పీ4లో మార్గదర్శుల సంఖ్య పెంచాలి
ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం పెంచేందుకు విదేశాల్లో పీ4 సలహాదారుల నియమించాలని సీఎం చంద్రబాబు సూచించారు.;
By : The Federal
Update: 2025-06-25 13:30 GMT
పీ4 కార్యక్రమంలో మార్గదర్శుల సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన పీ4 విధానంపై అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బుధవారం సమీక్ష చేశారు. మార్గదర్శుల గుర్తింపు, బంగారు కుటుంబాల ఎంపిక అంశాలపై సిఎం అధికారులతో చర్చించారు. పీ4 విధానంలో మేలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,15,771 బంగారు కుటుంబాలను గుర్తించగా వారిలో ఇప్పటి వరకు 87,395 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని అధికారులు వివరించారు. సమాజంలో చాలామంది ఏదో ఒక రూపంలో పేదలకు సాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, అలాంటి వారికి పీ4ను వేదికగా మార్చాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
మార్గదర్శకులుగా ఉండేవారిని సంప్రదించేందుకు.. బంగారు కుటుంబాలను వారితో అనుసంధానం చేసేందుకు మరింత ఎక్కువ దృష్టిపెట్టాలని సిఎం సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిత్యం మోనిటరింగ్ చేసేందుకు కాల్ సెంటర్‌ను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. మార్గదర్శకులుగా ఉండాలనుకునే వారికి అసవరమైన సమాచారాన్ని, గైడెన్స్ ఇచ్చేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. మార్గదర్శలతో బంగారు కుటుంబాలను అనుసంధానించిన తరవాత.... అంతకుముందు వారి పరిస్థితి, బంగారు కుటుంబంగా ఎంపికైన తరువాత వారి జీవన ప్రమాణాలను తెలుసుకునేందుకు సర్వేలను కూడా నిర్వహించాలని సిఎం సూచించారు. కార్యక్రమం అమలుపై విధిగా ఆడిటింగ్ నిర్వహించడం, మూడు నెలలకు ఒకసారి సమీక్షించడం, పీ4 ప్రభావాన్ని నివేదకల ద్వారా ఎప్పటికప్పుడు మార్గదర్శకులకు కూడా అందించాలన్నారు.
పారిశ్రామిక వేత్తలు, ఎన్‌ఐఆర్‌లు, సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలవారితో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, వాటిల్లో పీ4 కాన్సెప్ట్‌ను వివరించి...వారిని మార్గదర్శులుగా ఉండేందుకు ఆహ్వానించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శుల భాగస్వామ్యం పెంచేందుకు టాప్ 100 కంపెనీలకు చెందిన సీఈఓలు, సివోవోలు, సీఎఫ్‌ఓ, ఎండిలు, చైర్మన్‌లతో నేరుగా తానే మాట్లాడి పిలుపునిస్తానని సిఎం అన్నారు. దీంతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారితో వర్చువల్ విధానంలో సమావేశమై కార్యక్రమ ప్రాధాన్యత, ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి మార్గదర్శులుగా ముందుకొచ్చేందుకు వారిని ఆహ్వానిస్తానని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలను పీ4 అడ్వైజర్లుగా పెట్టి....ఎన్‌ఆర్‌ఐలను మార్గదర్శకులుగా చేర్చేందుకు ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉన్నట్లు సిఎం తెలిపారు. ఈ జీరో పావర్టీ, పీ4 కాన్సెప్ట్‌ను ప్రమోట్ చేసేందుకు రూపొందించిన పలు లోగోలను సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు. త్వరలో ఒక లోగోను ఎంపిక చేయనున్నారు. అదే విధంగా పీ4 ను ప్రారంభించిన మార్చి 30న పీ 4 వార్షికోత్సవంగా నిర్వహించి సాధించిన విజయాలను చాటి చెప్పాలన్నారు. అమరావతి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులు పాల్గొన్నారు.