అదో ప్రైవేటు వ్యక్తి టెంపుల్... సీఎం చంద్రబాబు సీరియస్
విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
By : The Federal
Update: 2025-11-01 10:41 GMT
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పందించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి ప్రజావేదికలో మాట్లాడుతూ చాలా సీరియస్ అయ్యారు.
కాశీబుగ్గపట్నంలో ఒక ప్రైవేటు వ్యక్తి వేంకటేశ్వరస్వామి దేవాలయం కట్టారని, కార్తీకమాసం సందర్భంగా చాలా మంది దర్శనానికి వెళ్లారని సీఎం తెలిపారు. దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బందోబస్తు పెట్టేవాళ్లమని చెప్పారు. తొక్కిసలాట ఘటనలో 10 మంది చనిపోయారని.. ఇది చాలా బాధాకరమన్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల ప్రాణాలు తీయడం బాధాకరమని.. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.
తుపానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని.. తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందటం బాధాకరమన్నారు చంద్రబాబు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుందని... విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడానికి వీలు లేదన్నారు. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేవుడు సన్నిధిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని బాధపడ్డారు. కాశీబుగ్గలో జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఈ ఆలయానికి ఇంత పేరు ఎలా వచ్చిందీ?
కాశీబుగ్గ పదనాపురం వద్ద నాలుగేళ్ల కిందటే ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ధర్మకర్త హరిముకుంద్ పండా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. 12 ఎకరాల ఆయన సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం ఐదు ఎకరాల్లో ఉంది. సుమారు రూ.20 కోట్లతో దీనిని నిర్మించారు. తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడ ఆలయం నిర్మించినట్టు తెలిసింది.
కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రసిద్ధి కాగా ఇప్పుడు ఆ పేరు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికీ వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలు తిరుమల వెళ్లి ఇక్కట్లు పడేదానికి బదులు కాశీబుగ్గ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి వస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం, హరిముకుంద్ పండా తిరుమల అనుభవం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో భక్తులు ఈ ఆలయానికి ఇటీవలి కాలంలో పోటెత్తుతున్నారు.