అమెరికా వల్ల ఆక్వా రంగం నష్టపోతోంది
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.;
By : Admin
Update: 2025-04-06 15:57 GMT
అమెరికా విధించిన సుంకాల కారణంగా ఆక్వారంగం నష్టపోతోందని, ఈ నష్టం నుంచి అక్వా రంగాన్ని రక్షించుకోవడానికి అండగా నిలవాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అక్వారంగంపై అమెరికా విధించిన సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి.. ఆక్వా రైతుల ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తుందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సిఎం చంద్రబాబు లేఖ రాశారు.
లేఖలో సీఎం ప్రస్తావించిన అంశాలు..
భారతదేశం నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా దేశ ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ల డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ౖ అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారతదేశంపై 27 శాతం దిగుమతి సుంకం కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుంది. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే అమెరికా విధిస్తోంది. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ..వారికి అనుకూలంగా మారుతోంది. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ (ఇVఈ) భారాన్ని మోస్తున్నారు.
అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్‌కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటుంది. అమెరికా విధించిన కొత్త సుంకం ఏప్రిల్ 5, 2025 నుండి అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అమెరికా దేశానికి వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోంది. గతంలో వచ్చిన ఆర్డర్‌లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేయబడి, కోల్డ్ స్టోరేజ్ లు, పోర్టులలో ఉన్నాయి. కొత్త నిబంధనల వల్ల ఈ ఉత్పత్తులపై సుంకాల భారం పడుతుంది. యూరోపియన్ యూనియన్‌లో భారతీయ ఎగుమతిదారులు 50 శాతం తనిఖీ రేట్లు, 4 – 7 శాతం దిగుమతి సుంకంతో సహా నాన్–టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. కానీ వియత్నాం వంటి దేశాలు ఉ్ఖతో వారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ)) కింద జీరో–డ్యూటీ పొందాయి.
ఈ కారణంగా వియాత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్‌ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయి. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాల మార్కెట్లు భారతదేశం నుండి సీ ఫుడ్‌ను కొనుగోలు చేసి వాటిని ప్రోసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయి. అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్సుల కారణంగా ఆ దేశాలు కూడా మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి. ఎపిలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉంది. మరోవైపు ఇంకా పంట సిద్ధంగా ఉంది. 27 శాతం సుంకాల కారణంగా రైతుల నుండి పంట సేకరిచడం ఎగుమతిదారులు నిలిపివేశారు.
ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ పరిణామాలతో ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతి దారులు..ఇలా అందరికీ సమస్యలు వచ్చాయి. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్చలు జరపాలి అని కోరుతున్నాను. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించడం వల్ల ఆక్వా రంగంపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది జీవనోపాధిని కాపాడినట్టు అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.