చేబ్రోలు కిరణ్ అరెస్ట్- రాజకీయ పార్టీలకో గుణపాఠం!
ఐదేళ్ల కిందట మహిళా ఓటర్ల మద్దతుతో అధికారం దక్కించుకున్న పార్టీయే ఆ తర్వాత వారి విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా గుర్తెరగాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.;
By : Amaraiah Akula
Update: 2025-04-13 02:10 GMT
సోషల్ మీడియా వేదికగా ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల భార్యలపై వ్యక్తిగత దాడులు, అసత్య ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధోరణి మరింత తీవ్రమవుతోంది. రాజకీయంగా తమకు గిట్టని వారిని టార్గెట్ చేయడం, ఓ నాయకుడిపై విమర్శలు వస్తే వెంటనే ఆయన కుటుంబంపై దుష్ప్రచారానికి దిగడం ఒక ప్రమాదకర ట్రెండ్‌గా మారింది.
మొన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు .. ఈవేళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీమతి వైఎస్ భారతి.. ఈ కేసులన్నింటా బాధితులు మహిళలే. సోషల్ మీడియా ట్రోలింగ్ కి గాయపడిన వారే. సంచలనం కోసం నిరాధారమైన ఆరోపణలు చేసి తమకు గిట్టని వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఆరోపణల పరంపర సాగుతోంది. సభ్య సమాజం చీదరించుకుంటున్నా, అరెస్టులు చేస్తున్నా వీళ్ల దూకుడు మాత్రం ఆగడం లేదు. చేబ్రోలు కిరణ్ కుమార్ అనే ఐటీడీపీ కార్యకర్త ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసహన వాతావరణం
రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షం, అధికార పార్టీ వర్గీయుల మధ్య భిన్నాభిప్రాయాలు సహజం. కానీ ఈ భిన్నత్వం వ్యక్తిగత స్థాయికి దిగజారడం, మహిళలే లక్ష్యంగా దుష్ప్రచారం చేయడం అత్యంత హేయం. చేబ్రోలు కిరణ్ కుమార్ వైఎస్ భారతిపై పెట్టిన వీడియో ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపింది. కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలనే అనైతిక, కుట్ర పూరిత ధోరణి రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను అప్రతిష్టకు గురిచేయాలని చూసే నాయకులు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంది. కేవలం ఓట్ల కోసం మహిళలను టార్గెట్ చేయడం అసహ్యకరం. ఐటీ చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో చిత్తశుద్ధి కొరవడడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈవేళ ప్రతి పార్టీకి ఓ సోషల్ మీడియా సెటప్ ఉంది. వీళ్లు వండి వార్చే వీడియోలకి, రీల్స్ కి పార్టీల ఐటీల విభాగాలు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. వీళ్ల హడావిడిని ఆయా పార్టీలు ఏదో ఒక స్థాయిలో సమర్థిస్తున్నాయి. నేరంగా ప్రోత్సహించకపోయినా, సరైన సమయంలో ఖండించకపోవడం కూడా వీళ్ల ఆగడాలకు మద్దతు ఇవ్వడమే.
ఇంకా ఏవేవీ ఘటనలు?
రాష్ట్ర రాజకీయాల్లో ట్రోలింగ్ కొత్తేమీ కాదు. గతంలో అనేక మందిపై ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ దాడి జరిగింది.
వైఎస్ షర్మిల – ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షురాలు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆమెపై కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో వ్యంగ్య చిత్రాలు, వ్యక్తిగత విమర్శలు, క్యారెక్టర్ ను కించపరిచే ఆరోపణలు.. ఇలా అనేకం విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఆమెను ‘ఆవిడ కాదు, అవినీతికీ చిహ్నం’ అని వ్యాఖ్యానించిన వారూ ఉన్నారు. ఒకానొక దశలో ఆమె కట్టుకునే చీరె రంగును సైతం ట్రోల్ చేశారు. అయినా ఏవైపు నుంచి ఖండన రాలేదు. చివరకు ఆమే వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సోషల్ మీడియాలో వచ్చిన విపరీత ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో మహిళల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రల్ని ఖండించాల్సి వచ్చింది.
పవన్ కల్యాణ్ భార్యలపై అనుచిత వ్యాఖ్యలు..
ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం, వివాహాలు, విడాకులు రాజకీయ నాయకులకు విమర్శనాస్త్రాలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలోనే పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడంతో ఆయన పార్టీ నేతలు మరింత రెచ్చిపోయారు. మంత్రి స్థాయిలోని వ్యక్తులు కూడా సభా వేదికలపై "పవన్ కల్యాణ్ కి మూడు పెళ్లిళ్లని, నలుగురు భార్యలని చెలరేగిపోయారు. పవన్ కి కుటుంబం అంటే అర్థం తెలుసా, వివాహ వ్యవస్థపై నమ్మకం ఉందా?" అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ విమర్శ కాదు, వ్యక్తిగత దూషణ. జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినా, ఆనాటి అధికార పార్టీ స్పందించక పోగా మరింతగా దాడి చేసింది. ఓ వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని ఎక్కుపెట్టే వీడియోల్ని ప్రచారం చేయడం వల్ల సామాజికంగా ఎంత నష్టం కలుగుతుంతో 2024అసెంబ్లీ ఎన్నికల దాకా వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. ఆ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే వివిధ సభల్లో పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, విడాకులు వంటి వాటిని చెబుతూ వచ్చి ఓ సామాజికవర్గాన్నే దూరం చేసుకునే దాకా తీసుకువచ్చుకున్నారు.
చంద్రబాబు కన్నీటి సందేశం...
2021లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తన సతీమణి భువనేశ్వరి గురించి కొందరు వైసీపీ శాసన సభ్యులు చేసిన వ్యాఖ్యలపై సభలో పెద్ద దుమారమే చెలరేగింది. ముఖ్యమంత్రి హోదాలో తప్ప అసెంబ్లీకి రానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి లోనై ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్కెక్కి ఏడ్చారు. కన్నీరు కార్చారు. "అసెంబ్లీలో నా భార్య పేరు తీసి ఇలాంటివి మాట్లాడతారా?" అని ఆయన ప్రశ్నించారు. ఆయనకు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు మద్దతుగా నిలిచినా, అధికార పార్టీ నేతలు మాత్రం అదో పెద్ద డ్రామా అంటూ వెటకారంగా స్పందించారు. దానికి వైసీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
వైఎస్ భారతి విషయంలో..
ఇప్పుడు వైఎస్ భారతి విషయంలో టీడీపీ అనుబంధ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్ అదే పని చేశారు. వైఎస్ జగన్ సతీమణిపై తీవ్ర స్థాయిలో చేసిన ఆరోపణలున్న వీడియోలు, వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గతంలో ఆమెపై ఇలాంటివి వచ్చినా టీడీపీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. పెద్దగా తప్పుగా చూడలేదు. కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు వీడియోలు షేర్ చేసినా, వారిపై ఎలాంటి చర్యలు కనబడలేదు. ఇప్పుడు తమ పార్టీ ఐటీ విభాగంలో పెయిడ్ కార్యకర్తగా ఉన్న చేబ్రోలు కిరణ్ కుమార్ ఓ వీడియో పెట్టడంతో తక్షణమే పార్టీ నాయకత్వం స్పందించక తప్పలేదు. ఆయన్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసింది. కేసు పెట్టించింది. అరెస్ట్ చేయించింది. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్నారు. ఈ పనేదో గతంలోనే చేసి ఉంటే పరిస్థితి ఇందాక వచ్చేది కాదు. ఇప్పుడింత నష్ట నివారణ చర్యల కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చేది కాదని సీనియర్ జర్నలిస్టు గణేష్ అభిప్రాయపడ్డారు.
విశాఖలో ఓ ఎమ్మెల్యే మాటలు:
"ఇంట్లో భార్యను అదుపులో పెట్టుకోలేని వాడు, రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు?" అని ఓ ఎమ్మెల్యే అన్న మాటలు గతంలో చాలా వివాదాస్పదం అయ్యాయి. మహిళా గౌరవాన్ని కాపాడాల్సిన పాలకుల నుంచే ఇటువంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. మరికొన్ని సభల్లో మరింత నీచంగానూ కొందరు వ్యాఖ్యానాలు చేశారు. ఒక చోట ఒక నాయకుడు: "పక్క పార్టీ వాళ్లందరికీ మా పార్టీలోని మహిళలంటే భయం!” అన్నాడు. ఈ మాట కాస్తంత మెచ్చుకోలుగా కనిపించినా దీని అంతరార్థం మాత్రం మహిళల్ని ఓ రాజకీయ ఆయుధంగా వాడే భావనే.
ఇదీ నేటి రాజకీయ వాస్తవం. సోషల్ మీడియా వేదికగా మహిళలపై ట్రోలింగ్ చేసిన వారికి రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్న దారుణ దృశ్యాలు ఎన్నో చూశాం. ఒక్కొక్కటిగా కేసులు నమోదు అవుతున్నా, అరెస్టులు జరుగుతున్నా – వారిపై పార్టీలు అసలేమీ జరిగినట్లు స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు, మహిళలు మాత్రం ఈ మౌనాన్ని గమనిస్తున్నారు. వాళ్లు ఎప్పటికీ క్షమించకపోవచ్చు కూడా. ఓటు వేసే ముందు మహిళ తన ఆత్మగౌరవాన్ని గుర్తుపెట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా వాత పెడుతుంది.
పార్టీలు తమ నాయకులపై విమర్శలైతే ఘాటుగా స్పందిస్తాయి. కానీ అదే పార్టీలు ప్రత్యర్థుల కుటుంబాలపై దుష్ప్రచారం జరిగితే మౌనంగా ఉండడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ ధోరణిపై మహిళలలో వ్యతిరేకత పెరుగుతోంది. మహిళలు ఏదైనా పార్టీకి ఓటేస్తే తన కుటుంబాన్ని ఆ పార్టీ గౌరవిస్తారని భావిస్తుంది. కానీ 'ఆమె' తన శరీరంపైన్నే ట్రోల్ చేస్తుందని ఊహించదు. తనకు అవమానం జరిగినపుడు తాను ఓటేసిన పార్టీ మౌనంగా ఉంటే, 'ఆమె' గుండె గాయపడుతుంది. తాత్కాలికంగా మౌనం మేలుగా అనిపించినా, దీర్ఘకాలంలో అదే మౌనం పార్టీకి నష్టంగా మారుతుంది. ఐదేళ్ల కిందట మహిళా ఓటర్ల మద్దతుతో అధికారం దక్కిన పార్టీయే ఆ తర్వాత వారి విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా గుర్తెరగాలని మహిళా సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రమా విజ్ఞప్తి చేశారు.
ఈ తరహా మౌనానికి మళ్లీ ఒక మహిళ క్షమించగలదా?
మహిళల్ని ట్రోల్ చేసే పార్టీల శ్రేణుల్ని నియంత్రించలేకపోతే తప్పక గుణపాఠం తప్పదనేది చారిత్రక వాస్తవం. ఏ పార్టీకి చెందిన మహిళకైనా అవమానం జరిగినపుడు దాన్ని ఖండించడంలో మహిళలందరూ పార్టీలకు అతీతంగా ఏకమవుతారన్నది నిజం. ట్రోల్ చేస్తున్న వారిని దండించక పోతే “మీరు మా ప్రాధాన్యం కాదు” అని మహిళలు అనుకుంటారని పార్టీలు గుర్తించుకోవాలి. పాలకుల మాటల కన్నా, వారి మౌనం భయానకం. మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యతనూ, రాజకీయ లబ్ధికి తాకట్టు పెట్టినవారిని మరోసారి అవకాశం ఇవ్వరు. మహిళలు క్షమించరు. ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించరు.
చంద్రబాబు అందుకే స్పందించారా?
రాజకీయాల్లో మార్పుకు, సంస్కరణలకు మహిళలే పెద్ద మద్దతుదారులు. వారి గౌరవాన్ని కాపాడే కర్తవ్యాన్ని విస్మరించే నాయకుల పట్ల వారు కఠినంగా ఉంటారని గత అనుభవాలు చెప్పుతున్నాయి. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇది తెలియంది కాదు. అందుకే ఆయన తక్షణం స్పందించి చేబ్రోలు కిరణ్ ను పోలీసులకు పట్టించారు. మహిళలకి జ్ఞాపకశక్తి చాలా మెండు. ఆమెను కించపరచిన ఏ పార్టీని 'ఆమె' క్షమించదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఆ తీర్పే ఇచ్చింది. సంక్షేమ రాజ్యాన్నీ తోసిపుచ్చింది.
మరి ఏం చేయాలి?
మహిళల్ని కించపరిచే వారిని ప్రభుత్వం క్షమించదన్న హెచ్చరిక సమాజానికి ఇవ్వాలి. అది చెప్పినట్టే కాకుండా చేసి చూపించాలి. ఆ విధమైన ప్రచారం సాగాలి. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి శిక్ష పడిందన్నది కనిపించాలి. పార్టీలు తమ కార్యకర్తల్ని అదుపులో ఉంచుకోవాలి. నోరు జారితే తిప్పలు తప్పవని హెచ్చరించాలి. నిజాయితీగా పనిచేసే మీడియా సంస్థలు ఇలాంటి ట్రోలింగ్స్ ను బాహాటంగా విమర్శించాలి. తమ సామాజిక బాధ్యతను నెరవేర్చాలి.
మహిళల్ని అసభ్యంగా చిత్రీకరిస్తే పార్టీ పెద్దల్లో గుర్తింపు వస్తుందనే భావనను తుడిచిపెట్టేలా నాయకులు వ్యవహరించాలి. రాజకీయ నాయకులు తమ కుటుంబాలను రక్షించుకునే హక్కు ఎంతుందో సమాజంలోని ఇతర వర్గాల మహిళల పట్ల బాధ్యత ఉందని మరువకుండా ఉండాలి. ట్రోలింగ్‌కి రాజకీయ నాయకుల మౌనమే సగం కారణం. ఈ అభిప్రాయాన్న పోగొట్టేలా చూడాలి.
ఇప్పటికైనా రాజకీయ పార్టీలకు, సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకులుగా ఉండే ప్రతి ఒక్కరికీ చేబ్రోలు కిరణ్ కుమార్ ఘటన ఓ గుణపాఠం కావాలి. పురుషాధిక్య రాజకీయాల్లో మహిళలను అవమానించడం ద్వారా ఏ పార్టీకీ గెలుపు రాదు. ఓటమి మాత్రం తప్పదు. చంద్రబాబూ ఇందుకు మినహాయింపు కాదు.