పెళ్లి కూతురులా ముస్తాబవుతున్న విశాఖ సుందరి!
సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు వచ్చే అతిథులను ఆకట్టుకోవడానికి విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-11-11 14:12 GMT
అసలే అందాల సుందరి. దానికి మరింత అందాలు అద్దితే ఎలా ఉంటుంది మరి? ఇప్పుడు విశాఖ నగరి అలాంటి సౌందర్య లహరిని తలపించేలా కనిపిస్తోంది. ఎందుకంటే? ఈనెల 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ సొగసరిని చూడడానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలి వస్తున్నారు. అందుకోసం తన అందాన్నంతా వారి ముందు ఆరబోయడానికి సింగారించుకుంటోంది.
వుడా సర్కిల్‌లో పూల మొక్కను తలపించే విద్యుద్దీపాల అమరిక
ఎప్పుడూ ఏదో ఒక సందడే!
వాస్తవానికి వైజాగ్ ఎప్పటికప్పుడే ఫేషియల్ చేయించుకుంటుంది. విశాఖలో ఏడాదికో, రెండేళ్లకో ఏదో ఒక ఉత్సవమో? సమ్మిటో? జరుగుతూనే ఉంటుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉంది. ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్), ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), పార్టనర్‌షిప్ సమ్మిట్స్, బిజినెస్ సమ్మిట్స్, విశాఖ ఉత్సవ్, జీ–20 సదస్సులు వంటి వాటికి విశాఖ వేదిక అవుతోంది. వీటì కోసం విశాఖ నగరం ముస్తాబవుతూనే ఉంటుంది. ఈ నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దడానికి కొత్తగా రోడ్లపై లేయర్లు వేస్తుంటారు. రోడ్లకిరువైపులా ఆకర్షించే మొక్కలను నాటుతారు. డివైడర్లకు రంగులు అద్దుతారు. ప్రధాన జంక్షన్లలో ఆకట్టుకునే కట్టడాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు నగరంలో ఇవన్నీ చేస్తున్నారు.
సిరిపురం జంక్షన్లో విద్యుత్ పూల మొక్కను అమరుస్తున్న దృశ్యం
ఇప్పుడు వైజాగ్ ఎలా ఉందంటే?
ఈనెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల పండుగ కోసం విశాఖ నగరం మరోసారి సింగారించుకుంటోంది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, 45 దేశాలకు చెందిన మంత్రులు, అత్యంత ప్రముఖులు, వివిధ కంపెనీల సీఈవోలు పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు హాజరవుతున్నారు. రెండ్రోజులు వీరంతా వైజాగ్‌లోనే గడుపుతారు. ఈ సమ్మిట్ నేపథ్యంలో వైజాగ్ సిటీ ఇప్పుడెలా ఉందంటే? చూడటానికి రెండు కళ్లూ చాలవన్నట్టు రూపు దిద్దుకుంటోంది.
డివైడర్లపై పూలమొక్కలను నాటుతున్న జీవీఎంసీ సిబ్బంది
ఏ రోడ్డు చూసినా నల్ల తాచులా ఒంపులు తిరుగుతూ కనిపిస్తోంది. డివైడర్లన్నీ సరికొత్త రంగులతో మెరిసి పోతున్నాయి. వాటిపై కుండీల్లో ఉంచిన మొక్కలు పూలో, ఆకులో తెలియనంతగా అయోమయానికి గురి చేస్తున్నాయి. కూడళ్లు ఫౌంటెయిన్లు, వివిధ ఆకృతులతో సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. నగరంలో వీధులన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కొన్ని చోట్ల వెలిగీ వెలగని వీధి లైట్లు ఇప్పుడు ధగధగలతో వెలుగులు పంచుతున్నాయి.
రాత్రి వేళ నగరం మరింత అందంగా కనిపించడానికి వీటికి అదనంగా ఎల్‌ఈడీ బల్బుల దండలను చుడుతున్నారు. చెత్త, చెదారాలు మచ్చుకైనా కనిపించకుండా జీవీఎంసీ అధికారులు. సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగరతీరం అంతా మరింత సుందరంగా అగుపిస్తోంది. ఇలా వైజాగ్ ఇప్పుడు నవ యవ్వనంలో పట్టు చీర కట్టుకున్న అచ్చ తెలుగు ఆడ పడుచులా ఉంది. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు విచ్చేసే అతిరథ మహారథులు తనపై మనసు పారేసుకునేటంత అందంగా తయారైంది. చూపరులకు ముస్తాబైన కొత్త పెళ్లి కూతురులా విశాఖ సుందరి కనిపిస్తోంది.