ఈ నెల జీతాలు ఇస్తామా అనే భయం కలుగుతోంది: సీఎం చంద్రబాబు

నేమకల్లు ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఏపీని డెవలప్‌ చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు.

By :  Admin
Update: 2024-11-30 12:32 GMT

గత ప్రభుత్వం రూ. 10లక్షల కోట్లు అప్పులు చేసిందని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూస్తోంటే ఈ నెల జీతాలు ఇస్తామా అనే భయం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. నేమకల్లు ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని డెవలప్‌ చేస్తానని అన్నారు. ఏపీలో ల్యాండ్, శాండ్, గంజాయి, రేషన్‌ బియ్యం మాఫియాలను ఉక్కుపాదంతో అణిచివేస్తానని అన్నారు. అనంతపురం జిల్లాలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అనంతరపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లులో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో సీఎం ముచ్చటించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నేమకల్లులో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్‌ హయాంలో నాసిరకం మద్యం తెచ్చారని, అడ్డుగోలుగా దోచుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. అయితే బెల్టు షాపులు పెడితే ఊరుకోమని, కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉచిత ఇసుకలో కూడా వేలు పెడితే ఊరుకునేది లేదన్నారు. ఈగల్‌ పేరుతో డ్రగ్స్, గంజాయి మాఫియాను అరికడుతామని, ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. డ్రగ్స్, గంజాయి పిల్లల భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, వీటిపైన ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందని, నిర్వీర్యం అయ్యాయన్నారు. రూ. 10లక్షల కోట్లు అప్పులు చేశారని, దీంతో ఏపీ ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్‌ చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల జీతాలు వేస్తామా అనే భయం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదైలైనా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. భూ కబ్జాలను ఉపేక్షించేంది లేదని, కఠిన చర్యలు తీసుకునేందుకు యాంటీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ తెచ్చామన్నారు. ఇసుకను తీసుకెళ్లే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే తిరగబడాలని సీఎం చెప్పారు. ఎక్కడ ఇసుక దొరికినా స్వేచ్ఛగా తీసుకెళ్లండని ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో 64లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కువ పింఛన్‌ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అన్నారు. 3 నెలలకు ఒక సారి పింఛెన్‌ తీసుకునే సౌకర్యం కల్పించామన్నారు. రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తామని, ఇక్కడ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటామన్నారు. హంద్రీనీవాపై రూ. 4,500 కోట్లు ఖర్చు పెట్టామని, రాయలసీమలోని ప్రాజెక్టులకు రూ. 12,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రాయలసీలమలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 

Tags:    

Similar News