సైబరాబాద్ సీపీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత

లడ్డూలాగ దొరికిన అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ జీడిపాకం లాగ లాగుతోంది. ఈమధ్య కాలంలో కారుపార్టీ నేతలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టటానికి అవకాశం దొరకలేదు.

Update: 2024-09-12 11:46 GMT

లడ్డూలాగ దొరికిన అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ జీడిపాకం లాగ లాగుతోంది. ఈమధ్య కాలంలో కారుపార్టీ నేతలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టటానికి పెద్దగా అవకాశం దొరకలేదు. అలాంటి అవకాశం ఇపుడు బీఆర్ఎస్ శేరిలింగంపల్లి పిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ రూపంలో దొరికింది. గురువారం ఉదయం గాంధీ తన మద్దతుదారులతో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి ఇంటిమీదకు వెళ్ళటంతో మొదలైన వివాదం చివరకు సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ ఆఫీసుకు చేరుకుంది. గాంధీపై కఠినమైన సెక్షన్లు పెట్టి వెంటనే అరెస్టుచేయాలంటు పాడితో పాటు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు సీపీ ఆఫీసు ముందు పెద్దఎత్తున ఆందోళన చేశారు.

పాడిపై మద్దతుదారులతో కలిసి గాంధీ హత్యాయత్నానికి పాల్పడ్డారని, వెంటనే గాంధీని అరెస్టు చేయాలని, గాంధీ అనుచరులు పోలీసులపైన కూడా దాడులు చేశారు కాబట్టి పోలీసులు ముందు తమను తాము రక్షించుకోవాలని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పెద్దగా నినాదాలు చేశారు. గాంధీని అరెస్టుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవటం పోలీసులకు ప్రిస్టేజిగా మారిందని బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమపైన దాడిచేసి కొట్టిన గాంధీ మద్దతుదారులపైన కూడా పోలీసులు చర్యలు తీసుకోలేకపోతే ఎలాగంటు కార్తీక్ ప్రశ్నించారు.

గాంధీ అరెస్టు ప్రధాన డిమాండుతో ఫిర్యాదుచేయటానికి వచ్చిన తాము పోలీసు కమీషనర్ అభిషేక్ మహంతీని కలుస్తామని పాడి తదితరులు పోలీసులను అడిగారు. అయితే సీపీ లేరని చెప్పిన పోలీసులు పాడితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలను లోపలకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. దాంతో పోలీసులను తోసుకుని లోపలకు వెళ్ళేందుక పాడితో పాటు మద్దతుదారులు ప్రయత్నించటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఈ నేపధ్యంలోనే సీపీ లేరు కాబట్టి జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ ను కలిసి విజ్ఞప్తిని అందచేయాలని పోలీసులు చెప్పారు. అయితే అందుకు పాడి అంగీకరించలేదు. ఇంతలో హరీష్ రావు అక్కడకు చేరుకుని పాడిని సముదాయించి వెనక్కు తీసుకొచ్చారు. తర్వాత జోయెల్ డేవిస్ ను కలిసి గాంధీ అరెస్టు డిమాండు చేస్తు విజ్ఞప్తిని అందించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణా-ఆంధ్రా ప్రాంతాల మధ్య గొడవగా మారేందుకు శక్తివంచనలేకుండా కష్టపడుతున్నారు. గాంధీని ఉద్దేశించి పదేపదే ఆంధ్రానుండి బతకటానికి వచ్చిన గాంధీని వదిలే ప్రసక్తే లేదంటు హెచ్చరించటం విచిత్రంగా ఉంది. పాడి గొడవ ఇలాగుంటే ఆయన మద్దతుదారులు రెడ్డి-కమ్మ సామాజికవర్గాల మధ్య గొడవగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ఆంధ్రా కమ్మోడు హైదరాబాద్ వచ్చి తెలంగాణా రెడ్డి ఇంటిమీదకు వచ్చి దాడిచేస్తే చూస్తూ ఊరుకుంటామా’ అంటు బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News