సీఎం సార్, అవినీతి ఆగిందెక్కడ? ఏసీబీకి దొరికిన డోన్ తహసీల్దార్
రైతును పీడించి రూ.35వేలు లంచం వసూలు చేసిన డెప్యూటీ తహసీల్దార్
By : The Federal
Update: 2025-11-11 11:46 GMT
రైతు సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే అధికారులు మాత్రం చేతులు తడపనిదే ఫైలు కదలదని తెగేసి చెబుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే నంద్యాల జిల్లా డోన్ తహసీల్దార్ ఉదంతం. ఓ రైతు తన భూసమస్యను పరిష్కరించమంటూ ఆ అధికారి చుట్టూ తిరుగుతుంటే లంచం ఇస్తే తప్ప ఫైలు కదపలేనని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆ అధికారిని పట్టించారు. ఈ సమస్య పరిష్కారానికి రూ.35వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
డోన్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ (Deputy Tahsildar) సునీల్ రాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ రైతు భూసమస్య పరిష్కారానికి రూ.35వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి దొరికిపోయారు.
రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు మంగళవారం ఓ ప్లాన్ ప్రకారం ముందస్తు ఏర్పాట్లతో డోన్‌కు చేరుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు (Sunil Raju) లంచం తీసుకుంటున్న క్షణంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సునీల్ రాజు వద్ద నుండి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ ఘటనతో కార్యాలయం సిబ్బంది ఉలిక్కిపడింది. ఇంతమారుమూల ప్రాంతానికి ఏసీబీ అధికారులు రారనే ధీమాతో రెవెన్యూ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
దీనిపై అధికారులు పంచనామా నిర్వహించారు. డీఎస్పీ సోమన్న (DSP Somanna) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ ను విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. జిల్లాలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.