ముంచుకొస్తున్న ‘దానా’ తుపాన్‌

తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడింది. ఈ తుపానుకు ’దానా’గా నామకరణం చేశారు.

Update: 2024-10-23 07:36 GMT

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాన్‌ ముప్పు పొంచి ఉంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడింది. ఈ తుపానుకు ’దానా’గా నామకరణం చేశారు. ఇది రేపటికి వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనుందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 18కిమీ వేగంతో ఈ తుపాన్‌ కదులుతున్నదని తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశముందన్నారు. పూరీ–సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటనుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి పారాదీప్‌ (ఒడిశా)కి 560 కిమీ, సాగర్‌ ద్వీపాని(పశ్చిమ బెంగాల్‌)కి630కిమీ, ఖేపుపరా (బంగ్లాదేశ్‌)కి 630కిమీ దూరంలో ఈ దానా తుపాన్‌ కేంద్రీకృతమై ఉందని తెలిపారు. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 80–90 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం, గురువారం సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో దాదాపు 200 రైళ్ల రాకపోకలను రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటిని దారి మళ్లించారు. ప్రత్యేక హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేసి ఈ వివరాలను ప్రయాణికులకు చేర వేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్‌లలో ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 08912746330, 08912744619, 8712641255, 7780787054 నంబర్లతో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. ఈ నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News