రాష్ట్రమంతా ఇప్పుడు ముగ్గురు నానీల గురించిన ముచ్చట్లే నడుస్తున్నాయి. ఈ ముగ్గురు మూడు జిల్లాలో ప్రస్తుత అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పని చేసిన వారు. వీరి గెలుపు ఓటములపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని వారిలో ఒకరు. ఈయన అసలు పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. ప్రస్తుత ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 1999లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆళ్ల నానీ మొదటి సారిగా ఓటమి పాలయ్యారు. తర్వాత 2004, 2009 లో గెలుపొందారు. తర్వాత ఆయన 2013లో వైఎస్‌ఆర్‌సీపీలో చేరి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించి గెలిపించారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి అయ్యారు. తిరిగి 2024 ఎన్నికల్లో అదే ఏలూరు అసెంబ్లీ నుంచే బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఈయన భవిష్యత్ స్ట్రాంగ్ రూమ్‌లో ఉంది.
ఆళ్ల నానీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ఏలూరు మునిసిపాలిటీలో ఒక వార్డు మెంబరు నానీని కలవాలంటే నేరుగా సాధ్యం కాదు. ఆయన చుట్టూ ఉండే కోటరీతో ముందు మాట్లాడాలి. వారి నుంచి సమాచారం అందుకుని ఆ వార్డు మెంబరుకు ఏమి కావాలో తిరిగే ఆ వ్యక్తి ద్వారానే తెలియజేస్తారు. ఇక సాధారణ ఓటరు లేదా ప్రజలు నేరుగా ఆయన వద్దకు వెళ్లి ఒక అర్జీ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలో పాల్గొనడం, రోడ్డుపై వెళ్తూ ఇంటి ముందున్న వారికి నమస్కారం పెట్టి ఓట్లు అడగడం ముందుకు సాగడం సాధారణంగా జరుగుతూ వచ్చింది. బాగా తెలిసిన, ముఖ పరిచయం ఉన్న ఓటరు కనిపించినా ఆప్యాయంగా పలకరించిన సందర్భం లేదని ఆయన అనుచరుల్లోనే చర్చ ఉంది. టీడీపీ నుంచి బడేటి రాధాకృష్ణ పోటీలో ఉన్నారు. ఈయన సోదరుడు బడేటి బుజ్జి గతంలో ఏలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వద్దకు నేరుగా ఎవరైనా పోవచ్చు, మాట్లాడొచ్చు. ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన సోదరుడు బడేటి రాధాకృష్ణ పోటీ చేశారు. ఈయన కూడా జనంతో మమేకమై కలిసి పోతారనే పేరుంది. అభ్యర్థులిద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. మంత్రిగా ఆళ్ల నాని ఎక్కువ సమయం స్థానికులను కలిసేందుకు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. జనంతో కలిసి పోవడం లేదనే వ్యతిరేకతే ఆళ్ల నాని ఓటమికి కారణాలయ్యా అవకాశాలు ఉన్నాయని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో చర్చ ఉంది.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరొకరు. ఈయన అసలు పేరు కొడాలి శ్రీవెంటకటేశ్వరరావు. వయసు 52ఏళ్లు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐదో సారి ఎమ్మెల్యేగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేశారు. మనిషి సౌమ్యుడే అని స్థానికులు చెబుతున్నా.. ఎన్నికలప్పుడు తప్ప తక్కిన సమయాల్లో పెద్దగా అందుబాటులో ఉండరు అనే విమర్శలు స్థానికంగా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఎవరు ఏ అవసరం వచ్చి డబ్బు అడిగినా కాదనకుండా ఇస్తారు. మామాలు సందర్భాల్లో అంతగా దాతృత్వం ఆయనలో కనిపించదు. ఇక ప్రత్యర్థులను మాటలతో ఎదుర్కోవడంలో ఆయనకు ఆయనే సాటి. బూతుల మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో కొడాలి నానిపై ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము టీడీపీ నుంచి పోటీ చేశారు. ఈ సారి రాముకు గుడివాడ ప్రజలు అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికలు పూర్తి అయ్యాయి. గుడివాడ టౌన్‌లో నానికి నమ్మకస్తులుగా ఉండే ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు డబ్బులు తీసుకొని రెండు వార్డుల్లో ఓటర్లకు పంచకుండా పరారైనట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ రెండు వార్డుల్లో నానీకి పూర్తిగా మైనస్‌గా మారే చాన్స్ ఉందనేది రాజకీయ పరిశీలకుల మాట. పట్టణంలోని మరి కొన్ని వార్డులు, గుడ్డవల్లేరు మండలంలోను టీడీపీకే ఎక్కువ ఓట్లు పడినట్లు ప్రచారం జరిగింది. నానీ స్వతహాగా చేయించుకున్న సర్వేలోను ఇదే రకమైన నివేదికలు వచ్చినట్లు సమాచారం. అంటే ఈ సారి గుడివాడలో కొడాలి నానికి ఎదురు గాలి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానీ మరొకరు. ఈయన అసలు పేరు పేర్ని వెంకటరామయ్య. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన కుమారుడికి మచిలీపట్నం ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనే సీఎం జగన్‌కు చేసిన విజ్ఞప్తి పని చేసింది. నానీ కుమారుడు పేర్ని వాకాసాయికృష్ణ మూర్తి(కిట్టు) పోటీ చేశారు. రాజకీయాలకు కొత్త. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగుతున్నారు. మంచి పేరే ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఇతనికి మైనస్‌గా మారే అవకాశం ఉంది. టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు. మత్స్యకార ఓట్లు సుమారు 25వేల వరకు ఉన్నాయి. కిట్టు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. సామాజిక వర్గాలు ఆ నాయకులను భుజానికి ఎత్తుకుంటాయో లేదో కానీ రాజకీయాల్లో ఉంటూ ప్రజలను ఎవరు బాగా దగ్గరు తీసుకుంటారో ఆలోచించి వారిపైపు అడుగులు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ సారి పేర్ని నాని కుమారునికి ఓటమి తప్పదనే చర్చ స్థానికుల్లో సాగుతోంది.