పదేళ్లుగా కాగితాల్లోనే కృష్ణా కరకట్ట విస్తరణ

పది ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా కృష్ణా నది కరకట్ట విస్తరణ జరగలేదు. వారికి గుర్తు వచ్చినప్పుడు కరకట్ట విస్తరిస్తున్నామని చెబుతున్నారు.;

Update: 2025-02-22 10:40 GMT

కృష్ణా నది కి దక్షిణం వైపున సచివాలయానికి వెళ్లే దారిగా ఉన్న కరకట్ట పదేళ్లుగా విస్తరణకు నోచుకోలేదు. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి కరకట్ట మీద రాకపోకలు ఎక్కువయ్యాయి. అధికారుల కార్లు, రాజకీయ నాయకుల కార్లు, గ్రామాల్లోకి వెళ్లే వారి బైకులు, కార్లు కరకట్ట మీదుగనే వెళ్లాల్సి ఉంటుంది. గతంలో గతుకులతో ఉన్న కట్టను బాగు చేసి తారు రోడ్డు వేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం లేకుండా ఉంది. సింగిల్ రోడ్డు కావడం వల్ల రెండో వాహనం వచ్చినప్పుడు ఒక వైపు వాహనం స్లోగా వెళ్లాల్సి వస్తోంది. ఒక్కో సారి ఆగిపోవాల్సి వస్తోంది. లేదంటే నదిలోకో, పోలాల్లోకో వాహనాలు పడిపోతాయి. కట్ట ఎత్తు 4.5 మీటర్ల వరకు ఉంది. కరకట్టను డబుల్ రోడ్డుగా మారిస్తే తప్ప సింగిల్ రోడ్డు ఉన్నంత కాలం భయంతో ప్రయాణం చేయాల్సిందే. కొందరు డ్రైవర్లు కార్లు నడిపే సమయంలో ఎక్కవ స్పీడు పోవడం వల్ల బైకులపై వెళ్లే వారు కూడా భయపడుతున్నారు.

పదేళ్లుగా ప్రతిపాదనల్లోనే...

రెండు లైన్ల రహదారిగా కరకట్టను మార్చాలనే అంశం కొలిక్కి రావాలంటే భూ సేకరణ జరగాలి. నది లోపలి భాగంలోకి కట్టను జరిపితే భూ సేకరణ అవసరం లేదు. నది వెలుపలి భాగంలోకి కట్టను పెంచాలంటే భూ సేకరణ చేయాల్సిందే. నది లోపలి భాగంలో బడా బాబులు ఆక్రమించి ఉన్నారు. సుమారు 14 కిలో మీటర్ల వరకు ఈ ఆక్రమణలు ఉన్నాయి. అందువల్ల నదిలోపలి భాగంలోకి కట్టను విస్తరించడం జరిగే పని కాదని అర్థమైంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తుళ్లూరు ప్రాంతాన్ని అమరావతిగా ప్రకటించి కట్ట విస్తరణ చేపడుతున్నట్లు చెప్పారు. భూ సమీకరణ, భూ సేకరణ అంటూ కాలం గడిపారు. రెండూ జరగలేదు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత కూడా కట్టను విస్తరించాలనే ప్రతిపాదనలు రెండో సారి తయారు చేశారు. రెండు సార్లు నిధులు కేటాయించారు. అవి కూడా కాగితాల్లోనే ఉన్నాయి.

భూ సేకరణపై వెనక్కి తగ్గుతున్న ప్రభుత్వం

భూ సమీకరణ చేపడితే రైతులు అందుకు అంగీకరించడం లేదు. భూ సేకరణ చేపడితే తాము తమ భూములు కట్ట విస్తరణకు ఇస్తామంటున్నారు. భూ సేకణ చేపట్టాలంటే నిధులు ఉండాలని, నిధుల సమస్య ఉన్నందున అది కుదిరే అవకాశం లేదనే ఆలోచనను ప్రభుత్వం వక్తం చేస్తోంది. అమరావతి ప్రాంతంలో కేవలం జంగిల్ క్లియరెన్స్ కోసం రూ. 40 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అటువంటిది రాజధానికి వచ్చేందుకు అవసరమైన ప్రధాన రహదారి విస్తరణకు నిధులు లేవనడం ఏమిటనే ప్రశ్న కూడా పలువురి నుంచి వ్యక్తమవుతోంది.

కరకట్ట పొడవు 22 కిలో మీటర్లు

కృష్ణానది పై భాగాన ప్రకాశం బ్యారేజ్ నుంచి రాజధాని పై వరకు సుమారు 22 కిలో మీటర్ల దూరం కరకట్ట ఉంది. కొన్ని చోట్ల నదికి ఆనుకుని ఉండగా, కొన్ని చోట్ల నది నీటి ప్రవాహానికి దూరంగా కట్ట కనిపిస్తుంది. నీటి ప్రవాహానికి, కట్ట ఉన్న ప్రాంతానికి మధ్యలో ఉన్న భూ భాగంలో చాలా ఆక్రమణలు ఉన్నాయి. కట్ట కింది భాగంలో 21 మీటర్లు, పై భాగంలో 7 మీటర్ల వెడల్పు ఉంది. కట్ట ఎత్తు 4.5 మీటర్లు ఉంది. ఈ ఎత్తును 8 మీటర్ల వరకు పెంచాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. మొత్తం కట్ట పొడవులో 18.5 కిలో మీటర్లు రాజధాని ప్రాంతంలో ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి వైకుంఠపురం వరకు ఈ కరకట్ట ఉంది.

ఆలోచనలు బోలెడు.. ఆచరణ లేదు..

కృష్ణా కరకట్ట వెడల్పు పెంచి నాలుగు లైన్ల రహదారిగా మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం కట్ట కింది భాగం 21 మీటర్లు వెడల్పు ఉంటే నాలుగు లైన్ల రహదారిగా కట్టను విస్తరించాలంటే ఒకవైపు 24 మీటర్లు, మరో వైపు 24 మీటర్లు పెంచాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న వెడల్పును తీసి వేస్తే ఇంకా 29 మీటర్లు పెంచాల్సి ఉంటుంది. ఇంత మొత్తం భూమిని నది వెలుపలి వైపు తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే భూ సేరకరణకు నిధులు లేని కారణంగా పలు ఆలోచనలు చేస్తోంది. కనీసం డబుల్ రోడ్డు వేస్తే తరువాత ఆలోచించ వచ్చని పలువురు మేధావులు అంటున్నారు. ఇంజనీర్లు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నాలుగు లైన్ల రహదారిగా మార్చాలనే ఆలోచనలోనే ఉంది.

7.2 కిలో మీటర్లకు రూ. 1,300 కోట్లు

నాలుగు వరుసల రహదారికి నిర్మాణం చేపడితే మొదటిగా 7.2 కిలో మీటర్ల కట్ట పునర్నిర్మాణ పనులతో పాటు నాలుగు లైన్ల రహదారి నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు రూ. 1,300 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. అయినా అవి అంచనాలకే పరిమితమయ్యాయి. కట్టను విస్తరించడమా లేక డబుల్ రోడ్డు చేసి రిటైనింగ్ వాల్స్ నిర్మించడమా అనే మీమాంస నుంచి ప్రభుత్వం బయటకు రాలేదు. రెండు రకాల ప్రతిపాదనలు తయారు చేసి ఆలోచనలు చేస్తున్నారు.

వరద నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా ...

కట్ట పునర్నిర్మాణం అనేది వరదలను తట్టుకునే విధంగా ఉండాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఇటీవల వచ్చిన వరదల వల్ల నది నుంచి బ్యారేజీ ద్వారా సముద్రంలోకి 15 లక్షల క్యూసెక్స్ నీటిని విడుదల చేశారు. ఈ దశలో కరకట్ట లోపలి భాగంలో ఉన్న ముఖ్య మంత్రి నివాసంతో పాటు పలు కట్టడాలు సగానికి పైన మునకకు గురయ్యాయి. అయినా ఆక్రమణ దారులు ఆ భవనాలను క్లీన్ చేయించి అక్కడే ఉన్నారు. నది లోపలి భాగంలోకి కట్టను విస్తరించే అంశంపై జలవనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న కట్ట బయటకు మాత్రమే విస్తరించాలని, నది లోపలి భాగంలోకి విస్తరిస్తే భవిష్యత్ లో కట్టకు ప్రమాదం, బ్యారేజీకి ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. అందువల్ల ప్రస్తుతానికి నది లోపలి భాగంలోకి కట్టను విస్తరించే ఆలోచన మానుకున్నట్లేనని చెప్పొచ్చు.

కరకట్టను నది వెలుపలే విస్తరించాలి

నదిలోపలి భాగంలోకి కట్టను విస్తరిస్తే నదీ ప్రవాహానికి కట్ట అడ్డు వచ్చే అవకాశం ఉన్నందున వెలుపలి భాగంలోనే విస్తరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. కరకట్టను బలంగా తయారు చేయడంతో పాటు కావాల్సిన భూములను భూ సేకరణ ద్వారా తీసుకుంటే రైతులకు నష్ట పరిహారం విషయంలోనూ న్యాయం జరుగుతుందన్నారు. కట్ట పూర్తి పొడవున పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. రెండు ప్రభుత్వాలు మారినా కట్ట పునర్నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం కావడం బాధించే అంశమన్నారు.

Tags:    

Similar News