ఆకలి నుంచి ‘అర్జున' అవార్డు దాకా..

చిన్నప్పుడు పాలు పట్టే స్థాయి లేక గంజితోనే పెంచిన తల్లి. కూలి నాలి చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చిన తండ్రి. పరుగుతోనే ప్రయోజకురాలైన జ్యోతి యర్రాజీ.;

Update: 2025-01-05 13:20 GMT

అర్జున అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజీ 

ఆకలితో అల్లాడిపోతున్న చిన్నారి కూతురికి అందరి తల్లుల్లాగా పాలు పట్టే పరిస్థితి లేక ఆ తల్లి వేడి వేడి గంజినీళ్లే నోట్లో పోసేది. 'అమ్మా.. ఆకలేస్తుంది.. ఏదైనా పెట్టమ్మా! అని కూతురు అడిగితే ఇంట్లో ఏమీ లేక, కొని పెట్టే స్థోమతులేక ఆ పేద తల్లి మనసు విలవిల్లాడిపోయేది. పరుగుల రాణిగా పేరు తెచ్చుకోవడానికి రేయింబవళ్లు కష్టపడుతుంటే.. ఆడపిల్ల ఆలస్యంగా ఇంటికొస్తోందంటూ ఇరుగు పొరుగు వారి సూటి పోటీ మాటలనూ ఆ మాతృమూర్తి మౌనంగా భరించింది. అవేమీ పట్టించుకోవద్దమ్మా! నేను పరుగులో మేటిగా నిలబడి మీ కష్టాలను గట్టెక్కిస్తాను నన్ను నమ్ము.. అంటే కన్నపేగుపై నమ్మకం కుదరలేదు. ఇప్పుడా బిడ్డ కనిపెంచిన అమ్మానాన్నలకే కాదు.. పుట్టిన ఊరికి, దేశానికి పెద్ద పేరు తెచ్చింది. గర్వకారణంగానూ నిలిచింది. ఒకప్పుడు హేళన చేసిన నోళ్లతోనే ఇప్పుడు శెభాష్ అనిపించుకుంటోంది. ఈనెల 2న క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక 'అర్జున’ అవార్డును దక్కించుకున్న జ్యోతి యర్రాజీ. కడుపేదరికంలో పెరిగి, లక్ష్యానికి చేరుకున్న జ్యోతి విజయ ప్రస్థానం.. మీ కోసం!

పరుగు పందెలో జ్యోతి

 

విశాఖ నగరంలోని కంచరపాలెం (కైలాసపురం) బాపూజీనగర్ లోపల సందుల్లో.. బైక్ కూడా వెళ్లలేని, మనిషి మాత్రమే వెళ్లగలిగే చోట 50 గజాల్లో ఓ చిన్న పాత ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు గురించి ఏ కొద్దిమందికో తప్ప ఎవరికీ అంతగా తెలియదు. మూడు రోజుల క్రితం ఆ పరిసరాల్లో మీడియా ప్రతినిధులు, అధికారుల తాకిడి మొదలైంది. ఎప్పుడూ జనసంచారం అంతగా ఉండని ఆ ప్రాంతం ఎందుకింత హడావుడిగా ఉందన్న అనుమానం స్థానికుల్లో మొదలైంది. 'జ్యోతి యర్రాజీ' ఇల్లెక్కడ? అంటూ అక్కడకు వచ్చిన వారు ఆరా తీస్తూ కనిపిస్తున్నారు. కానీ చాలామంది తెలియదనే సమాధానం చెప్పారు. ఏదోలా వాకబు చేసి జ్యోతి ఇల్లును కనిపెట్టారు. అతికష్టమ్మీద అక్కడకు చేరుకోగలిగారు. ఎవరెవరో కొత్తవారు, మీడియా మైకులతో కనిపిస్తుంటే తొలుత జ్యోతి తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. 'మీ అమ్మాయి జ్యోతి 'అర్జున' అవార్డుకు ఎంపికైంది.. మీ స్పందన కోసం వచ్చాం' అంటూ ఒక్కొక్కరూ ప్రశ్నలు గుప్పిస్తుంటే ఆ తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. వారు అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పుకుంటూ వెళ్లారు. ఇక ఆ ఇల్లు అప్పట్నుంచి మీడియా ప్రతినిధులు, చుట్టాలు, బంధువులు, అధికారుల తాకిడితో, అభినందనలతో సందడిగా మారిపోయింది. ఆ ఇంట సంక్రాంతి పెద్ద పండగ ముందే వచ్చేసింది.

 

జ్యోతి తల్లిదండ్రులు కుమారి, సూర్యనారాయణ

జ్యోతి కుటుంబ నేపథ్యం ఇదీ...

జ్యోతి పుట్టేనాటికే తల్లిదండ్రులు పేదరికంతో ఉన్నారు. తండ్రి సూర్యనారాయణ ఒంట్లో ఓపిక ఉన్న సమయంలో భవన నిర్మాణ కూలీగాను, తల్లి కుమారి ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వారు. జ్యోతిని ప్రైవేటు స్కూల్లో చేర్చే స్థోమతు లేక సమీపంలోని డీఎల్బీ, పోర్టు పాఠశాలల్లో చదివించారు. తోటి పిల్లలు నడిచి వెళ్తుంటే జ్యోతి మాత్రం బుక్స్ బ్యాగు భుజానేసుకుని పరుగెడుతూ స్కూలుకెళ్లేది. ఎందుకలా పరుగెడ్తూ వెళ్తున్నావని ఎవరైనా అడిగితే రన్నింగ్ ప్రాక్టీస్ అవుతుందని చెప్పేది. స్కూల్ గేమ్స్ లోనూ చురుగ్గా పాల్గొని రన్నింగ్ ప్రైజ్లు కొట్టేది. అలా ఆమెలోని ప్రతిభను గుర్తించిన టీచర్లు, క్రీడా సంస్థల అధికారులు ప్రోత్సహించేవారు.

 

జ్యోతి సాధించిన పతకాలు, మెమెంటోలు, అవార్డులు

పతకాల వరద ఇలా..

జ్యోతి అలా అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ కాంస్య, రజత, బంగారు పతకాలను సాధించేది. రికార్డులనూ సొంతం చేసుకునేది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ శిబిరంలో పాల్గొని జాతీయ స్థాయిలో పోటీ పడింది. ఆ సమయంలో భువనేశ్వర్లో ఉండగా జ్యోతి తన ప్రతిభతో ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ దృష్టిలో పడింది. తమ రిలయెన్స్ పెర్ఫార్మెన్స్ సెంటర్ అథ్లెటిక్స్ శిక్షణలో ఆమెకు అవకాశమిచ్చారు. ఇక అక్కడ నుంచి జ్యోతి వెనుదిరిగి చూడకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. 2024లో పారిస్ లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్కు 100 మీటర్ల హర్డిల్స్కు ఎంపికైన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది జ్యోతి.

ఇంటి తలుపునకు వేలాడదీసిన జ్యోతికి లభించిన మెడల్స్

 

ఇలా ఇప్పటివరకు జ్యోతి 13 అంతర్జాతీయ, 22 జాతీయ పతకాలను, 22 స్వదేశీ మెడల్స్ను సాధించింది. ఇంకా 100 మీటర్లను 11.47 సెకండ్లలోను, 200 మీటర్లను 23.13 సెకండ్లలోను, 100 మీటర్ల హర్డిల్స్లో 12.78 సెకండ్లలోను, 60 మీటర్ల హర్డిల్స్ 8.12 సెకండ్లలోనూ పూర్తి చేసి నేషనల్ రికార్డులను నెలకొల్పింది. అంతేకాదు.. ఏసియన్ గేమ్స్ 2022లో సిల్వర్, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2021లో కాంస్య, ఏసియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో సిల్వర్, 2022లో జరిగిన బర్మింగ్హాం కామన్వెల్త్ గేమ్స్ తో పాటు అనేక పోటీల్లో రికార్డులు సృష్టించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటింది పాతికేళ్ల జ్యోతి యర్రాజీ.

జ్యోతి ప్రతిభకు 'అర్జున'తో పట్టం..

జ్యోతి యర్రాజీ తన అసాధారణ ప్రతిభతో అథ్లెట్గా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్రం కోసమే కాదు.. దేశం కోసం విదేశాల్లోనూ విజయాలు సాధిస్తూ వస్తోంది. ప్రఖ్యాత ఒలింపిక్స్లోనూ దేశంలో మరే మహిళా అథ్లెట్ సాధించని రికార్డును సొంతం చేసుకుంది. ఇలా జ్యోతి ప్రతిభకు గుర్తింపుగా నాలుగు రోజుల క్రితం ఆమెకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డును ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈనెల 17న ఢిల్లీలో రాష్టప్రతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జ్యోతి ఈ అవార్డును అందుకోనుంది. ఓ మహిళా అథ్లెట్కు రాష్ట్రంలో అర్జున అవార్డు దక్కడం ఇదే ప్రథమం కావడం మరో విశేషం!

 

జ్యోతి సొంతిల్లు ఇదే 

జ్యోతి గురించి ఆమె తల్లి ఏమంటున్నారంటే..?

'మాది కూలి నాలీ చేసి బతికే కుటుంబం. వచ్చే ఆదాయం బతకడానికే సరిపోయేది కాదు. జ్యోతి చిన్నప్పుడు ఆకలితో ఏడుస్తుంటే పాలు కొని పట్టలేక గంజి నీళ్లతోనే కడుపు నింపేదాన్ని. తినడానికి ఏదైనా అడిగినా పెట్టలేకపోయేదాన్ని. మా పాపకు చిన్నప్పట్నుంచి పరుగంటే ఇష్టం. కానీ ఆ ఇష్టానికి తగ్గట్టు మేం పెద్ద స్కూలుకు పంపే స్థోమతు లేక పోర్టు స్కూల్లోనే చదివించాం. మా ఇంట్లోకంటే బడిలోనే మంచి భోజనం దొరికేది. అందుకని అక్కడే అన్నం తిని అక్కడే పరుగులు తీసేది. స్కూలు స్థాయి నుంచే రన్నింగ్లో పతకాలు తెచ్చేది. అలా స్వయం కృషితో చదువుకంటే పరుగుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేది. స్కూలు మాస్టార్లు, ఆటలు నేర్పే వారు జ్యోతి

నిలదొక్కుకోడానికి ఎంతో సాయపడి పైకి తీసుకొచ్చారు. రన్నింగ్ ప్రాక్టీస్కు వెళ్లి రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తుంటే ఇరుగూ పొరుగూ ఆడిపోసుకునే వారు. పరుగెందుకమ్మా? మనకి అంటే.. 'లేదమ్మా.. మెడల్స్ సాధిస్తాను.. మీకు పేరు తెస్తాను.. మీ కష్టాలు తీరుస్తాను' అనేది. అన్నట్టే ఎన్నో పతకాలు తెచ్చింది. పరుగంటే జ్యోతికి ఎంత పిచ్చి అంటే రన్నింగ్ ప్రాక్టీసు ఉందని అన్నయ్య పెళ్లికి కూడా రాలేదు. పెళ్లిని వీడియోలో చూసి ఆనందించింది. అర్జున అవార్డు గొప్పతనం గురించి మాకేం తెలీదు. పెద్దోళ్లు, మీడియా వాళ్లు ఈ అవార్డు గురించి చెబితే మా కూతురు ఇంతటి ఘనత సాధించిందా? అని ఉప్పొంగిపోతున్నాం' అని జ్యోతి తల్లి కుమారి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి'తో తన ఆనందాన్ని పంచుకున్నారు. జ్యోతి మరో పరుగు పందెం కోసం ఇప్పుడు దక్షిణాఫ్రికాలో ఉందని చెప్పారామె.

ఇప్పటికీ అదే పేదరికం!

జ్యోతి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించినా ఇప్పటికీ ఆమె కుటుంబం పేదరికంలోనే ఉంది. 66 ఏళ్ల జ్యోతి తండ్రి పొట్టకూటి కోసం ఇప్పటికీ విశాఖ నగరంలోని ఓ షాపు వద్ద రాత్రి వేళ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. తన కూతురి స్థాయిని చూసి షాపు యజమాని తనను గౌరవంగా చూసుకుంటున్నారని మురిసిపోతున్నారు జ్యోతి తండ్రి సూర్యనారాయణ. ఆమె తల్లి ఇళ్లలో పనులు, అన్న సురేష్ పోర్టులో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుడుగా పని చేస్తున్నారు. అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం పేదలకిచ్చిన 50 గజాల స్కీము ఇంట్లోనే అంతా సర్దుకుని జీవిస్తుండడం జ్యోతి కుటుంబం పేదరికానికి దర్పణం పడుతోంది. జ్యోతికి వచ్చిన వందలాది పతకాలు ఆ చిన్న ఇంట్లో పెట్టడానికి చోటు లేకపోవడం విశేషం! ఇన్నేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తున్న జ్యోతి కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇల్లు గాని, ఇళ్ల స్థలం గాని మంజూరు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాగా స్పోర్ట్స్ కోటాలో జ్యోతికి కొన్నాళ్ల క్రితం రైల్వే (సికింద్రాబాద్)లో క్లాస్-3 ఉద్యోగం లభించింది.

 

నారాయణరావు

జ్యోతి తపనకు ప్రోత్సాహం..

'జ్యోతి ప్రతిభను గుర్తించి అసోసియేషన్ తరఫున ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చాం. రిలయెన్స్ ఫౌండేషన్లో చేరేందుకు తోడ్పాటునందించాం. ఒలంపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్కు ఎంపికైన తొలి భారతీయ మహిళ జ్యోతి మాత్రమే. పేదరికంలో ఉన్నా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పట్టుదలతో విజయాలు సాధిస్తోంది. ప్రతికూలతలను పట్టించుకోకుండా లక్ష్యాన్ని చేరుకోవడమే ఆమె ఏకైక లక్ష్యంగా దూసుకెళ్తుంది. ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికై గర్వకారణంగా నిలిచింది. జ్యోతికి ఇంటి స్థలం మంజూరు చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేశాం' అని డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్, ఏపీ స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎం.నారాయణరావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

Tags:    

Similar News