టీడీపీని వణికిస్తున్న ‘కొలికపూడి’ తుఫాను

టీడీపీలో 'టికెట్ మాఫియా' ఆరోపణలతో మళ్లీ వివాదాల తెరపైకి వచ్చిన తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.

Update: 2025-10-24 11:01 GMT

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మళ్లీ వివాదాల తెరమీదకొచ్చారు. గెలిచిన రోజు నుంచి అనేక కలకలాలకు కారణమైన ఈ నాయకుడు, తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్)పై '5 కోట్ల టికెట్ డీల్' ఆరోపణలు చేసి పార్టీలో భూకంపం సృష్టించారు. వాట్సాప్ స్టేటస్‌లో బ్యాంక్ ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేసి, 'నిజం గెలవాలి' అంటూ డ్రామా రాసుకున్నారు. ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య గొడవా? లేక TDPలో పలు గుప్త వ్యవహారాలు బయటపడుతున్నాయా?

టికెట్ కోసం ఎంపీ చిన్ని '5 కోట్ల డీల్

2024 ఎన్నికల సమయంలో తిరువూరు TDP టికెట్ కోసం విజయవాడ ఎంపీ చిన్ని '5 కోట్లు అడిగారు' అని కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు దఫాల్లో 60 లక్షలు తన అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేశాను. మిగిలిన 3.5 కోట్ల వివరాలు త్వరలో బయటపెడతాను అని వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. చిన్ని పీఏ కిషోర్ 'ఇసుక, రేషన్ మాఫియా' నడుపుతూ పార్టీ పదవులు 'అమ్ముకుంటున్నారు' అని కూడా ఆరోపించారు. ఇది కేవలం వ్యక్తిగత గొడవే కాక మధ్యలో 'రియల్ ఎస్టేట్ మోసాలు, జాబ్ కన్సల్టెన్సీలు' వంటి గుప్త వ్యవహారాలు కూడా బయటపడ్డాయి.

ఈ ఆరోపణలు TDP అధిష్ఠానాన్ని కలవరపరిచాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'పిలవడాలు, బతిమాలడాలు లేవు' అని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ మళ్లీ సమావేశమై, కొలికపూడిని 'హాజరు' చేసుకోవాలని సూచించింది.

చిన్ని 'చిన్ని ఎద్దేవా'

తిరువూరు పర్యటనకు వచ్చిన చిన్ని ఘాటుగా స్పందించారు. "నేను వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కాదు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లను విమర్శించేవారిని శత్రువుల్లా చూస్తాను" అని ప్రకటించారు. కొలికపూడి '12 నెలల వరకు దేవుడని, ఇప్పుడు దెయ్యం ఎందుకు అంటున్నారో ఆయనే చెప్పాలి' అని చిన్ని ఎద్దేవా చేశారు. "పొద్దున్నే దేవినేని అవినాష్‌లా, మధ్యాహ్నం పేర్ని నానిలా, సాయంత్రం కేశినేని నానిలా, రాత్రికి స్వామిదాసులా ఉండే క్యారెక్టర్ నాది కాదు" అని కొలికపూడి మాటలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు దీన్ని 'టీడీపీలో అవినీతి రాజ్యం' అని ప్రచారం చేస్తున్నారు. పార్టీలో 'ఎల్లో ముఠా'ల మధ్య పోరు బయటపడిందని ఆరోపిస్తున్నారు.

4 సార్లు క్రమశిక్షణ, సూసైడ్ నోట్‌లు

కొలికపూడి వివాదాలు కొత్తవి కావు. గెలిచిన తర్వాతే అనేక కలకలాలకు కారణమయ్యారు. చిట్యాల సర్పంచ్ భార్య, గోపాలపురం తమ్ముడు భార్యలు ఆత్మహత్యాయత్నాలు చేసుకున్నారు. అసభ్య ప్రవర్తనలకు కారణమని ఆరోపణలు వచ్చాయి. కంభంపాడు గ్రామంలో ఇంటిని కూల్చివేసే ప్రయత్నం చేశారు. నీటిపారుదల ఏఈ వి కిషోర్ సూసైడ్ నోట్‌లో 'కొలికపూడి ఆదేశాలతో బదిలీ నిలిపారు' అని పేర్కొన్నారు. "నా చావుకు ఎమ్మెల్యే కారణం" అంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు లేఖ రాశారు. ఇప్పటికే 4 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. తాజా ఆరోపణలతో 5వ సారి క్రమశిక్షణ కమిటీ ముందు నిలబడే పరిస్థితి వచ్చింది.

టీడీపీలో 'టికెట్ వార్స్' నుంచి 'అంతర్గత యుద్ధం'కు...

కొలికపూడి వివాదాలు కేవలం వ్యక్తిగతమా? టీడీపీలో ఎన్నికల సమయంలో 'టికెట్ అమ్మకాలు' లాంటి గుప్త వ్యవహారాలు బయటపడుతున్నాయా? టీడీపీలో 'చిన్ని గ్యాంగ్ వర్సెస్ లోకల్ నాయకులు' పోరు బాహాటమైంది. చిన్ని ప్రభావం తిరువూరు వంటి నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోంది. ఆయన లోకేష్ కు సన్నిహితుతు కావడంతో పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ కొలికపూడి లాంటి 'నూతన ఎమ్మెల్యేలు' టికెట్ డీల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విపక్షం ఈ వివాదాన్ని 'టీడీపీ అవినీతి'గా ప్రచారం చేస్తూ, 2029 ఎన్నికలకు ముందుగా 'కలకలం' సృష్టిస్తోంది. తనపై గతంలో ఆరోపణలు ఉన్నప్పటికీ వాట్సాప్‌లో 'ఆధారాలు' పోస్ట్ చేయడం కొలికపూడి ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై చర్చ మొదలైంది. ఇది పార్టీలో అతని స్థానాన్ని బలహీనపరుస్తోంది.

పార్టీకి 'హెడేక్'గా కొలికపూడి...

ఈ వివాదం తెలుగుదేశం పార్టీకి 'హెడేక్'గా మారుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు 'క్రమశిక్ష'కు దూకుతారా? లేక లోకల్ నాయకుల అసంతృప్తిని దూరం చేస్తారా? అనేది పెద్ద చర్చగా మారింది. కొలికపూడి తీరు మారకపోతే, తిరువూరు స్థానం కూడా ప్రమాదంలో పడుతుంది. 'నిజం గెలవాలి' అన్న కొలికపూడి మాటలు ఎంతవరకు నిజమో, పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. టీడీపీలో ఈ 'తుఫాను' ఎలా ఆగిపోతుందో చూడాలి!

Tags:    

Similar News