Rayalasemma|'సీమ'పై వివక్ష చూపిస్తే చూస్తూ ఊరుకోం..
చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా రాయలసీమకు అన్యాయమే జరుగుతోంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలను తరలిస్తే మరో ఉద్యమం తప్పదని వైసీపీ హెచ్చరించింది.
By : SSV Bhaskar Rao
Update: 2024-11-18 04:07 GMT
రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మరో వేర్పాటు ఉద్యమం తప్పదని వైసీపీ హెచ్చరించింది. ఈ ప్రాంతం నుంచి కోస్తా ప్రాంతానికి అన్ని సంస్ధలు తరలిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. సీఎం చంద్రబాబు విధానాలు అలా ప్రేరేపిస్తున్నాయని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. 'సీమ' ప్రజల హక్కు. హైకోర్టు, లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ. ఇందులో ఉన్న రెండింటిని కర్నూలు నుంచి తరలిస్తే పోరాటాలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బాబు వస్తే సీమకు అన్యాయమే..
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎయిమ్స్ ఆస్పత్రిని అనంతపురంలో ఏర్పాటు చేస్తామని మంగళగిరికి తరలించారని మండిపడ్డారు. తిరుపతికి క్యాన్సర్ ఆస్పత్రి మంజూరు చేస్తే కోస్తా జిల్లాలకు తరలించారని గుర్తు చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గతంలో హంద్రీనీవాకు శంకుస్థాపనలకే పరిమితం చేశారని, దివంగత సీఎం వైఎస్‌ఆర్ కాలంలోనే పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు.
2012 నుంచి హంద్రీనీవా ద్వారా నీరు వస్తున్నాయంటే అది వైఎస్‌ఆర్ చలవేనని గుర్తు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను పట్టిసీమకు రాత్రికి రాత్రే తరలించిన ఘనత కూడా చంద్రబాబుదేనని గుర్తు చేశారు. హంద్రీనీవా సామర్థ్యం 3850 క్యూసెక్కులు ఉంటే 2,200 క్యూసెక్కులే వస్తున్నాయని, దీన్ని 6,200 క్యూసెక్కుల సామర్థ్యానికి మాజీ సీఎం వైఎస్. జగన్ జీవో జారీ చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ 3,850 క్యూసెక్కులకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతంలో ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తోనూ చర్చించినట్లు చెప్పారు. హంద్రీనీవా సామర్థ్యం 6200 క్యూసెక్కులకు విస్తరిస్తేనే రాయలసీమకు ప్రయోజనకరమని తెలిపారు.
సీమ డిక్లరేషన్ ఏమైంది?
రాయలసీమ అభివృద్ధికి గతంలో బీజేపీ డిక్లరేషన్ ప్రకటించిందని అనంత వెంకటరామిరెడ్డి గుర్తు చేశారు. సీమలో హైకోర్టు ఉండాలని ఆనాడు చెప్పిన బీజేపీ నాయకులు ఈ రోజు ఏమయ్యారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధరేశ్వరి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని ప్రశ్నించరా? అని ఆయన నిలదీశారు. రాయలసీమ ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి కర్నూలులోనే లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ ఉండేవిధంగా కోరాలన్నారు. లేకుంటే ఉద్యమించాల్సి వస్తుందన్నారు. భవిష్యత్‌లో మరో రాష్ట్ర చీలికకు మార్గం సుగమం చేయొద్దని చంద్రబాబుకు అనంత హెచ్చరించారు. మాజీ సీఎం జగన్‌ను విమర్శించడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. సూపర్ సిక్స్ అని ఊదరగొట్టినా బడ్జెట్‌లో కేటాయింపులు లేవని ఆయన విమర్శించారు.
ఏపీ అంటే అమరావతి, పోలవరమేనా?
ఏపీ అంటే అమరావతి, పోలవరమేనా అని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయని గుర్తు చేశారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు సీమ ప్రజల హక్కు అని తెలిపారు. మాజీ సీఎం జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ప్రాంతీయ విభేదాలు రాకూడదని అడుగులు వేశారన్నారు. అందులో భాగంగానే కర్నూలును న్యాయ రాజధానిగా చేసుకుని లా యూనివర్సిటీ, లోకాయుక్త, ఎస్‌హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుకు అడుగులు వేసినట్లు గుర్తు చేశారు. వాటిని అమరావతికి తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు.