సంతానోత్పత్తి పడిపోతోంది : సీఎం చంద్రబాబు
జనాభా నియంత్రణ కాదు నిర్వహణ చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు.;
By : The Federal
Update: 2025-07-11 09:27 GMT
ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్పత్తి పడిపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా అనేది భారం కాకుండా చూసుకోవడంతో పాటు జనాభాను ఆస్తిగా భావించాలని, అలాంటి కాలం.. అలాంటి రోజులు ప్రస్తుతం వచ్చాయని అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతి సచివాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక సదస్సులో మాట్లాడుతూ.. ‘దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్’ అని గురజాడ చెప్పిన మాటల గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో జనాభా రేటు పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశానికి జనాభానే ప్రధాన ఆర్థిక వనరు అని పేర్కొన్నారు. గురజాడ మాటలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న వారికి స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు వీల్లేకుండా చట్టం తెచ్చామని, అయితే అది అప్పటి వాతావరణానికి అనుకూలంగా దానిని అమలు చేశామన్నారు. అయితే ప్రస్తుతం రోజుల పరిస్థితి వేరని, ఈ రోజు జనాభా పెరుగుదలను తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. జనాభా ఎక్కువుగా ఉన్న దేశాలను తక్కువ చూపు చేసేవారని అన్నారు. అయితే అది ప్రస్తుతం మారిందని, ఎక్కువ జనాభా కలిగిన దేశానికి ఎక్కువ గౌరవం ఇచ్చే రోజులు వచ్చాయన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత దేశంలోనే జనాభా అధికాంగా ఉన్నారని, 130 కోట్లు కలిగిన చైనా కంటే భారత దేశంలో 143 కోట్లు జనాభా ఉన్నారని తెలిపారు.
భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫర్టిలిటీ రేటు పడిపోతోందని, అగ్ర దేశమైన అమెరికాలో ఫర్టిలిటీ రేటు 1.62 శాతం మాత్రమేనని తెలిపారు. అది రెండు శాతం ఉన్నప్పుడే స్థిరంగా ఉంటుందన్నారు. భారత దేశంలో బీహార్, మేఘాలయా వంటి రాష్ట్రాలలో 3.0, 2.9 శాతాల చొప్పున ఎక్కువ ఫర్టిలిటీ రేటు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1.8 శాతానికి ఫర్టిలిటీ చేరుకుందన్నారు. ఇది ఇంకా పెరగాలన్నారు. యువశక్తి తగ్గడంతో పాటు అభివృద్ధి కూడా తగ్గిపోతోందని ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిణామమని అన్నారు. అందువల్ల గురజాడ చెప్పినట్లుగా దేశమంటే మనుషులోయ్ మాటల దిశగా అడుగులు వేయాలని, ఆ మాటలకు సార్థకత చేకూరాలని అన్నారు. జనాభా పెరుగుదల ఉండాలని, దానికి అనుగుణంగా ప్రభుత్వాల పాలసీలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిన సందర్భంగా నాడు ఐక్యరాజ్యసమితి 11జూలై 1985న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించిందన్నారు. ఫర్టిలిటీ రేటు అనేది 2.1 శాతంగా ఉంటేనే జనాభా పెరుగుదల అనేది స్థిరంగా ఉంటుందని, ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారత దేశం, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫర్టిలిటీ రేటు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.