ఏపీ బడ్జెట్‌ను మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతన లేకుండా ఉందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన మండిపడ్డారు.;
కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ బుక్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఆయన మాట్లాడుతూ మండిపడ్డారు. అప్పుల మీద కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ధ్వజమెత్తారు. అప్పుల మీద కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు కరెక్టా? కాగ్ చెబుతున్న లెక్కలు కరెక్టా? అని నిలదీశారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 14లక్షల కోట్లు అప్పు చేసిందని కూటమి నాయకులు అబద్దాలు చెబుతున్నారని, రూ. 4, 38,278 కోట్లు అప్పులున్నాయని అధికారికంగా బడ్జెట్ బుక్‌లో చెబుతున్నారని, అప్పుల మీద ఎందుకు అబద్దాలు చెబుతున్నారని ప్రశ్నించారు. కార్పొరేషన్ అప్పులు రూ. 2,48, 677వేల కోట్లని కూటమి ప్రభుత్వం చెబుతోందని, అయితే కాగ్ అందుకు భిన్నంగా లెక్కలు చెప్పిందని, రూ. 1,54,797 కోట్లని కాగ్ చెబుతోందని వెల్లడించారు. వీటిల్లో ఎవరు కరెక్టు అని ప్రశ్నించారు. సివిల్ సప్లైస్ విభాగంలో రూ. 36వేల కోట్లు అప్పులు చేశామని కూటమి చెబుతోందన్నారు.
అలాగే డిస్కంలలో కూడా అప్పులు చేసినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. డబుల్ టైమ్ లెక్కలేసి కూటమి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై కావాలనే బురదజల్లుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం చెల్లింపులు చేయక పోవడం వల్ల విద్యుత్ సంస్థలు అప్పులు చేయాల్సి వచ్చిందని, దీనిని కూడా రెంటు సార్లు లెక్కలేసి చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ తన 9 నెలల పాలన కాలంలో రికార్డు స్థాయిలో రూ. 1.30లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని ఆరోపించారు. కుప్పల తెప్పలుగా కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.