తొలినాళ్లలో ఇండిపెండెంట్ల హవా

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కొనసాగిన స్వతంత్రుల హవా గత ఎన్నికలతో ముగిసింది. నేటి ఎన్నికల్లో ఓటర్లు స్వతంత్రులను గెలిపిస్తారా? లేదా? చూడాల్సిందే.

Update: 2024-05-07 08:05 GMT

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు హవా కొనసాగించారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పట్లో కూడా స్వతంత్రులదే హవాగా సాగింది. ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు, కృషికార్‌ లోక్‌పార్టీల మధ్యే గట్టి పోటీ జరిగింది. 1955లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు 22 మంది గెలిచారు. అనంతరం ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తరువాత 1957తో తెలంగాణ వరకు జరిగిన ఎన్నికల్లో పది మంది స్వతంత్రులు గెలిచారు. అంటే ఆం్ర«దప్రదేశ్‌ అసెంబ్లీలో 32 మంది స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 1983తో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకు స్వతంత్రుల హవా కొనసాగుతూనే వచ్చింది. ఆ తరువాత కొద్దికొద్దిగా తగ్గుతూ వచ్చింది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అనేవారు అసలు గెలవలేదు.

స్వతంత్రులు 51 మంది
1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. అప్పటి అసెంబ్లీ 300 సీట్లతో ఉంది. అందులో కాంగ్రెస్‌కు 177 రాగా íసీపీఐకి 51 సీట్లు వచ్చాయి. స్వతంత్ర పార్టీ 19, సోషలిస్ట్‌ పార్టీ 2 సీట్లు గెలవగా స్వతంత్రులు 51 మంది గెలిచారు.
1967లో సంచలనం
1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల గెలుపు సంచలనంగా మారింది. ఏకంగా 68 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కినా రెండో స్థానంలో స్వతంత్రులు ఉండటం విశేషం. మొత్తం 287 సీట్లు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 165 మంది, స్వతంత్ర పార్టీ నుంచి 29 మంది, సీపీఐ నుంచి 10, సీపీఎం నుంచి 9, బీజేఎస్‌ నుంచి 3, ఆర్పీఐ నుంచి 2, ఎస్‌ఎస్‌పీ నుంచి ఒకరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
1972లోనూ ఇండిపెండెంట్స్‌ హవా..
1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. మిగిలిన పార్టీలు సింగిల్‌ డిజిట్‌ దాటలేదు. అంటే అన్ని పార్టీలు డిపాజిట్‌లు కోల్పోయాయి. ఇండిపెండెంట్స్‌ మాత్రం 57 మంది గెలిచి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ పార్టీకి 219 సీట్లు రాగా సిపిఐకి 7 సీట్లు వచ్చాయి. స్వతంత్ర పార్టీ రెండు, సీపీఎం ఒకటి, ఎస్‌టిపిఎస్‌ ఒకటి వంతున గెలిచారు.
తగ్గుతూ వచ్చిన స్వతంత్రుల ప్రభావం
1978లో ఇందిరాగాంధీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్‌–ఐ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌–ఐకి 175 సీట్లు రాగా జనతాపార్టీకి 60 సీట్లు వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు 15 మంది గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ చీలిపోవడం, కొత్తగా జనతాపార్టీ పోటీ చేయడం జరిగినా ఇండిపెండెంట్లు మాత్రం పోటీ చేస్తూనే వచ్చారు.
తెలుగుదేశం ప్రభంజనంలోనూ ఇండిపెండెంట్ల గెలుపు
1983లో తెలుగుదేశం పార్టీ కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది. అయినా స్వతంత్రుల హవా తగ్గలేదు. 19 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 201, కాంగ్రెస్‌–ఐకి 60 వచ్చాయి. మొదటి సారి ఏపీలో బిజెపి మూడు సీట్లలో గెలిచింది. సీపీఎం 5, సీపీఐ4 సీట్లలో విజయం సాధించారు. అప్పట్లో కమ్యూనిస్టులు ఎన్‌టి రామారావును పెద్దగా విశ్వసించలేదు. తిరిగి 1985లో జరిగిన ఎన్నకల్లో స్వతంత్రులు 9 మంది గెలిచారు.
1989లో జరిగిన ఎన్నికల్లో 15 మంది, 1994లో జరిగిన ఎన్నికల్లో 12 మంది, 1999లో జరిగిన ఎన్నికల్లో 5గురు, 2004 ఎన్నికల్లో 11 మంది, 2009 ఎన్నికల్లో ముగ్గురు, 2014 ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్రులుగా గెలిచారు. 2019 ఎన్నికల్లో స్వతంత్రులను ఓటర్లు గెలిపించలేదు. 2024లో జరిగే ఎన్నికల్లో స్వతంత్రుల మాట ఉంటుందా? లేదా? అనేది చర్చనియాంశంగా మారింది.
స్వతంత్రులకు కాలం చెల్లినట్లేనా..
స్వాతంత్య్రం వచ్చినప్పటి రోజుల్లో ఎన్ని పార్టీలు పెట్టినా అన్ని పార్టీలను అప్పటి ప్రజలు ఆదరించారు. ఒక్కోసారి తిరస్కరించారు కూడా. అయితే స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపిస్తూ వచ్చారు. రాను రాను స్వతంత్రుల హవా తగ్గుతూ వచ్చింది. ఎందుకు ఈ విధంగా జరిగిందనే మాటకు రాజకీయ విశ్లేషకులు అనేక కోణాల్లో సమాధానం చెబుతున్నారు. ప్రధానంగా నాయకుల్లో స్వార్థం పెరిగిపోవడం, ఓటర్లు ఎక్కువగా డబ్బులకు అమ్ముడు పోవడం వల్లనే ఈ పరిణామాలు ఎదురవుతున్నాయంటున్నారు. నాటి ఎన్నికల్లో పార్టీలపై పెదవి విరిచిన వారు స్వతంత్రులుగా పోటీ చేసే వారు. వారిని ప్రజలు ఆదరించే వారు. ఎందుకంటే వారికి అప్పట్లో ఆ గుర్తింపు ఉండేది.
అప్పట్లో ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడేందుకు నాటి నాయకులు సిద్ధంగా ఉండే వారు. ఇప్పటి నాయకుల్లో పోరాట పటిమ లేదు. అధికారం ఉంటే వీధుల్లో కనిపిస్తారు. లేదంటే సంపాదనే ధ్యేయంగా ఎక్కడో కనిపించకుండా పోయి వ్యాపారాలు చేస్తుంటారు. ఎన్నికల సమయంలో మాత్రమే తెరపై కనిపిస్తారు. దీంతో ప్రజల్లోనూ వారి పట్ల వ్యతిరేకత క్రమేణా వచ్చింది. పార్టీల పరంగా ఎవరో ఒకరు పోటీలో ఉంటారు కాబట్టి వారికి ఓటు వేయక తప్పడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ వేసి కోట్లు ఖర్చుపెట్టుకునే కంటే పార్టీల తరపున అయితే పార్టీ వారు కూడా ఖర్చులకు కొంత డబ్బు ఇస్తుండటం, జనం కూడా స్వతంత్రులను కాకుండా పార్టీల వారినే విశ్వసించడం వల్ల స్వతంత్రుల హవా పూర్తిగా మటుమాయమైంది.
Tags:    

Similar News