ఏపీలో మూడు మేజర్ తొక్కిసలాటలు
ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల్లో ప్రమాదాలు, తొక్కిసలాటలు, మరణాలు ఆందోళనకరంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల్లో ప్రమాదాలు, తొక్కిసలాటలు, మరణాలు ఆందోళనకరంగా మారాయి. ప్రసిద్ధ దేవాలయాలు భక్తులకు పవిత్ర క్షేత్రాలు అయినప్పటికీ, ఉత్సవాలు, పండుగల సమయంలో భారీ రద్దీ వల్ల తరచుగా తొక్కిసలాటలు జరగడం ఆందోళనకరంగా మారింది. 2014 నుంచి 2025 మధ్య కాలంలో రాష్ట్రంలోని దేవాలయాల్లో 3 ప్రధాన తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, కార్తీక మాస ఏకాదశి వంటి పవిత్ర దినాల్లోనే జరగడం గమనార్హం. ఈ పవిత్ర రోజుల్లో భక్తుల భారీ పోటెత్తడం, దేవుని దర్శనం కోసం టికెట్ కౌంటర్ల వద్ద భారీ రద్దీ నెలకొనడం, భారీగా తరలి వచ్చే భక్తులను క్రమబద్దీకరణ చేడయంలో పటిష్టమైన చర్యలు లేకపోవడం, భద్రతా ఏర్పాట్ల లోపాలు, క్రౌండ్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వల్ల సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం 42 మందికిపైగా మరణించగా, చాలా మంది గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటనలు ఆలయాల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రతా వ్యవస్థల మెరుగుదల అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.
ముఖ్య ఘటనల వివరాలు
| సంవత్సరం | తేదీ | స్థలం / ఘటన వివరాలు | మరణాలు | గాయాలు | కారణం / పరిణామాలు |
|---|---|---|---|---|---|
| 2015 | జూలై 14 | రాజమండ్రి (గోదావరి నది బ్యాంక్‌లో 'పుష్కరాల' పుణ్యస్నానం సమయంలో) – భారీ భక్తులు స్నానం చేయడానికి పోటెత్తడంతో తొక్కిసలాట. | 27 | 20 | ప్రభుత్వం దర్యాప్తు చేసింది; భద్రతా ఏర్పాట్లు మెరుగుపరచాలని సూచించింది. |
| 2025 | జనవరి 8 | తిరుపతి (తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 'వైకుంఠ ఏకాదశి' టికెట్ల కౌంటర్ వద్ద) – భక్తులు ఫ్రీ టికెట్ల కోసం వెళ్లినప్పుడు గేట్ తెరవడంతో తొక్కిసలాట. | 6 | 35+ | ఏపీ ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించింది. సీఎం చంద్రబాబు, పీఎం మోదీ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. |
| 2025 | నవంబర్ 1 | శ్రీకాకుళం (కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 'కార్తీక మాస ఏకాదశి' సమయంలో) – భక్తుల భారీ రద్దీతో రెయిలింగ్ ఊడిపోవడంతో తొక్కిసలాట. | 9 | పలువురు (తీవ్రంగా) | సహాయ చర్యలు కొనసాగుతున్నాయి; సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, చికిత్సకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. |
సింహాచలం దేవాలయం దుర్ఘటన
2025 ఏప్రిల్ 30న జరిగిన వార్షిక చందనోత్సవం సందర్భంగా తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తగా నిర్మించిన గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం ఏడుగురు భక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన రూ.300 టిక్కెట్ కౌంటర్ వద్ద క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులపై జరిగింది. మృతులలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన దంపతులు కూడా ఉన్నారు. గోడ నాసిరకంగా నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా భావించారు.
భక్తుల భారీ పోటెత్తడం , రద్దీ నిర్వహణలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. ఈ దుర్ఘటనలు ప్రముఖ దేవాలయాలలో క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలనే చర్చలను తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం, ఆలయ నిర్వాహకులు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలను నివారించేలా చర్యలు తీసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు కోరుకుంటున్నారు.