ఎవ్వరికీ పట్టని ‘‘రొయ్యల రైతుల రోదన’’
పెట్టుబడికి భయపడుతున్న ఆక్వా రైతులు, ఎగుమతుల ఎదురు దెబ్బలు, ధరల పెరుగుదల, రొయ్యల రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.;
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రొయ్యల ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు (టారిఫ్‌లు) ఈ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఫలితంగా రొయ్యల ధరలు పడిపోతుండగా, ఫీడు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గురువారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో జరిగిన ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సులో ఈ అంశాలు తీవ్ర చర్చకు వచ్చాయి. రైతు సంఘాలు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశాయి.
ఆక్వా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు
రొయ్యల ఉత్పత్తి ఎగుమతుల్లో ఏపీ అగ్రగామి. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 70-80 శాతం ఏపీ నుంచే ఉంటుంది. 2023-24లో 4.27 లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి అయ్యాయి, వీటి విలువ రూ.32,000 కోట్లు. కానీ 2025లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో విధించిన 25-59.72 శాతం సుంకాలు ఈ రంగాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా ఎగుమతులు తగ్గి, రొయ్యల ధరలు 100 కౌంట్ రూ.280 నుంచి రూ.200-210కు పడిపోయాయి. రైతులు ఉత్పత్తి ఆపేసి చేపల పెంపకం వైపు మళ్లుతున్నారు. ఈ సంక్షోభం 6.5 లక్షల రైతులు, 14 లక్షల మంది కార్మికుల జీవనోపాధిని ప్రభావితం చేస్తోంది.
ధరలు పెరుగుతున్న కారణాలు
రొయ్యల ధరలు పడిపోతుండగా ఫీడు, సీడు ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. వెనామి రొయ్య సీడు ధర ఫిబ్రవరి 2025లో ఒక్కటికి రూ.0.30 నుంచి రూ.0.41కు పెరిగింది. వనామీ రొయ్య సీడ్ (పోస్ట్-లార్వా, PL) (PL-10 నుంచి PL-15) ధర సాధారణంగా 1000 సీడ్‌లకు రూ. 250 నుంచి రూ. 450 వరకు ఉంటుంది. ప్రీమియం నాణ్యత సీడ్ నాణ్యమైన హ్యాచరీల నుంచి (ఉదా. SPF - Specific Pathogen Free సీడ్) ధరలు రూ. 500లు (వెయ్యి సీడ్‌లు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.) ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, నరసాపురం, కాకినాడ వంటి ఆక్వా హబ్‌లలో ధరలు కొంత తక్కువ ఉండవచ్చు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో సోయా, మొక్కజొన్న వంటి ముడి పదార్థాల ధరల పెరుగుదల, సరఫరా తీరులో ఆటుపోట్లు, ఎగుమతి సుంకాల వల్ల డిమాండ్ తగ్గడం జరిగాయి. దీంతో రైతుల ఉత్పత్తి ఖర్చు ఎకరానికి రూ.9 లక్షలకు చేరుకుంది. కానీ రాబడి తగ్గిపోతోంది. ప్రభుత్వం ఫీడు ధరలు తగ్గించినట్లు చెప్పుకుంటున్నా, రైతులు మాత్రం అమాంతం పెరుగుదలను ఎదుర్కొంటున్నారు. ఇది ప్రభుత్వ విధానాల వైఫల్యాన్ని సూచిస్తోంది. సబ్సిడీలు సరిపోకపోవడం, మార్కెట్ నియంత్రణ లోపం వంటివి ప్రధాన కారణాలు.
రొయ్యలపై ఎగుమతుల ప్రభావం
భారత రొయ్యల ఎగుమతుల్లో 35 శాతం అమెరికాకు వెళ్తాయి. సుంకాల వల్ల డిమాండ్ తగ్గి, ధరలు కుప్పకూలాయి. ఇక్వడార్ వంటి దేశాలు 10 శాతం సుంకంతో పోటీపడుతున్నాయి. దీంతో ఆక్వా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఎగుమతులు తగ్గితే, స్థానిక మార్కెట్‌లో రొయ్యలు పేరుకుపోయి ధరలు మరింత పడిపోతాయి.
అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే...
అమెరికా మార్కెట్‌ను కోల్పోతున్న నేపథ్యంలో, ఇతర దేశాల వైపు మళ్లడం అవసరం. యూకే-ఇండియా FTA ద్వారా రూ.104 మిలియన్ల విలువైన సీఫుడ్ ఎగుమతులు పెరగవచ్చు. 5 ఏళ్లలో $1 బిలియన్‌కు చేరుకోవచ్చు. చైనా, యూరప్, జపాన్ వంటి మార్కెట్లు ప్రత్యామ్నాయాలు. కానీ ఇవి అమెరికా మాదిరిగా పెద్దవి కావు.
దేశీయ మార్కెట్‌ను ప్రోత్సహించడం ద్వారా (ప్రమోషన్ డ్రైవ్) సమస్యను తగ్గించవచ్చు. అయితే కొత్త మార్కెట్లలో నాణ్యతా ప్రమాణాలు, లాజిస్టిక్స్ సవాళ్లు ఉంటాయి. మొత్తంగా వైవిధ్యీకరణ (Diversification) అవసరం. అంటే ఒక నిర్దిష్ట రంగం, వ్యాపారం, పెట్టుబడి లేదా కార్యకలాపాలను విభిన్న రూపాల్లో విస్తరించడం, లేదా విభజించడం దీని ఉద్దేశ్యం. సాధారణంగా రిస్క్‌ను తగ్గించడం, ఆదాయ వనరులను పెంచడం లేదా స్థిరత్వాన్ని సాధించడం చేయాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తుంది కానీ, తక్షణ నష్టాలను పూర్తిగా భర్తీ చేయదు.
రైతులు పడుతున్న ఇబ్బందులు
ప్రస్తుతం ఏపీలో ఆక్వా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరల పతనం, ఫీడు, సీడు ఖర్చుల పెరుగుదల, విద్యుత్ చార్జీలు, వ్యాధులు, మార్కెట్ అనిశ్చితి వల్ల లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రైతులు రుణాలు తీర్చలేక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు.
ఫీడు ధర పెరుగుదలకు కారణాలు
ఫీడు ధరలు పెరగడానికి అంతర్జాతీయ ముడి పదార్థాల ధరలు, సరఫరా సమస్యలు ముఖ్య కారణాలు. ప్రభుత్వం సబ్సిడీలు, స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని చెప్పినా అమలు లోపాలు ఉన్నాయి. రైతులు సబ్సిడీలు, ఎగుమతి సహాయం కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఆచరణలో వెనుకబడింది.
బాలోత్సవ్ భవన్ సదస్సు పిలుపు
గురువారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు ప్రభుత్వానికి గట్టి పిలుపు నిచ్చింది. సుంకాలు తగ్గించాలని, సబ్సిడీలు పెంచాలని, ఫీడు ధరలు నియంత్రించాలని, దేశీయ మార్కెట్ ప్రోత్సాహం ఇవ్వాలని డిమాండ్ చేసింది. రైతులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అధ్యక్షుడు వి కృష్ణయ్య నేతృత్వంలో జరిగిన ఈ సదస్సు ఆక్వా రంగాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వ, రైతుల మధ్య సమన్వయం అవసరమని సూచించింది.
మొత్తంగా ఆక్వా రంగం సంక్షోభాన్ని అధిగమించాలంటే ప్రభుత్వ సహాయం, అంతర్జాతీయ చర్చలు కీలకం. లేకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తప్పదు.
ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించాలి: సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ
ధరల స్థిరీకరణ బోర్డు ఏర్పాటు చేయాలి
ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం అన్నారు. విదేశీ ఎగుమతులు ఉంటేనే ఆక్వా రంగం బాగుంటుందనే అపోహను రైతులు పోగొట్టుకోవాలి. అవసరమైనప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఉండాలి, ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు.
రొయ్యల మేత మాఫియాను ప్రభుత్వం కంట్రోల్ చేయాలి
ఫీడు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే నెపంతో ఫీడు ధరలు పెంచడం వల్ల రొయ్యల పెంపకం ఖర్చు పెరుగుతోందని జై భారత్ క్షీరారామ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం కార్యదర్శి భవనం వెంకటనరసయ్య అన్నారు. మొక్కజొన్న పంట సరసమైన ధరకు వస్తున్నప్పటికీ ఫీడు ధరలు పెంచడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇందులో మాఫియా ఉందని వారిని గుర్తించి కంట్రోల్ చేస్తేనే ఫీడ్ కంపెనీలు సరైన ధరకు రైతులకు ఫీడ్ సరఫరా చేస్తాయని అన్నారు. రొయ్యల మేత ధరలు బ్రాండ్, నాణ్యత, ఫీడ్ రకం (స్టార్టర్, గ్రోవర్, ఫినిషర్) ఆధారంగా మారుతున్నాయి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల మేత ధర కేజీకి రూ. 50 నుంచి రూ. 150 వరకు ఉంటే ఒక్కోసారి ఈ ధర నాలుగు వందలు పలుకుతోందన్నారు.