ఏపీలో ఉరుములు, పిడుగు పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే 24గంటల్లో ఏపీలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి.;
By : Admin
Update: 2025-04-09 05:40 GMT
ఒక వైపు తీవ్ర ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిడుగు లాంటి వార్త వచ్చిపడింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న తరుణంలో ఉరుములు, పిగుడు పాటులు వెండాడుతున్నాయి. సోమవారం ఓ రేంజ్‌లో భయపెట్టిన వాతావరణ ప్రభావం నుంచి ఇంకా తేరుకోక ముందే తాజాగా ఏర్పడిన అల్పపీడనం మరింత ఆందోళనకరంగా మారింది. దీని వల్ల రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది.
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడనుంది. దీంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. విశాఖపట్నంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తా ఆంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు, బుధ, గురువారాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏప్రిల్ 11న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షాలు పడ్డాయి. మరి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ స్థాయిలోనే ఈదురు గాలులు, వర్షాలు పడ్డాయి. దీంతో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి.