో (నాలుగు రోజుల కిందట) కూడా ఉదయం 8.14 గంటలకు ఓ విమానం ప్రయాణించింది. దేశంలోని వివిధ నగరాల నుంచి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాల రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో కొన్ని సంస్థల విమానాలు తిరుమల గగనతలం నుంచి ప్రయాణించడమే వివాదంగా మారుతోంది. ఆ విషయం పరిశీలిద్దాం.


పంజాబ్ రాష్ట్రంలోని ఓ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (Indian Air force- IAF) నుంచి క్రాఫ్ట్ టెకాఫ్ కాగానే రెండు నిమిషాల్లో టర్న్ తీసుకోవాలి. లేదంటే, "పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశిస్తుంది. పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరుపుతారు" అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశ్రాంత పైలట్ రమేష్ చెప్పే మాట. "తిరుమల గగనతలంపై ప్రయాణించకుండా పైలట్, ఏటీసీ తీసుకోవచ్చు" అనేది రమేష్ సూచన చేస్తున్నారు.
సున్నిత ప్రదేశం...
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ, పరిసరాల్లో ఆగమశాస్త్రం ఆచారాలు, పద్దతులు అమలు చేస్తుంటారు. ఈ గగనతలంపై ప్రయాణించడం అంటే, శ్రీవారి మీది నుంచి వెళుతూ అపచారంగా పరిగణిస్తారు. స్వామివారితో పాటు తిరుమలలో నిత్యం లక్ష మందికి తక్కువ కాకుండా, యాత్రికులు, స్థానికులు, హోటళ్లలో పనిచేసే వారే కాకుండా, సిబ్బంది పారిశుధ్య కార్మికులతో రద్దీగా ఉంటుంది. తిరుమలలో రక్షణ పరంగా కూడా టీటీడీ సెక్యూరిటీ, ఎస్పీఎఫ్, అక్టోపస్ దళాలు నిత్యం అప్రమత్తంగా ఉంటాయి. ఇంతటి భద్రత కలిగిన ఆలయం సమీపంలోని ఆకాశంలో తరచూ విమానాలు విహరించడం చర్చకు తెరతీస్తున్నాయి. ఇదిలావుంటే..

తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయం నుంచి తిరుమలకు రోడ్డుమార్గం 32.1 కిలోమీటర్ల ఉంటుంది. ప్రయాణానికి గంట ఏడు నిమిషాలు పడుతుంది. దీనికి ఏమి ఇబ్బంది లేదు. గగనతలం దూరం తగ్గిపోతుంది.
రేణిగుంట విమానాశ్రయానికి ఆకాశమార్గంలో దూరం తేడా ఉం టుంది. అక్షాంశాలు, రేఖాంశాల ప్రామాణికంగా 10.17 కిలోమీటర్ల దూరం 6.32 నిమిషాల ప్రయాణానికి దగ్గరగా ఉంటుంది. డ్రైవింగ్ కోసం పైలెట్ తీసుకునే సమయం 13.32 కిలోమీటర్లు చుట్టు వేయడానికి 8.28 నిమిషాలు పడుతుంది. 259.97చ డిగ్రీల రౌండర్ లో కంపాస్ ఆధారంగా టేకాఫ్ తరువాత టర్న్ తీసుకోవడానికి ఆ సమయం పడుతుందనేది విమానయాన శాఖ చెబుతున్న వివరాలు.

క్రాఫ్ట్ టేక్ ఆఫ్ తీసుకున్న 3.12 నిమిషాల ప్రయాణానికి దగ్గరగా తిరుమల గగనతలంపైకి వెళుతుంది. హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చే విమానం కూడా రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుంది. దానికి కొన్ని నిమిషాలకు ముందే తిరుమల రెండవ ఘాట్ సమీపం నుంచి శ్రీనివాస మంగాపురం మీదుగా రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో దిగుతుంది. "ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ తన వెబ్సైట్లో ఉంచిన వీడియో" ఒకటి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అంటే..
రేణిగుంట విమానాశ్రయం నుంచి విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ కు ముందు విమానాలు తిరుమలగిరిలకు సమీపం నుంచే పర్యటిస్తున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి నివారించడానికి ఎవరు స్పందించాలి? చర్యలు తీసుకోవాలి?
విమానం నడిపే పైలెట్ జాగ్రత్త తీసుకోవాలా? ఏటీసీ ( Air traffic control) నియంత్రించాలా? దీనికి మాత్రం సమాధానం లేదు.
ఐఏఎఫ్ జెట్ ఫ్లైట్ మాజీ పైలెట్ రమేష్ ఏమంటారంటే... "విమానం నడిపే పైలెట్ కంపాస్ ఆధారంగా క్రాఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. లేదంటే రేణిగుంట ఏటీసీలో నియంత్రించాలి" అని అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా పంజాబ్ రాష్ట్రంలోని ఎయిర్ బేస్ స్టేషన్ నుంచి ఫ్లెట్, జెట్ విమానం టేకాఫ్ తీసుకున్న వెంటనే, పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించే ప్రమాదాన్ని నివారించడానికి పైలట్ అప్రమత్తంగా లేకుంటే జరిగే నష్టాన్ని గుర్తు చేశారు.
"తిరుమల అనేది ధార్మిక సంస్థ, ఆగమశాస్త్రం అమలు చేస్తారు. వేలాది మంది యాత్రికులు కొండపై ఉంటారు. అందువల్ల అన్ని సమస్యలు అధ్యయనం చేయడం ద్వారా నోఫ్లైన్ జోన్ గా ప్రకటించాలి" అనేది రమేష్ అభిప్రాయం.
టీటీడీ వినతి... కనిపించని స్పందన
తిరుమల శ్రీవారి క్షేత్రం పవిత్రమైనది. ఆలయంపైకి విమానరాకపోకలు నిషేధించండని టీటీడీ 2010 నుంచి కేంద్ర విమానయాన శాఖను కోరుతోంది. ఆ మేరకు లేఖ కూడా రాసింది. ఇప్పటికీ ఆ లేఖకు సమాధానం లేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. సెంటిమెంట్, క్షేత్రం భద్రతను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. అప్పట్లో ఎంపీ, టీటీడీ చైర్మన్ గా పనిచేసిన డీకే. ఆదికేశవులు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కానీ, నిర్ణయం మాత్రం వెలువడలేదు. దీంతో కేంద్ర విమానయాన శాఖ వద్ద టీటీడీ అలా ఉండిపోయింది. దీనిపై రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ అందుబాటులోకి రాలేదు. సిబ్బందితో మాట్లాడితే, అది పూర్తిగా కేంద్రం ఆధీనంలోని విమానయాన శాఖ చూసుకుంటుందనే సమాధానం వచ్చింది. మినహా వివరాలు చెప్పడానికి మాత్రం సుముఖత చూపలేదు.
దీనిపై టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (Chief Vigilance and Security Officer - CVSO) శ్రీధర్ (ఐపీఎస్)ను 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి పలకరించారు.
"తిరుమల భద్రతా పరంగా సున్నితమైన ప్రదేశం" అని సీవీఎస్ఓ శ్రీధర్ చెప్పారు. "రక్షణపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నో ఫైజోన్ గా పరిగణించమని కోరుతూ ఏవియేషన్ డిపార్ట్ మెంట్ కు టీటీడీ నుంచి లేఖ రాశాం" అని చెప్పారు.
"విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టుల రక్షణ కూడా ఆ శాఖకు ప్రధానమే కదా? భద్రతా పరంగానే కాకుండా, విమానాలు, అందులో ప్రయాణికుల రక్షణ కూడా ప్రధానమైనదే" వాటన్నింటిని అధ్యయనం, పరిగణలోకి తీసుకుని తిరుమల విషయంలో ఆలోచన చేయమని కోరుతున్నాం" అని సీవీఎస్ఓ శ్రీధర్ వ్యాఖ్యానించారు.
ప్రయాణికుల ఆనందం కోసమేనా..
తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో కొన్ని విమానాలు శ్రీకాళహస్తి మీదుగా కూడా ప్రయాణిస్తుంటాయి. కొన్ని వెల అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ రూట్ మ్యాప్ ఆధారంగా పైలెట్లు విమానం అలా తీసుకువస్తుంటారని చెబుతున్నారు. కాగా, కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఆనందం కలిగించడానికి కూడా తిరుమల గిరులకు సమీపంలో నుంచి చుట్టూ తిరిగి ల్యాండింగ్ చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఓ మాజీ పైలెట్ అభిప్రాయపడ్డారు.
సాధారణంగా దేశీయ విమానాల రాకపోకలకు అనుకూలంగా ఉన్న రేణిగుంట విమానాశ్రాయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. గత ఏడాది ఓకే విమానం సింగపూర్ కు ట్రయల్ రన్ నిర్వహించింది. ఈ విషయం పక్కకు ఉంచితే, విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి ఆకాశంలో చక్కర్లు కొడుతూ, ఏటీసీ సూచనల మేరకు కిందికి దిగాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, గాలిలోకి ఎకరాలన్నీ, కిందిటి దిగాలన్నా... ఏటీసీ తోపాటు అక్షాంశాలు, రేఖాంశాలను పరిశీలిస్తూ, పైలట్ కూడా విమానం సురక్షితంగా మళ్లించడానికి మలపు తీసుకునేందుకు అవకాశం లేదా? అనే విషయం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ సాధ్యం కాదా?
ఐఏఎఫ్ విశ్రాంత పైలట్ రమేష్ చెప్పినట్టు జెట్ విమానం గాలిలోకి ఎగరగానే శత్రుదేశంలోకి క్షణాల్లో ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక క్షేత్రం గౌరవాన్ని కాపాడుతూ, విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ లో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకున్నారు. దీనిపై విమానయాన శాఖ స్పందించి, అన్నివర్గాల సందేహాలు నివృత్తి చేసే వరకు..
"తిరుమల గగనతలంలో విమానం ప్రయాణిస్తే, అది సంచలనం అవుతూనే ఉంటుంది. యాత్రికుల మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి" అనడంలో సందేహం లేదు.
రేణిగుంట విమానాశ్రయానికి సమీపంలోనే ఉన్న శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని ముక్కంటి ఆలయం, తిరుమల శ్రీవారి ఆనంద నిలయం గగనతలంపై నుంచి విహరించకుండా విమానాలు నడపడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు విమానయాన శాఖ అధికారులు మాత్రమే స్పష్టం చేయాలి. ఆ శ్రద్ధ వారు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. దీనిపై టీటీడీ అధికారులు తమ పలుకుబడి ఉపయోగించడమే కాదు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు, ఏమేరకు శ్రద్ధ తీసుకుని, ఈ వివాదానికి తెరదించుతారనేది వేచిచూడాలి.
Tags:    

Similar News