కొత్త ఏడాదిలో తొలి కేబినెట్‌ సమావేశం,అమరావతికి రూ 2,733 కోట్లు

పలు అంశాలపైన చర్చించిన కేబినెట్ 14 కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది.;

By :  Admin
Update: 2025-01-02 09:20 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నూతన సంవత్సరంలో తొలి కేబినెట్‌ సమావేశం జరిగింది. అమరావతి సచివాలయంలో గురువారం జరిగిన ఈ కేబినెట్‌ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్‌ మొదలైంది. దాదాపు మూడు గంటల సేపు చర్చలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు ఇతర మంత్రులు, సీఎస్‌ కే విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. దాదాపు 14 కీలక అంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో రూ. 2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. సీఆర్‌డీఏ 44వ సమావేశంలో తీసుకున్న మరో రెండు పనులకు కూడా ఆమోదం తెలిపింది.

మునిసిపల్‌ చట్ట సవరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో భవనాలు, లేఅవుట్ల అనుమతుల జారీ బాధ్యతలను మునిసిపాలిటీలకు అప్పజెప్పినట్టు అయ్యింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటుగా తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రి పడకలను 100కు పెంచాలనే ప్రతిపాదనలకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటు చేయడంపైన చర్చలు జరిపారు. నంద్యాల, కడప, కర్నూలు జిల్లాల్లో విండ్‌ ఎనర్జీ, సోలార్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన చర్చలు జరిపిన కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. చిత్తూరు జిల్లాలో హోం శాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపైన కీలక నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News