ఐఏఎస్ అధికారుల భవిష్యత్ ‘క్యాట్’ చేతిలో

తాజా ఆదేశాలను చాలెంజ్ చేస్తు మళ్ళీ ఐఏఎస్ లు క్యాట్ లో కేసులు దాఖలు చేశారు. మంగళవారం జరగబోయే విచారణలో క్యాట్ ఏమంటుందనే విషయం ఆసక్తిగా మారింది.

Update: 2024-10-15 07:00 GMT

కేంద్రప్రభుత్వాన్ని తెలంగాణాలో నలుగురు ఐఏఎస్ అధికారులు చాలెంజ్ చేశారు. తెలంగాణా పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీలో రిపోర్టుచేయాలని డీవోపీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు వెంటనే తెలంగాణాలో రిపోర్టు చేయాలని కూడా ఆదేశించింది. రెండురాష్ట్రాల్లో పనిచేస్తున్న ఏఐఎస్ అధికారులు తమ రాష్ట్రాల్లో రిపోర్టుచేయటానికి డీవోపీటీ 16వ తేదీని అంటే బుధవారంను గడువుగా విధించింది. గడువు దగ్గరపడుతున్న నేపధ్యంలో పదిమంది ఏఐఎస్ అధికారులు ఏమిచేస్తారా అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణాలో పనిచేస్తున్న అమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్ తో పాటు ఏపీ ఐఏఎస్ అధికారి జీ సృజన క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్)లో కేసులు దాఖలు చేశారు.

తమ బదిలీ విషయంలో డీవోపీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలంటు పై ఉన్నతాధికారులు సోమవారం క్యాట్ ను కోరారు. ఆ కేసులు మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది. డీవోపీటీ ఉత్తర్వులను వెంటనే రద్దుచేయాలని, తాము ఇపుడు పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కంటిన్యు అవుతామని ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటీషన్లలో వేర్వేరుగా క్యాట్ ను కోరారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత తాము ఏ రాష్ట్రంలో ఉండాలని అనుకుంటున్నామనే విషయాన్ని తెలియజేయాలంటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆప్షన్లను ఇవ్వమని డీవోపీటీ కోరింది. అలాగే తమ సొంతూర్లు ఏవనే విషయాలను కూడా చెప్పాలని కోరింది. 2014లో సమైక్య ఆంధ్ర విడిపోయినపుడు అటు ఏపీ ఇటు తెలంగాణాలో కొన్ని ప్లస్సులు, కొన్ని మైనస్సులన్నాయి. దాంతో తాము ఎక్కడ కంటిన్యు అవ్వాలని అనుకుంటున్నారనే విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయోమయంలో పడిపోయారు.

రాష్ట్ర విభజన ఇష్టంలేని ఏఐఎస్, ఐపీఎస్ అధికారులు తాము అప్పట్లో పనిచేస్తున్న ఏపీలోనే ఉండాలని కోరుకున్నారు. అలాగే విభజన సమయానికే తెలంగాణాలో కంటిన్యు అవ్వాలని మరికొందరు ఏపీ క్యాడర్ అధికారులు అనుకున్నారు. సొంతూర్లు ఏవనే విషయంలో తాము పుట్టిన ఊర్లను కూడా ప్రస్తావించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు విషయంలో చాలా కసరత్తులు, సంప్రదింపులు చేసిన డీవోపీటీ ఆప్షన్లతో పాటు వాళ్ళు ప్రస్తావించిన సొంతూర్ల అడ్రస్సుల ఆధారంగా తెలంగాణాలో పనిచేస్తున్న కొందరిని ఏపీకి అలాగే ఏపీలో పనిచేస్తున్న మరికొందరిని తెలంగాణాకు కేటాయించింది డీవోపీటీ. అయితే రెండు రాష్ట్రాల్లోను వాతావరణం కొత్తగా ఉన్న కారణంగా కేటాయింపుల ప్రకారం కొందరు జాయిన్ అవకుండా అప్పటి ముఖ్యమంత్రులు, కేంద్రంతో మాట్లాడుకుని తాము ఉన్న రాష్ట్రాల్లోనే కంటిన్యు అయ్యారు. మరికొందరు కేంద్రానికి డిప్యుటేషన్ పైన కూడా వెళ్ళొచ్చారు. కొంతకాలం తర్వాత పై అధికారులందరినీ కేటాయింపుల ప్రకారం ఏపీ, తెలంగాణాలో రిపోర్టు చేయాలని కేంద్రం చెప్పినా వీళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా కేంద్రం ఆదేశాలను క్యాట్ లో చాలెంజ్ చేశారు.

ఏఐఎస్ అధికారుల వాదనలు విన్న క్యాట్ డీవోపీటీ ఆదేశాలను సమర్ధించింది. వెంటనే తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్ళాల్సిందే అని స్పష్టంగా చెప్పింది. దాంతో వీళ్ళు సుప్రింకోర్టును ఆశ్రయించారు. అయితే క్యాట్ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రింకోర్టు నిరాకరించింది. అయితే వీళ్ళలో కొందరు కేంద్ర సర్వీసులకు వెళ్ళగా, మరికొందరు అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడుకుని మ్యానేజ్ చేసుకున్నారు. దాంతో ఇంతకాలం డీవోపీటీ ఆదేశాల ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయలేదు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వైఖరిని డీవోపీటీ సీరియస్ గా తీసుకుని తాజాగా ఈనెల 16వ తేదీలోగా తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సిందే అని వారంరోజుల క్రితం ఆదేశాలు జారీచేసింది. తాజా ఆదేశాలను చాలెంజ్ చేస్తు మళ్ళీ ఐఏఎస్ లు క్యాట్ లో కేసులు దాఖలు చేశారు. మంగళవారం జరగబోయే విచారణలో క్యాట్ ఏమంటుందనే విషయం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News