ఇది నిరుద్యోగుల పాలిట శాడిస్ట్‌ ప్రభుత్వం

డీఎస్సీ పేరుతో 1.87 లక్షల మందిని దగా చేసిందని వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర ధ్వజమెత్తారు.;

By :  Admin
Update: 2025-01-02 12:15 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాడిస్ట్‌ ప్రభుత్వమని వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ రవిచంద్ర ధ్వజమెత్తారు. డీఎస్సీ పేరుతో 1.87 లక్షల నిరుద్యోగులను ఈ ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు. రోజుకో ప్రకటన పేరుతో వాయిదాలు వేస్తున్న ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ది లేదన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ టీవీలు, పేపర్లకు లీకులిస్తూ టీచర్‌ ఉద్యోగాల భర్తీని నిరవధికంగా వాయిదా వేసే కుట్రలు చేస్తోందని విమర్శించారు. చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామంటూ చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయిందన్నారు. అధికారంలోకి రాగానే 25వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక మెగా డీఎస్సీ పేరుతో 16,347 పోస్టులు మాత్రమే ప్రకటించారని విమర్శించారు.

టీచర్‌ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామంటూ జూన్‌ 13న మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. దాదాపు 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్‌ తేదీలు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలై, టెట్‌ రాసి, క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ అర్హతను పరిగణించకుండా, ఆ టెట్‌ రద్దు చేసి, మెగా డీఎస్సీ పేరుతో మరోసారి టెట్‌ పరీక్ష నిర్వహించారన్నారు. గత సెప్టెంబరు చివరి నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీ నీటి మూటగా మారిందన్నారు. మొన్నటికి మొన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 3 నెలలు సమయం ఇస్తున్నామన్న ప్రభుత్వం, నవంబరు 6న నోటిఫికేషన్‌ ఇస్తున్నామని చివరి వరకు నమ్మించి మళ్లీ వాయిదా వేసిందన్నారు. మరోసారి ఎస్సీ వర్గీకరణ పేరుతో వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తాజాగా జిల్లాలవారీగా ఖాళీల వివరాలు పంపాలంటూ, విద్యా శాఖను ఆదేశించి, మరోసారి మోసం చేసేందుకు సిద్దమయ్యారని విమర్శించారు. జిల్లాల్లో ఖాళీ పోస్టులపై ప్రభుత్వానికి వగాహన లేకుండానే, 16వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించించారా? అని నిలదీశారు.

ఈ తతంగమంతా చూస్తుంటే డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. టెట్‌ అర్హత సాధించిన 1.87 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కో పోస్టుకు 11,439 మంది పోటీ పడుతున్నారు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులంతా ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసి, వేలకు వేలు ఖర్చు చేసి, కోచింగ్‌ తీసుకుంటున్నారు. కానీ డీఎస్సీని నిర్వహించాలని కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కానీ సీఎం చంద్రబాబుకు ఆలోచనే లేదు. డీఎస్సీని నిర్వహించడంలో విద్యా శాఖ మంత్రిగా నారా లోకేశ్‌ ఘోరంగా విఫలమయ్యారు. పత్రికలు, టీవీలకు లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేయాలన్న ఆలోచన పక్క పెట్టి, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి. టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన పోరాడతామని రవిచంద్ర వెల్లడించారు.

Tags:    

Similar News