పోర్టులున్నాయి, రోడ్లున్నాయి..పెట్టుబడులు పెట్టండి
యూఏఈ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడ పారిశ్రామికవేత్తలను కలవడం, వారితో సమావేశాలు నిర్వహించడంలో బిజీబిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు (అక్టోబర్ 22) వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ, వచ్చే నెల నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించారు. తొలి రోజు 5 వన్-టు-వన్ సమావేశాలు జరిపిన అనంతరం, మంత్రులు, అధికారులతో కలిసి దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియాన్ని 'లివింగ్ మ్యూజియం'గా రూపొందించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ వంటి రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలను టెక్నాలజీ ద్వారా ప్రదర్శిస్తున్నారని అక్కడి అధికారులు వివరించారు. 'ఫ్యూచర్ జర్నీ' పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను సీఎం సందర్శించారు.
పెట్టుబడుల ఆకర్షణకు ఉత్సాహం
పెట్టుబడుల సాధనకు యూఏఈ పర్యటనలో భాగంగా తొలి రోజు సీఎం చంద్రబాబు బ్రేక్ లేకుండా వరుస మీటింగ్‌లకు హాజరయ్యారు. యూఏఈ పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయం నిర్మాణానికి శోభా గ్రూప్ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. దుగరాజపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌ను ఆహ్వానించారు. వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ సంస్థను కోరారు. ఈ రెండు సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచాయి. సమావేశాల్లో పలువురు యూఏఈ వేత్తలు చంద్రబాబుతో ఉన్న గత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖాముఖీ భేటీల్లో ఏపీలో గూగుల్ పెట్టుబడులపైనా చర్చ జరిగింది. తొలి రోజు చివరిగా సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్నారు.
సీఐఐ రోడ్ షోలో సీఎం ప్రసంగం
దుబాయ్‌లో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోకు యూఏఈ దేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించిన సీఎం చంద్రబాబు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తన ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ:
- దుబాయ్ దేశం టెక్నాలజీని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందింది. టెక్నాలజీతో వచ్చే లాభాలను అర్థం చేసుకుని నేను ఐటీని ప్రమోట్ చేశాను. నాడు ఐటీని అందిపుచ్చుకున్నవాళ్లే ఇప్పుడు పెద్ద ఎత్తున ఐటీ దిగ్గజాలుగా ఎదిగారు.
- 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పని చేస్తున్నాం. తమ దేశ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకునేలా దుబాయ్ 2071 నాటికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. భవిష్యత్ అంతా ఇన్నోవేషన్లు, వినూత్న ఆలోచనలదే.
- అమరావతిలో రూ.100 కోట్లతో గ్రంథాలయం నిర్మాణానికి విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చిన శోభా గ్రూప్‌కు ధన్యవాదాలు. నేను శోభా గ్రూప్ ప్రతినిధులను ఎప్పుడూ కలవలేదు... కానీ ఏపీకున్న క్రెడిబులిటీ వల్ల విరాళం ఇచ్చేందుకు ముందుకురావడం సంతోషం.
- వచ్చే నెల 14,15 తేదీల్లో విశాఖలో పార్టనర్ షిప్ సదస్సుకు రావాలి. ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి... ఎంఓయూలు కుదుర్చుకుందాం.. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే ఆమోదం కూడా ఇచ్చేస్తాం.
- వ్యవసాయాధారిత రాష్ట్రమైనా... అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో హార్టికల్చర్, తీర ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ రంగాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయి. గివ్ బ్యాక్ పాలసీని మేం అమలు చేస్తున్నాం... అందరూ ఆ పాలసీని అమలు చేయాలని కోరుతున్నాం.
- అన్ని వసతులు ఉండడమే కాకుండా... ప్రకృతితో మమేకం అయ్యేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నాం. వినూత్న పద్ధతుల్లో రాజధాని కోసం భూ సమీకరణ చేపట్టాం... మా పిలుపుతో 33 వేల ఎకరాలు రైతులు రాజధానికి ఇచ్చారు. స్వయం సమృద్ధి గల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ, ప్రతి రంగానికీ నీటి భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
- భారతదేశ భవిష్యత్ అద్భుతంగా ఉండేలా ప్రధాని మోదీ అద్భుతమైన మార్పులు చేశారు. ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ సిద్ధం చేసేందుకు ఇప్పటి నుంచి మేం ప్రణాళికలు రచిస్తున్నాం. పరిశ్రమలకు అనుకూలంగా ఉండేందుకు పాలసీలు తెస్తున్నాం... ఇప్పటికే 24 పాలసీలు తెచ్చాం. అవసరమైతే మరిన్ని పాలసీలు తెస్తాం. పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు వస్తే... రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావిస్తే.. వెంటనే పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నాం.
- రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు ఉన్నాయి... ప్రతి 50 కిలో మీటర్లకు ఓ పోర్టు లేదా హార్బర్ ఉండేలా చూస్తున్నాం. లాజిస్టిక్స్ హబ్ చేసేందుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకున్నాం. ప్రస్తుతం ఏడు ఎయిర్ పోర్టులు ఉన్నాయి... మరో 9 ఎయిర్ పోర్టులు రానున్నాయి. ఎయిర్ కనెక్టివిటీ ద్వారా కార్గో రవాణా కూడా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేస్తున్నాం. జల, రైలు, రోడ్, వాయు మార్గాల ద్వారా కనెక్టివిటీ ఉండేలా చూస్తున్నాం.
- వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నాం. ఇందుకోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశాం. దుబాయ్ దేశంలో టూరిజం బాగా అభివృద్ధి చెందింది. దుబాయ్ దేశ జనాభా 3 మిలియన్లు... కానీ ఈ దేశాన్ని ఏడాదిలో సందర్శించే పర్యాటకుల సంఖ్య 18 మిలియన్లు. ఏపీలో కూడా పర్యాటకాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాం. టూరిజం ప్రాంతాలే కాకుండా... ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి దివ్యక్షేత్రం ఏపీలోనే ఉంది. 7 యాంకర్ హబ్స్... 25 థిమెటిక్ సర్క్యూట్స్, 3 నేషనల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా స్టార్ హోటళ్లకు అనుమతులిచ్చాం. టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం.
- ఆర్సెల్లార్ మిట్టల్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. గూగుల్ కూడా 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులను విశాఖలో పెట్టేందుకు ముందుకు వచ్చింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 48 యూనివర్శిటీలున్నాయి.. 9 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి... స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నాం. మైక్రోసాఫ్ట్ ద్వారా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది... ఇప్పుడు గూగుల్ ద్వారా విశాఖ అభివృద్ధి జరగబోతోంది. సంస్కరణలు అమల్లోకి వచ్చాక... అతిపెద్ద పెట్టుబడి గూగుల్ పెడుతోంది. విశాఖ నుంచే చాలా దేశాలకు కనెక్టివిటీ ఇస్తారు. విశాఖ ఫ్యూచర్ టెక్నాలజీలకు కేంద్రంగా ఉండబోతోంది.
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశాలున్నాయి. ఏపీకి రండి... రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించండి... పెట్టుబడులు పెట్టండి. అని పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.