పాకిస్తాన్ తో దౌత్యయుద్ధం జరగాలి:సీపీఎం
"ఆపరేషన్ సింధూర్" లక్ష్యం ఛేదించామని కేంద్రం చెప్పింది. ఇక ఉద్రిక్తతల నివారణకు దౌత్యపరమైన ప్రక్రియ జరగాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ. బేబి సూచించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-09 12:53 GMT
"ఉగ్రవాదం అంతానికి సిపిఎం సహకరిస్తుంది. భారత్, పాక్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నివారణకు చర్యలు తీసుకోవాలి" అని సీపీఎం (CPM) ప్రధాన కార్యదర్శి మరియం అలగ్జాండర్ బేబి (ఎంఏ. బేబి) సూచించారు. భారత్, పాక్ మధ్య ప్రతీకార దాడులు సమంజసం కాదంటూ, యుద్ధం చేయడం సరైంది కాదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలకు హాజరైన సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ. బేబీ శుక్రవారం సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి, వి. నాగరాజు, కందారపు మురళీతో కలిసి బేబి మాట్లాడారు. పార్టీ చేపట్టే పోరాటాలు, భవిష్యత్తు కార్యాచరణను మీడియాకు ఆ తరువాత ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. అందులో కులగణన, బీహార్ ఎన్నికలకు మహాకూటమి ఏర్పాటు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ఎన్నికల్లో అనుసరించనున్న వ్యూహం, ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పై పార్టీ విధానాన్ని వివరించారు.
దేశంలో పర్యటన
"తమిళనాడు రాష్ట్రం మదురైలో నిర్వహించిన 24వ మహాసభల్లో తాను ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాక దేశంలో పర్యటిస్తున్నా. పార్టీ నాయకులను కలుసుకుని వారితో స్థానిక విషయాలపై చర్చిస్తున్నా" అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ. బేబి తెలిపారు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలల్లో పర్యటించాను. ఏపీ పర్యటన కూడా పూర్తయింది అని తెలిపారు. పార్టీ అఖిలభారత సమావేశాల్లో దేశ అభివృద్ధికి, సమైక్యతకు, సమగ్రతకు ముప్పు కలింగించేలా పెచ్చరిల్లుతున్న మతతత్వ శక్తులను ఎదుర్కొనే ప్రధాన లక్ష్యంతో సిపిఎం పోరాటాలు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు.
సరిహద్దుల్లో ప్రశాంతత ఏర్పడాలి..
పహల్గావ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మారణహోమం తరువాత చేపట్టి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది.
అని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన విషయాన్ని బేబి గుర్తు చేశారు. ఇక యుద్ధం కాకుండా, దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గించి సాధారణ జనజీవన పరిస్థితి పునరుద్ధరణకు, శాంతి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిపిఎం ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ పిలుపునిచ్చారు. ఇదే విషయం అఖిలపక్షంలో కూడా మా పార్టీ ప్రతినిధి స్పష్టం చేశారని బేబి గుర్తు చేశారు.
పాకిస్తాన్ సరిహద్దులో ఒక వేళ కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా బదులిచ్చేలా మిలిటరీ పరంగా సమయానుకూలంగా కార్యాచరణ అమలు చేయాలని కూడా ఆయన సూచించారు.
ప్రతీకార దాడుల పేరుతో అమాయకుల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. తీవ్రవాదం అంతానికి, పెహల్గాం హంతకులను అప్పజెప్పడానికి పాకిస్తాన్ పై వివిధ వేదికల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.
కులగణన ఎన్నికల ఎత్తుగడ
దేశంలో కులగణన ఎన్నికల ఎత్తుగడే అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ. బేబి అభివర్ణించారు.
"బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రకటించిందన్న భావన ప్రజల్లో ఉంది. కులగణనకు మార్గదర్శకాలు ప్రకటించకపోవడం దీనిని బలపరుస్తోంది" అని ఆయన అన్నారు.
ఇది కాదు పరిష్కారం
దేశంలో కుల గణనతో దళిత, గిరిజన, ఆదివాసీ, బీసీల సమస్య పరిష్కారం కాదని ఏంఏ. బేబి అభిప్రాయపడ్డారు. ఈ కుల గణన సమగ్ర సామాజిక సర్వేగా చేపట్టాలని, అందుకు మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండు చేశారు.
"సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి తదితర స్థితిగతులను అధ్యయనం, వివరాల సేకరణ జరగాలి. అప్పుడే బడుగువర్గాలకు మేలు జరుగుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. తద్వారా మాత్రమే అణగారిన ప్రజల వాస్తవ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎలా ఉందనేది తేలుతుందన్నారు.
రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సిపిఎం దీనిపై చర్చ లేవనెత్తనుందని వెల్లడించారు.
బీహార్ ఎన్నికలకు మహా కూటమి
ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే బీహార్ ఎన్నికలకు మహాకూటమి ఏర్పాటు చేయనున్నట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ. బేబి వెల్లడించారు.
''మహాకూటమి ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించాం. విశాల ప్రాతిపదికన ప్రజాస్వామ్య అభ్యుదయ రాజకీయ శక్తులను కలుపుకుని కలసి వామపక్షాలు ముందడుగా వేస్తాం'' అని చెప్పారు.
రాష్ట్రాలు పర్యటిస్తున్నా...
కేరళలో జరిగిన సీపీఎం 24 జాతీయ కాంగ్రెస్ సభల తరువాత తానే స్వయంగా బీహార్ పర్యటనలో ఆర్జెడి నేత తేజస్వీ యాదవ్ తో చర్చించాను అని ఆయన తెలిపారు. ఆ రాష్ట్ర సిపిఐ ఇతర వామపక్ష నాయకులతో కూడా ఎత్తుగడలపై మాట్లాడినట్లు తెలిపారు.
ప్రజలు మతతత్వ శక్తుల ఆకర్షణీయ విధానాలకు మోసపోకుండా ఐక్యత, అభివృద్ధి, మత సామరస్యం కోసం కృషి చేసే పార్టీలకు మద్దతివ్వాలిని పిలుపునిచ్చారు.
రానున్న కాలంలో కేరళ తమిళనాడు పాండిచ్చేరి పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాము కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించి ఎన్నికల ఎత్తుగడలను రూపొందిస్తామని బేబీ వివరించారు.
గ్రామీణ పేదలు, పట్టణ పేదలు రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు అన్ని వర్గాలను చైతన్య పరిచేలా ఉద్యమిస్తామని చెప్పారు. ప్రస్తుతం బాలల మీద కూడా గణనీయమైన మతతత్వ పోకడలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని చైతన్య పరిచేందుకు బాలల సంఘాల కార్యక్రమాలపై కూడా కేంద్రీకరించి పని చేయనున్నట్లు తెలిపారు.