ఈ స్నేహ బంధము ఎంత ‘మధురము’...
అమరావతిలో బుడమేరులా పొంగిపొర్లిన మోదీ-బాబు స్నేహానురాగాల రాజకీయార్థం ఏమిటి?;
ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛేదు గతాన్ని ఎప్పుడో మర్చిపోయారు. తిట్టుకున్న తిట్లు, చేసుకున్న విమర్శలు, మరో అడుగేసి చేసుకున్న ఆరోపణలు.. గతం గతః అనుకుంటూ ఏపీ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల ముందే మర్చిపోయారు.. సరే మర్చి పోయినట్లు నటించి ఎన్నికల్లో జట్టుకట్టారు. చంద్రబాబు ఎన్డీయే లో కీలక భాగస్వామి అయ్యాక...ఇరువురి అభిప్రాయాలే మారిపోయాయి. దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ భుజాలపై చేతులేసుకొని పబ్లిగ్గా పాటలే పాడుకుంటున్నారు. అన్నట్లు చంద్రబాబు అవసరం మోదీకి వుందా? మోదీ అవసరం చంద్రబాబు కు వుందా? ఈ భేతాళ ప్రశ్నకు జవాబు దొరకడం కష్టమే.. నిజం చెప్పాలంటే పరాన్నజీవులలా ఒకరిపై ఒకరు ఆధారపడిన జీవిస్తున్నారు.. ఆ అదే పాలన..అధికారం నిలుపుకుంటున్నారు.
అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాలను విశ్లేషిస్తే.. అమ్మో ఒకరిని ఒకరు మించిపోయారు.ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఒకరిపై ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. వాళ్ల మనస్సుల్లో ఏముందోగాని, విన్నవారికి ఔరా అనిపించాయి.మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరివేపాకు చందంలా కనిపించారు. అది వేరే సంగతి.ప్రధాని మోదీ సభలో మాట్లాడిన మాటలతో చంద్రబాబు లో ఆనందం ఉరకలేసింది. అసలే అమరావతి ని తిరిగి గట్టెక్కించానన్న ఆనందంలో వున్న చంద్రబాబుకు మోదీ ప్రసంగం, భరోసా ఇచ్చిన తీరు తబ్బిబయ్యేలా చేశాయంటే అతిశయోక్తి కాదు.
చంద్రబాబు ను మించిన నేత దేశంలో లేడు- మోదీ
చంద్రబాబు గురించి ఒక రహస్యం కూడా చెబుతున్నానని మోదీ ,బాబు ను ఆకాశానికి ఎత్తేశారు."టెక్నాలజీ నాతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారు. కానీ నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాదులో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. అధికారులను హైదరాబాద్ పంపించి అక్కడి ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించాను. భారీ ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరెవ్వరూ లేరు" ఇలా ప్రధాని నోట ఆమాటలు రావడంతోనే చంద్రబాబు పులకించి పోయారు.
తన ఏపీ పర్యటన పూర్తి చేసుకొని ఢీల్లీ వెళ్లాక కూడా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ను మరోమారు ఆకాశానికెత్తేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తనకు మంచి మిత్రుడిగా అభివర్ణించిన మోదీ, అమరావతిపై ఆయనకున్న దార్శనికతను, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయన నిబద్ధతను అభినందిస్తున్నట్లు తెలిపారు. అమరావతి అభివృద్ధిలో ఒక నూతన, చరిత్రాత్మక అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని తన సోదర సోదరీమణుల మధ్య ఉండటం సంతోషంగా ఉందని తెలిపారు. అమరావతి భవిష్యత్తులో ఒక కీలక పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత మెరుగుపరుస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
సరైన సమయంలో దేశానికి సరైన నేత నరేంద్ర మోదీ- చంద్రబాబు ప్రశంస
ప్రధాని మోదీ స్ఫూర్తిదాయక ప్రసంగం, రాష్ట్ర పురోగతి కోసం మరింత కష్టపడి పనిచేయాలనే తమ నిబద్ధతకు పునరుజ్జీవం కల్పించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతు, ప్రజలు ఆశించిన రాజధానిని నిర్మించగలమనే విశ్వాసాన్ని మరింత బలపరిచిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. "మోదీ జీ, మేమంతా మీ వెంటే ఉన్నాం. వందేమాతరం, భారత్ మాతాకీ జై" అంటూ తాము ప్రధాని వెంటే నిలుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ప్రకటించారు.
సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని చంద్రబాబు ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని కొనియాడారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పదో స్థానంలో ఉందని, ఇప్పుడు ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తుచేశారు. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకవైపు అభివృద్ధి, మరోవైపు పేదరిక నిర్మూలనకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. దేశాభివృద్ధే లక్ష్యంగా ఆయన శ్రమిస్తున్నారని అన్నారు. ఇటీవల కులగణన చేయాలని మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఇది కేంద్రం తీసుకున్న గొప్ప నిర్ణయమని గేమ్ ఛేంజర్ గా చంద్రబాబు అభివర్ణించారు.
అమరావతి పునర్నిర్మాణం, ఏపీ అభివృద్ధి
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దడానికి తమ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి అవుతుందని చెప్పిన చంద్రబాబు పై ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారం ఉంటుందన్న హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా అమరావతిని రాష్ట్రానికి గర్వకారణమైన రాజధానిగా అభివృద్ధి చేస్తామని, కేంద్రం సహకారంతో ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామని చెప్పారు.
ఇరువురు నాయకులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి మాట్లాడారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కూడా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
బలంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
అమరావతి సభలో కేంద్రం, రాష్ట్రం మధ్య బలమైన సహకారం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇస్తే,చంద్రబాబు నాయుడు కేంద్రం సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి కి జరిగిన నష్టాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు.ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.
కేంద్రంలో,రాష్ట్రంలో బలంగానే ఎన్డీయే..మోదీ,బాబు సంకేతాలు
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు బలంగా వుంటాయన్న నమ్మకాన్ని మోదీ, చంద్రబాబు కల్గించారు.జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కూటమి బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధైర్యం ఇచ్చారు.
అందుకే మోదీ, చంద్రబాబు ప్రసంగాలలో పవన్ , పవన్ కళ్యాణ్ ప్రసంగంలో చంద్రబాబు హైలెట్ గా నిలిచారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మనుగడకు చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ మద్దతు అత్యవసరం, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు లేనిదే మోదీ ఏమి చేయలేని పరిస్థితి. అందులోనూ 23 మంది ఎంపీలున్న టీడీపీ నే బీజేపీ కి వెన్నుదన్ను. అందుకేనేమో మోదీ కూడా చంద్రబాబు జపం చేశారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు చూస్తే తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ వుంది. అయినా జనసేన, బీజేపీ లను కలుపుకొని కూటమి ప్రభుత్వమే వుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం సాఫీగా సాగాలన్నా, అప్పులలో వున్న రాష్ట్రం, అభివృద్ధి జరగాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యవసరం. కేంద్రం చేయి విదిలిస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. అమరావతి అయినా, పోలవరం అయినా ఇంకేదయిన కేంద్ర నిధులు లేకుండా, రాకుండా పూర్తి కావడం సాధ్యం కాదు. అందుకే లోకేష్ ప్రసంగం కూడా అంతా "నమో" స్తుతి తో సాగింది. "కలిసి వుంటే కలదు సుఖః" అన్నట్లు మోదీ ,చంద్రబాబు లు పాత చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, ముందుకు సాగడం మాత్రం ఆంధ్రప్రదేశ్ కు మేలే చేస్తుంది.
అమరావతి పునర్ నిర్మాణ సమయంలో మోదీ, బాబుల ప్రసంగాల జోరు ,పొగడ్తల హోరు ఎలావున్నా , అమరావతి ని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం చట్టం చేస్తుందన్న హామీ కూడా మోదీ ఇవ్వలేదు. ప్రధాని గా అమరావతి కి ప్రత్యేకంగా కేంద్రం ఇది చేస్తుందని మోదీ చెప్పలేదన్న విపక్షాల విమర్శలు మాత్రం కొసమెరుపు.