ఈ మహిళా మణులు ఎవరి మాటా వినలేదు!
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఐసీడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లు, ఉన్నతాధికారుల మాటలు వినలేదు. మంత్రినీ లెక్క చేయలేదు. ఏమిటీ కథ.. ఎందుకు ఇలా జరిగింది.;
ఆ భవనం వారి సొంత ఆస్తి కాదు. అయితే అక్కడి నుంచి కదిలేది లేదని ఇద్దరు జిల్లా అధికారులు మొండికేసి కూర్చొన్నారు. కొత్తగా జిల్లాల విభజన జరిగిన దగ్గర నుంచి ఈ సమస్య ఇలాగే ఉంటూ వస్తోంది. కృష్ణా జిల్లాను విభజించి విజయవాడ పార్లమెంట్ ను ఎన్టీఆర్ జిల్లాగా వేరు చేశారు. దీంతో రెండు జిల్లాలుగా మారాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రెండుగా మారిపోయాయి. అయితే ఐసీడీఎస్ జిల్లా కార్యాలయం మాత్రం రెండుగా విడిపోయినా ఒకే భవనంలోనే చేరోవైపు ఉంటున్నారు. ఒకే భవనంలో రెండు జిల్లా ఆఫీసులు వద్దని ఎన్టీఆర్ జిల్లా వారే విజయవాడలో, కృష్ణా జిల్లా వారు మచిలీపట్నంలో భవనాలు అద్దెకు తీసుకుని విధులు నిర్వహించాలని గత ప్రభుత్వంలోనే ఇద్దరు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కొత్తగా నిర్మించిన భవనం కావడం వల్ల మాకు కావాలంటే మాకు కావాలని పట్టుబట్టారు. భవనం కృష్ణా జిల్లాలో ఉండటం వల్ల మేమే ఉంటామని కృష్ణా జిల్లా అధికారి, విజయవాడకు ఆనుకుని ఉన్న కానూరులో ఉండటం వల్ల మేము ఇక్కడే ఉంటామని ఎన్టీఆర్ జిల్లా అధికారి పట్టుబట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను పక్కన బెట్టారు. తరువాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదు. చివరకు పంచాయతీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వద్దకు చేరింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జోక్యం చేసుకుని 24 గంటల్లో ఆ భవనాన్ని ఖాళీ చేసి వేరు వేరుగా అద్దెలకు భవనాలు చూసుకోవాలని ఆదేశించారు. వారు మంత్రి మాటలు కూడా లెక్క చేయలేదు. దీంతో చేసేది లేక ఆదేశాలు బే ఖాతరు చేసినందుకు ఇరువురిపై చర్యలు తీసుకున్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఇరువురు పీడీలు సువర్ణ, ఉమాదేవి లను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ‘పిట్ట పోరు.. పిట్ట పోరు పిల్లి తీర్చింది’ అన్న సామెతగా వారి తగాదాకు పుల్ స్టాఫ్ పడింది. ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని ఎంత చెప్పినా వీరు వినలేదు. పైగా ఈ కార్యాలయం 2016లో విజయవాడ అర్బన్, రూరల్ సీడీపీవోల కోసం నిర్మించారు. ఈ భవనం జిల్లా అధికారులు ఉండేది కాదు.
అందువల్ల పద్ధతిగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పినట్లు ఖాళీ చేసి కృష్ణా జిల్లా పీడీ సువర్ణ మచిలీపట్నంలో, ఎన్టీఆర్ జిల్లా పీడీ ఉమాదేవి విజయవాడలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ఉంటే సమస్య ఉండేది కాదు. పైగా మంచి భవనం నాకంటే నాకని తగాదాపడి ఉద్యగం నుంచి సస్పెండ్ అయ్యారంటే అందరికీ నవ్వులాటగా ఉందని పలువురు డిపార్ట్ మెంట్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంత కాలం ప్రభుత్వం ఎక్కడ.. ఏ భనంలో ఏర్పాటు చేసినా అక్కడ విధులు నిర్వహించాలి. అలా కాకుండా ఈ విధమైన వ్యవహారం చేసి వీరిద్దరూ ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల వద్ద పరువు పోగొట్టుకున్నారు. సొంత ఆస్తుల కోసం కూడా ఇంతగా పోరాడరని, కేవలం భవనం బాగుందని ఒకరితో ఒకరు పోటీ పడి సస్పెన్షన్ కు గురయ్యారు.