ప్రధాని మోదీ నేటి ఏపీ టూర్ షెడ్యూల్ ఇదే
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో కలిసి పీఎం మోదీ రోడ్డు షోలో పాల్గొననున్నారు.;
By : Admin
Update: 2025-01-08 08:07 GMT
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఆంధ్రప్రదేశ్ టూర్ చేయనున్నారు. ప్రధానిగా మూడో దఫా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో సారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ముఖ్యంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తాజాగా విశాఖపట్నం పర్యటన చేయనున్నారు. గతంలో ఒక సారి టూర్ చేయాల్సి ఉన్నా కొన్ని అనివార్యకారణాల వల్ల రద్ద అయ్యింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నవంబరు 29న చేయాల్సిన మోదీ పర్యటన రద్దైంది.
ప్రధాని మోదీ టూర్ సందర్భంగా బుధవారం సాయంత్రం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా విశాఖపట్నంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం సాయంత్రం 4:15 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4:45 గంటల నుంచి 5:30 గంటల వరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి పీఎం మోదీ రోడ్డు షోలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని సిరిపురం చౌరస్తా నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు దాదాపు 45 నిముషాల పాటు రోడ్డు షో సాగనుంది. అనంతరం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:45 గంటల వరకు విశాఖటప్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా సభా వేదికపై నుంచే వర్చువల్‌గా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరంగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 6:50 గంటలకు సభా వేదిక నుంచి బయలు దేరి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7:15 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి భువనేశ్వర్ వెళ్తనున్నారు. ప్రధాని మోదీని సాగనంపిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు వేర్వేరుగా విజయవాడకు బయలుదేరి వెళ్తారు.
ప్రధాని మోదీ రాక సందర్భంగా ఇప్పటికే విశాఖప్నటంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం ఈ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. సీఎస్ కే విజయానంద్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్ల పర్యవేక్షణలు చేపట్టారు. ప్రధాని పాల్గొంటున్న వేదిక మీద ఎవరెవరు కూర్చోవలనే దానిపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 10 మంది నాయకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాద్, రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీలు ఎం శ్రీభరత్, సీఎం రమేష్, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి విజయ్‌కుమార్‌లు ప్రధానితో పాటు వేదికను పంచుకోనున్నారు. అంతేకాకుండా సభలో ఎవరెవరు ప్రసంగించాలనే దానిపైనా నిర్ణయం జరిగింది. ప్రధాన మంత్రి మోదీ స్పీచ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలుగులోకి అనువదించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎంపీ సీఎం రమేష్ ప్రసంగించనున్నారు.
ఈ సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. సభా వేదికైన ఏయూ ఇంజనీంగ్ కళాశాల మైదానంలో వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, ప్రజల కోసం దాదాపు 27 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రంతో పాటు పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్‌నోడ్, గుంటూరు–బీబీనగర్, గుత్తి–పెండేకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేస్తారు. చిలకలూరిపేట ఆరు లైన్ల బైపాస్ రోడ్డుతో పాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.