న్యాయవృత్తికి మేధస్సు, ఆత్మబలం అవసరం!

విశాఖలో జరిగిన దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.;

Update: 2025-09-05 15:51 GMT
డీఎస్‌ఎన్‌ఎల్‌యూ స్నాతకోత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తులు, విద్యార్థులు

న్యాయ వృత్తి అత్యంత సవాళ్లతో కూడుకున్నదని, దీనికి మేధస్సుతో పాటు ఆత్మ బలమూ అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) 8, 9, 10, 11, 12 బ్యాచ్‌ల స్నాతకోత్సవం విశాఖలో శుక్రవారం జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ సూర్యకాంత్‌ హాజరై న్యాయ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే?

‘న్యాయ విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులు, మిత్రుల సహాకారాన్ని గుర్తు చేసుకోవాలి. నిజాయతీ, స్వీయ అవగాహన, మార్పును స్వీకరించడం, విజయాలను సొంత ప్రమాణాల ప్రకారం నిర్వహించుకోవడం ముఖ్యం. విద్యార్థులు ఎప్పుడూ ఆసక్తిగా ఉండాలి. సత్సంబంధాలను నిర్మించుకోవాలి. సమాజంలో మార్పునకు దోహదపడాలి’ అంటూ ముఖ్యంగా న్యాయ విద్యార్థినుల పట్టభద్ర విజయాలను అభినందించారు.
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలిః జస్టిస్‌ నరసింహ
ఆర్థిక శక్తి, న్యాయపాలన పట్ల నిబద్ధతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ తన స్థానాన్ని బలంగా నిర్మంచుకుంటున్న ఈ కాలంలో న్యాయ పట్టభద్రులు సమాజానికి విశిష్ట సేవలందించాలని ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నరసింహ పిలుపు నిచ్చారు. వ్యక్తిత్వం, నైతికతలతో కూడిన జీవితం నిర్మించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి, డీఎస్‌ఎల్‌ఏ మాజీ ఛాన్సలర్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి మాట్లాడుతూ న్యాయ పట్టభద్రులు తమ ప్రయాణంలో సహకరించిన అధ్యాపకులు, స్నేహితులు, సిబ్బంది, తల్లిదండ్రులను స్మరించుకోవాలని కోరారు. న్యాయ వృత్తిలో కష్టపడి, నిజాయితీగా పని చేయడం సత్ఫలితాలనిస్తుందని చెప్పారు.
న్యాయ విద్యార్థులకు పట్టాల ప్రదానం..
దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా ఆయా విద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పట్టాలను ప్రదానం చేశారు. బీఏ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌డీ పట్టభద్రులు పట్టాలను అందుకున్నారు. న్యాయ విద్యలోని వివిధ విభాగాల్లో ప్రతిభావంతులకు బంగారు, వెండి పతకాలను ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీఎస్‌ఎల్‌ఎ ఛాన్సలర్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డీఎస్‌ఎల్‌ఏ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాష్, విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.
విశాఖలో ఇంటర్నేషనల్‌ మీడియేషన్‌ కాన్ఫరెన్స్‌..
భోపాల్‌లోని నేషనల్‌ లా ఇనిస్టిట్యూట్‌ యూనివర్సిటీ సహకారంతో ఆసియా సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ కార్యక్రమంలో శుక్రవారం విశాఖలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరిగింది. టెక్నిక్స్, టెక్నాలజీ అండ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ద్వారా న్యాయం పొందడానికి వారధి’ అనే థీమ్‌తో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సును నిర్వహించింది. ఈ సమావేశం భారతదేశంలోని మధ్యవర్తిత్వం భవిష్యత్తుపై ప్రముఖ న్యాయ నిపుణులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలను ఒక చోట చేర్చింది. సదస్సులో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ మధ్యవర్తిత్వం కోర్టులు, పౌరుల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ అభిప్రాయపడ్డారు.
మరో 800 మంది న్యాయమూర్తులు అవసరం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 650 మంది జడ్జిలు ఉన్నారని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాగూర్‌ చెప్పారు. విశాఖలో శుక్రవారం జరిగిన ఇంటర్నేషనల్‌ మీడియేషన్‌ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన కేసులు త్వరితగతిన పరిష్కారం కావాలంటే మరో 800 మంది న్యాయమూర్తులు అవసరమని వెల్లడించారు. ప్రస్తుతం మధ్యవర్తిత్వ ప్రక్రియ చాలా కీలకమన్నారు. మీడియేషన్‌ నిపుణులను తయారు చేసేందుకు 40 గంటల శిక్షణ అవసరమవుతుందని చెప్పారు. మీడియేషన్‌ చేసే వారికి చాలా నైపుణ్యం ఉండాలని, దానిని కొలిచేందుకు ఓ ప్రత్యేక సర్టిఫికేష¯Œ ఉండాలన్నారు. ఆర్బిట్రేషన్‌ రంగంలోకి విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు వస్తున్నారన్నారు. వీరిలో హానెస్ట్, డిజానెస్ట్‌ ఆర్బిట్రేటర్లు కూడా ఉన్నారని, ఇందుకోసం ప్రత్యేకమైన యంత్రాంగం ఉండాలని తాను భావిస్తున్నానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ చెప్పారు.
Tags:    

Similar News