దివ్యాంగుల కోటా పింఛన్లపై సర్కారు నజర్

అనర్హుల జాబితాను సిద్దం చేస్తున్న అధికారులు,50వేలకు పైగా అనర్హులు వుంటారని అంచనా .;

Update: 2025-07-03 14:01 GMT

ఏపీలో పింఛన్ ల జారీలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయల పెంచి నాలుగు వేల పింఛన్ అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లను మాత్రం ఇంకా మంజూరు చేయలేదు. అయితే పింఛన్ అందుకుంటున్న వారిలో అనర్హులు ఎవ్వరన్న దానిపైన మాత్రం ప్రభుత్వం దృష్టి సారించింది.ముఖ్యంగా దివ్యాంగ పింఛన్ల లో గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. దివ్యాంగుల కోటా ఫించన్లపై ఫోకస్ పెట్టిన అధికారులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.వైసీపీ హయాంలో సరైన ధ్రువీకరణ లేకుండానే దివ్యాంగ పింఛన్లు మంజూరు చేసినట్లు తేలడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు మొదలు పెట్టింది.

దివ్యాంగుల కోటాలో ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది పింఛన్లు పొందుతున్నారు. ఈ క్రమంలోనే 175 నియోజకవర్గాల్లో 4 లక్షల పింఛన్లను ఇప్పటి వరకు తనిఖీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.అందులో 50 వేలకు పైగా లబ్దిదారులు అనర్హులుగా తేలినట్లు తెలుస్తోంది. బోగస్ పింఛన్లు అధికంగా మాజీ సీఎం జగన్‌ నియోజకవర్గం పులివెందులలోనే వున్నట్లు భావిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ అయ్యాయని,వారిలో ఇప్పటివరకు 4.76 లక్షల మంది మాత్రమే రీ-వెరిఫికేషన్‌కు హాజరయ్యారని చెబుతున్నారు. మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి , పింఛన్లను నిలుపుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.పులివెందుల నియోజక వర్గంలో అధికంగా ఆతర్వాత ఎక్కువ బోగస్ పింఛన్లను కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో వున్నట్లు గుర్తించారు.ఇక 59 నియోజకవర్గాల్లో 500కు పైగా, 13 నియోజకవర్గాల్లో వెయ్యి నుంచి 1500 మధ్య బోగస్ పింఛన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
శారీరక వికలాంగత,అంధత్వం, చెవుడు లేనప్పటికీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందిన వారి సంఖ్య 50 వేల మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.బోగస్ పింఛన్ల కారణంగా ప్రభుత్వం పై పడుతున్న భారాన్ని తగించి అసలైన లబ్దిదారులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని అధికార పక్షం నేతలు చెబుతుండగా , ఇంతవరకూ ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయక పోగా , ఉన్న వారికీ బోగస్ అంటూ కోత పెట్టే చర్యలు చేపడుతోందని విపక్షం ఆరోపిస్తోంది.
Tags:    

Similar News