ఈసారి ఫిబ్రవరి లోనే ఏపీ ఇంటర్ పరీక్షలు

సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా పలు మార్పులు చేసిన ఇంటర్ బోర్డ్;

Update: 2025-08-31 10:46 GMT

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డ్ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏటా మార్చిలో నిర్వహించే పబ్లిక్ పరీక్షలను ఈసారి ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది.అంతేకాకుండా ఈ కొత్త విధానం ప్రకారం విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు రోజుకు ఒకే సబ్జెక్టుకు పరీక్ష జరుగుతుందని ప్రకటించింది.మొదట సైన్స్ గ్రూపు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్ పరీక్షలు పూర్తయ్యాక భాషా సబ్జెక్టులకు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా 'ఎంబైపీసీ' గ్రూపును ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఒకే విద్యార్థికి వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టే రోజుకు ఒకే పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారు.సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఆఏడాది నుంచి పలు సంస్కరణలను కూడా అమలు చేస్తున్నారు. సిలబస్‌ను పూర్తిగా ఎన్సీఈఆర్టీకి అనుగుణంగా మార్చారు.దీనివల్ల పరీక్షలు త్వరగా ముగించి, ఏప్రిల్‌లో తరగతులు నిర్వహించేందుకు వీలవుతుందని బోర్డు భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు 85 మార్కులకు రాతపరీక్ష నిర్వహించి, మిగతా మార్కులను రెండో ఏడాది ప్రాక్టికల్స్‌కు కేటాయించనున్నారు. బయాలజీలో వృక్షశాస్త్రానికి 43, జంతుశాస్త్రానికి 42 మార్కులు ఉంటాయి. అన్ని పేపర్లలోనూ కొత్తగా ఒక మార్కు ప్రశ్నలను చేర్చారు.అయితే ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. థియరీ పరీక్షలకు ముందా ఆ తరువాతా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఈ సంవత్సరం ఆర్ట్స్‌ విద్యార్థులు సైతం కొందరు ఐచ్ఛికంగా సైన్స్‌ సబ్జెక్టులు ఎంచుకున్నారు. కొందరు సైన్స్‌ గ్రూపు విద్యార్థులు రాజనీతిశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం ఎంపిక చేసుకున్నారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ దేనికైనా అర్హత సాధించేందుకు ఇలా సబ్జెక్టులను ఎంచుకున్నారు.
Tags:    

Similar News