ఎదురు" గాలి".. పెద్దిరెడ్డి మౌనమేల..!?

"పెద్దన్న" జిల్లాలో అధికార పార్టీకి తిరుగుబాట్లు బలంగా తగిలాయి. ఇవేమీ పట్టించుకోని మంత్రి సొంత ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు.

Update: 2024-04-22 12:11 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: అధికార పార్టీకి వడగాలులు బలంగా తాకాయి. మూడు నియోజకవర్గాల్లో అధికార పీఠాలను కదిలించే దిశగా.. అసమ్మతి నేతలకు గాలం వేసిన టిడిపి నేతలు కూటమిని బలోపేతం చేసుకున్నారు. ఆ మూడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేరుగా సంబంధాలు ఉన్నాయి. జిల్లాలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సెగ్మెంట్లను గాలికి వదిలేశారా?? అనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న నాటి రోజులు ఆ సెగ్మెంట్లపై ఇంకా సమస్య పోలేదనే వాతావరణం కనిపిస్తోంది.

తన సొంత సెగ్మెంట్లో మంత్రి పెద్దిరెడ్డి శత్రుశేషం లేకుండా చక్కదిద్దుకున్నారు. టిడిపి మాజీ మంత్రి సోదరుని వైఎస్ఆర్సిపిలోకి చేర్చుకోవడం ద్వారా తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సమీకరణలు మారిపోయాయి. ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం..


హ్యాట్రిక్‌కు టిడిపి చెక్!

జిల్లాలోని నగరి అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి ఆర్కే రోజా అసమ్మతి వర్గ నేతలను తిప్పికొట్టే విధంగా టికెట్ సాధించారు. ఈ సెగ్మెంట్లో ఐదు మండలాల నాయకులు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. వైయస్ఆర్సీపీ అధిష్టానం కూడా నష్ట నివారణ చర్యలకు విఫల యత్నం చేసింది. ఆర్కే రోజా మినహా నియోజకవర్గంలోని ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టిన అసమ్మతినేతలు బెట్టు వీడలేదు.

ఒకవేళ ఆమెకే టికెట్ ఇస్తే " ఓడిపోతే తమ బాధ్యత కాదు" అనే హెచ్చరికలు కూడా ఫలించలేదు. మంత్రి రోజా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమానికి కూడా అందరూ మొఖం చాటేశారు. పరోక్షంగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు, టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ రెడ్డికి సహకారం అందించనున్నట్లు భావించారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడును నగరి టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ సారధ్యంలో కండువాలు వేసుకున్నారు. వారిలో ప్రధానంగా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్, నిండ్ర మండలాన్ని శాసించే రెడ్డివారి చక్రపాణి రెడ్డి సోదరుడు ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి వారి భాస్కర్ రెడ్డి, వడమాల పేట జడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డి కలిశారు.

కానీ కండువాలు వేసుకోలేదని సమాచారం. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్, ఆ తర్వాత మాజీ సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన పుత్తూరు మండలం చెర్లోపల్లికి చెందిన డిసిసిబి మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి ఒకరు. అంతకంటే ప్రధానంగా.. మాజీ మంత్రి రెడ్డి వారి చెంగారెడ్డికి ప్రధాన శిష్యుడుగా మెలిగిన మాజీ ఎంపీపీ ఏలుమలై మొదలియార్ ( అమ్ములు) అధికారికంగా పార్టీలో చేరిపోయారు. వీరు టిడిపిలో చేరడం వైఎస్ఆర్సిపికి శరాఘాతంగా మారినట్లు అంచనా వేస్తున్నారు. కొత్తూరు పంచాయతీ బోర్డు దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే ఏలుమలై మొదలియార్ ( అమ్ములు) కుటుంబం ఏలుబడిలోనే ఉండేది. పుత్తూరు పంచాయతీ బోర్డుకు అమ్ములు చివరి సర్పంచ్. పుత్తూరు మున్సిపాలిటీగా ఏర్పడింది.

కొసమెరుపు:

ఈ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారానే వైఎస్ఆర్సిపిలోకి ఎంట్రీ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో ఐదు మండలాల నాయకులు, క్యాబినెట్ హోదా స్థాయి కలిగిన రెడ్డివారి చక్రపాణి రెడ్డితో పాటు, నగరి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, రాష్ట్ర ఈడి కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్న కేజే శాంతి, ఆమె భర్త కేజే కుమార్ కూడా మంత్రి పెద్దిరెడ్డి సన్నిహిత సహచరులే. ఈ నియోజకవర్గంలో ఏమాత్రం ఆయన పట్టించుకోకపోవడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. మంత్రి ఆర్కే రోజా ఎవరిని హాజరు చేయకపోవడం, సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తో రాజకీయ అనుబంధం ఉండడం వల్లనే పెద్దిరెడ్డి పట్టించుకోలేదని ఆ పార్టీ నుంచి వినిపిస్తున్న మాటలు.


తిరగబడ్డ "అన్నా సోదరులు"

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫలితాన్ని శాసించే స్థాయి ఉన్న అన్నా రామచంద్రయ్య యాదవ్, రాజీవ్ నగర్ మాజీ సర్పంచ్ మల్లీశ్వరి, సోదరుడు రామకృష్ణ వైయస్సార్సీపి నుంచి తిరుగుబాటు చేశారు. యాదవ సామాజిక వర్గం నేతలను సమీకరించడానికి టిడిపి జాతీయ కార్యదర్శి, జి నరసింహ యాదవ్ చొరవ తీసుకున్నారు. వారందరినీ టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్లి పార్టీలో మమేకం చేశారు. దీంతో తిరుపతి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులుకు మరింత బలం చేకూరినట్లు అంచనా వేస్తున్నారు.

చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులు అక్కడ టికెట్ దక్కకపోవడంతో జనసేనలో చేరి తిరుపతి అభ్యర్థిగా వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కినుక వహించిన అసంతృప్తి నేతలను బుజ్జగించడానికి, స్వయంగా జనసేన చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతిలో రెండు రోజులు బస చేసి, నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్ని నెల రోజుల వ్యవధిలోనే యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు టిడిపిలోకి రావడం మరింత బలం చేకూరినట్లు భావిస్తున్నారు ఇవన్నీ స్థానిక నాయకులు తీసుకున్న చొరవ వల్లే సాధ్యమైంది.

మాట తప్పారనేనా..!?

రాష్ట్రస్థాయిలో బీసీ నేతలుగా అన్నా రామచంద్రయ్య సోదరులకు పేరు ఉంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపిలోకి వచ్చిన ఆ సోదర ద్వయం " తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఎలా ఓడిస్తారో చూస్తాం" అని ఛాలెంజ్ చేసి, అండగా నిలిచారు. ప్రత్యర్థి పార్టీని మట్టి కరిపించడానికి పరిశ్రమించారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నా రామచంద్రయ్య కుమార్తె కార్పొరేటర్‌గా గెలిచారు. ," డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారు" అనేది అన్న రామచంద్రయ్య సోదరుల అభియోగం. మాకు కాకుండా.. " ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తన కుమారుడు భూమన అభినయ రెడ్డినీ ఆ పదవిలో కూర్చుండబెట్టారు" అని ఆగ్రహించినట్లు తిరుపతి నగరంలో వినిపించే మాట. ఈ పరిణామాల నేపథ్యంలో వారు టిడిపిలోకి వెళ్లడం వైఎస్ఆర్సిపికి దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు.

చంద్రగిరి కోటలో.. తిరుగుబాట్లు

తిరుగులేని శక్తిగా చంద్రగిరి సెగ్మెంట్‌ను తీర్చిదిద్దుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోటకు బీటలు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. కీలకమైన నాయకులు వైఎస్ఆర్సిపిని వీడి టిడిపిలో చేరడమే దీనికి నిదర్శనం అని భావిస్తున్నారు. తన కుమారుడి కోసం ముందస్తు వ్యూహంతోనే రాజకీయ సోపానం సిద్ధం చేశారనేది ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయం. ఎమ్మెల్యేగా, తర్వాత విప్- తుడా చైర్మన్- టీటీడీ బోర్డు సభ్యుడుగా దక్కిన పదవులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రత్యేక పర్వదినాల్లో దుస్తులు, తాయిలాల పంపిణీ చేశారు. కరోనా కల్లోలంలో ప్రతి ఇంటికి అందించిన సేవలతో ప్రజలకు చేరువయ్యారు.

ఆ ధైర్యంతోనే ఆయన ప్రస్తుతం ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ స్థానంలో తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని రంగంలోకి దించారు. తండ్రికి తగినట్లే కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా సాధారణ జనంతో మమేకం కావడంలో సఫలమైనట్లు చెప్పవచ్చు. అయితే .. ఈ సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో ఓటమి చెందిన పులివర్తి వెంకట మణిప్రసాద్ (పులివర్తి నాని) టిడిపి అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

రాజకీయ పదవుల్లో చెవిరెడ్డి వల్ల అసంతృప్తికి గురైన నేతలు వైఎస్ఆర్సిపినే వీడారు. తిరుచానూరు పంచాయతీ మాజీ సర్పంచ్, వన్నె కుల సంఘంలో కీలక నేత అయిన సిఆర్ రాజన్ చిత్తూరు అసెంబ్లీ స్థానానికి ఇన్చార్జిగా వెళ్లారు. తాజాగా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల సర్పంచ్ బడి సుధా యాదవ్ పద్మావతి పురం మాజీ సర్పంచ్ గణపతి నాయుడు, ఆయన సతీమణి తిరుచానూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ శ్రీవిద్య, చంద్రగిరి మాజీ జెడ్పిటిసి సభ్యురాలు సరిత రమణమూర్తితో పాటు గ్రామ మండల స్థాయి నాయకులు నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. వారితోపాటు వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు రమణ, పొదిపట్ల ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్, సాయి నగర్ ఎంపీటీసీ సభ్యుడు వినోద్, మల్లంగుంట మాజీ సర్పంచ్ దిలీప్, పుదిపట్ల ఉపసర్పంచ్ నాయుడు, శ్రీనివాసపురం ఉపసర్పంచ్ సునీల్, సింగిల్ విండో డైరెక్టర్ ముని కృష్ణారెడ్డి కూడా టిడిపి కండువాలు వేసుకున్నారు.


టిడిపి నుంచి టికెట్ ఆశించిన రియల్ టర్ డాలర్ దివాకర్ రెడ్డి తో పాటు చంద్రగిరి మండలంలో పారిశ్రామికవేత్త ఏవి రమణమూర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుడిపల్లి సురేష్ రెడ్డి పాకాల జడ్పిటిసి సభ్యురాలు నంగా పద్మజా రెడ్డి, ఆమె భర్త నంగా బాబు రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కస్తూరి, మాజీ ఎంపీపీ లక్ష్మీకాంతమ్మ ఇలా చెబుతూ పోతే చాంతాడంత జాబితా ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మాజీలు కూడా టిడిపి తీర్థం పుచ్చుకోవడం చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద కుదుపుగా భావిస్తున్నారు.

నాకేమీ కనిపించడం లేదబ్బా..

అధికార వైఎస్ఆర్ సీపీకి చిత్తూరు జిల్లాలో పెద్దన్న పోషిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి నగరి, తిరుపతి, అసెంబ్లీ సెగ్మెంట్లలో జరుగుతున్న పరిణామాలను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కుమారుడు భూమన అభివృద్ధిని పోటీ చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్ రెడ్డిని రంగంలోకి దించారు. అసంతృప్తి, తిరుగుబాటు ఎదురుకొంటున్న మంత్రి ఆర్కే రోజా .. వీరందరూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండటం ఓ కారణం కావచ్చు అనేది పార్టీ వర్గాల్లో వినిపించే మాట. అంతేకాకుండా వారంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాటి నుంచి కూడా మంత్రి పెడ్డి రెడ్డికి రాజకీయంగా సఖ్యత లేదనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ లో వారంతా దివంగత సీఎం డా. వైఎస్ఆర్కు విధేయులుగా ఉండేవారు. అప్పట్లో వైఎస్ఆర్‌తో రాజకీయంగా విభేదించిన ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎడముఖం పెడముఖంగా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మారినప్పటికీ, కాంగ్రెస్ నాటి రోజుల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై ప్రస్ఫుటంగా అనిపిస్తోంది.

ముక్తాయింపు:

సాధారణంగా ఎన్నికల వేళ టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు గందరగోళానికి దారి తీస్తూ ఉంటాయి. 2024 ఎన్నికలు కూడా అందుకు ఏమాత్రం అతీతం కాదు. పొత్తులు సీత సర్దుబాటులో ఆ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. నష్ట నివారణ చర్యలు స్థానిక నియోజకవర్గాల నేతలు తీసుకున్న చొరవ కూటమికి బలం చేకూర్చింది. ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తే ఆ ఖ్యాతి స్థానిక నాయకులకే దక్కుతుంది. ఓడితే మాత్రం అపవాదు టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు మూటగట్టుకోక తప్పదు అనేది నిష్ఠూర సత్యం. ఈ పరిణామాలు ఎలా దారి తీస్తాయి? ఎన్నికల్లో ఎవరికి పరిస్థితి అనుకూలంగా మారుతుంది అనేది చూడాలంటే పోలింగ్ వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News