టీటీడీకి సూచనలు ఇవ్వాలా.. సమస్యలు చెబుతారా..?
అక్టోబరు 3వ తేదీ డయల్ యువర్ ఈఓ. ఫోన్ 0877-2263261 నంబర్ కు కాల్ చేయండి.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-01 14:14 GMT
టీటీడీ ఈఓతో మాట్లాడాలంటే.. కాల్ చేయాల్సిన నంబర్ 0877-2263261
తిరుమలలో యాత్రికుల సదుపాయలు, సూచనలు తీసుకోవడానికి ఈ నెల మూడో తేదీ డయల్ యువర్ టీటీడీ ఈఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్ తో మాట్లాడవచ్చు.
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. యాత్రికులు తమ సందేహాలు, సూచనలను టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ కు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు.
తిరుమల అన్నమయ్య భవన్ నుంచి యాత్రికులతో ఈఓ నేరుగా మాట్లాడే సమయంలో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఆ సమయలో అందుబాటులో ఉంటారు. సమస్యలు తెలుసుకునే అధికారులు, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
సమస్యలు తెలుసుకునే యత్నం..
తిరుమలకు వచ్చే యాత్రికులు సమస్యలతో పాటు, వివిధ విభాగాల్లో గమనించిన ఇబ్బందులు చెప్పడానికి టీటీడీ ప్రతి నెలా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. దీని ప్రధాన ఉద్దేశం, శ్రీవారి దర్శనం, మాతృశ్రీ తరగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ఆహార పదార్థాల నాణ్యత, తిరుమలలో క్యూల పరిస్థితిని యాత్రికులు నేరుగా టీటీడీ ఈఓకు వివరించే వెసులుబాటు ఉంటుంది.
మెరుగైన సేవల కోసం..
ఈ కార్యక్రమం ద్వారా సూచనలు తెలుసుకుని యాత్రికులకు మెరుగైన సేవలు అందించడానికి వీలు కలుగుతుందని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన నేపథ్యంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిరుమలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా టీటీడీ సమాచార కేంద్రాలతో పాటు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలను కూడా ఏర్పాటు చేసింది. తిరుపతి, తిరుమలతో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను కూడా ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఆస్కారం కల్నిస్తున్నారు. గతంలో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా కూడా శ్రీవారి ఆలయంలో క్యూలు క్రమబద్ధీకరించడం, మెరుగైన దర్శనంతో పాటు వసతి సదుపాయం కల్పించడంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారు.
తిరుమలలో శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ కార్యక్రమంలో కూడా యాత్రికులు సమస్యలు వినిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ టీటీడీ రికార్డు చేయడంతో పాటు, వాటి పరిష్కారానికి కూడా గతంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆర్జితసేవా టికెట్లు, ఎస్ఎస్డీ టోకెన్ల జారీ, దర్శన వేళలకు సంబంధించి కూడా ఈ కార్యక్రమంలో చర్చకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు కూడా ఆ సమయంలో అందుబాటులో ఉంటారు.