సీటు నీదే పార్టీ మారుతున్నావు!
పార్టీ ఏదైతేనేమి.. గెలుపు ముఖ్యం. మా మనిషిగా ఉంటే చాలు.. మేము చూసుకుంటాం. ఇదీ నేటి రాజకీయాల వరస.
By : G.P Venkateswarlu
Update: 2024-04-21 10:03 GMT
అక్కడి నుంచి నువ్వే పోటీ చేస్తావ్.. ఏపార్టీ నుంచి అంటావా మేము చూసుకుంటాం. నీ ప్రచారం నువ్వు చేసుకో.. ఇదీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిల మాట. ఈ మాటలు వినేవారికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఓహో ఇదా వ్యవహారం అనుకుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పార్టీలు మారే వారిని చూస్తున్నాం. మేము చెబుతున్నాము కదా మీరు పార్టీ మారండని భోరోసా ఇస్తున్న పార్టీ అధినేతలను ఇక్కడే చూస్తున్నాం. పూర్వపు రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే.. ఏ పార్టీలో ఉన్న వారు ఆ పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాలకు కట్టుబడి ఉండే వారు. ఇప్పుడు అలా కాదు, ఎవరు గెలుస్తారనుకుంటే ఆపార్టీలోకి వెళ్లొచ్చు. అలాగే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ మద్దతు ఉంటే గెలవొచ్చో ఆలోచించుకుని ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షులతో కూడా చర్చించి సీటు సంపాదించుకోవచ్చు. ఇరు పార్టీల వారు అంగీకరించి సీటు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇదోవిధమైన పరిణతి చెందిన రాజకీయ పరిణామం.
తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం ఇప్పుడు రాజకీయ చర్చకు తెరలేపింది. ఈ నియోజకవర్గాన్ని పొత్తులో బాగంగా తెలుగుదేశం పార్టీ బిజెపికి కేటాయించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎలాగైనా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బిజెపి అభ్యర్థిగా రిటైర్డ్ ఆర్మీ మేజర్ ములగపాటి వివరామకృష్ణంరాజును ప్రకటించింది. ఇప్పటి వరకు ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. మొదటి నుంచి బిజెపిలో ఉన్న వ్యక్తి. దేశభక్తి కూడా ఎక్కువే.
శివరామకృష్ణం రాజు గెలిచే అవకాశాలు లేవని బిజెపి వారు భావించారు. ప్రధానంగా రాజమండ్రి ఎంపిగా పోటీలోకి దిగిన దగ్గుబాటి పురందేశ్వరి తాను గెలవాలంటే అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. అనపర్తిలో రెడ్డి డామినేషన్ ఎక్కువ. ఓట్లు కూడా రెడ్డి సామాజిక వర్గానివే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణంరాజును పక్కన పెట్టారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రంగంలోకి దించారు. పురందేశ్వరి, చంద్రబాబునాయుడు మాట్లాడుకుని రామకృష్ణారెడ్డికి విషయం చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీ వాడినని, నరనరంలోనూ పార్టీ సిద్దాంతాలు జీర్ణించుకున్న వాడినని చెప్పినా నచ్చజెప్పి పోటీకి సిద్ధం చేశారు.
స్వామికార్యం స్వకార్యం రెండూ నెరవేరుతున్నప్పుడు ఏపార్టీలో ఉన్నా ఒకటేననే ఆలోచనకు రామకృష్ణారెడ్డి వచ్చారు. ఇదీ అనపర్తిలో జరుగుతున్న వ్యవహారం.