క్రాప్ లోన్స్ కు దూరంగా కౌలు రైతులు

ఏపీలో బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు. రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు పాటించడం లేదు. ఎందుకు?;

Update: 2025-08-12 11:33 GMT
వరి నాట్లు వేస్తున్న మహిళలు (ఫైల్ ఫొటో)

రాష్ట్రంలోని కౌలు రైతుల (tenant farmers) పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వారు భూమి లేని వ్యవసాయదారులు. ఇతరుల భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తారు. కానీ వారికి సరైన గుర్తింపు, రుణాలు, సబ్సిడీలు లభించడం లేదు. 2025 నాటికి రాష్ట్రంలోని వ్యవసాయ శ్రామికుల్లో 70 నుంచి 80 శాతం మంది కౌలు రైతులే. అంటే సుమారు 32 లక్షల మంది. ఇది రాష్ట్ర వ్యవసాయ దారుల్లో మొత్తం సంఖ్యలో (సుమారు 60 లక్షల మంది) ఎక్కువ భాగంగా చెప్పొచ్చు. దీనికి తోడు సాధారణ వ్యవసాయదారులు (owner cultivators) సంఖ్య సుమారు 30 లక్షల మంది మాత్రమే. వీరు భూమి యజమానులు కావడంతో వారికి రుణాలు, సబ్సిడీలు సులభంగా లభిస్తాయి. కానీ కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందులు, రుణాలు అందక పోవడం, ప్రభుత్వ సహాయం అందకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.

మొత్తం వ్యవసాయ దారులు ఎంత మంది?

రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఎంత మంది అనేదానికి సరైన లెక్కలు లేవు. భూమి ఉన్న వారు సుమారు 1.20 కోట్ల వరకు ఉన్నారు. వ్యవసాయం చేస్తున్న వారు 80 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా. గత ప్రభుత్వం వీరిలో 53.50 లక్షల మందికి రైతు భరోసా సాయాన్ని అందించింది. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇటీవల 46 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించింది. కౌలు రైతులు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తేలకపోవడంతో సుమారు 10 లక్షల మందికి అందాల్సిన సాయం ఆగిపోయింది. ప్రతి కుటుంబానికి ఆహారం అందించే రైతులు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తేల్చడంలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే ఉన్నాయి. ఒక ఏడాది సాగు చేసిన రైతు రెండో ఏడాది సాగు చేయకపోవచ్చు. అయినా వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాల్సిన అవసరం ఉంది.


బత్తాయి తోటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ కార్యదర్శి ఢిల్లీరావు

కౌలు రైతుల సమస్యలు

కౌలు రైతులు రాష్ట్రంలోని ప్రధాన పంటలు (ప్రధానంగా వరి) సాగు చేస్తున్నప్పటికీ, వారి పరిస్థితి దారుణం. 50 శాతం కంటే ఎక్కువ మంది వరి సాగుదారులు కౌలు రైతులే. వారు భూమి యజమానులకు అధిక కౌలు చెల్లించాలి. కానీ పంటలు పాడవడం, ధరలు తక్కువగా రావడం వంటి సమస్యలతో నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యల్లో 80శాతం మంది కౌలు రైతులే. ఎందుకంటే వారికి బ్యాంకు రుణాలు, సబ్సిడీలు అందడం లేదు. 2025లో కూడా ఖరీఫ్ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు దాటింది. కౌలు ఎలా చెల్లించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం ప్రధాన సమస్య. కౌలు రైతులకు భూమి యాజమాన్యం గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. 10 శాతం మంది మాత్రమే బ్యాంకు రుణాలు పొందుతున్నారు. మిగిలినవారు అధిక వడ్డీలతో ప్రైవేటు రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు (KCC), జాయింట్ లయబిలిటీ గ్రూపులు (JLG) వంటి స్కీములు ఉన్నప్పటికీ, అవి అనుకున్న మేరకు అమలు కావడం లేదు. భూమి యజమానులు భయపడి లీజ్ ఒప్పందాలు రాయడానికి ముందుకు రావటం లేదు. దీంతో రైతులు గుర్తింపు కోల్పోతున్నారు. ఫలితంగా వారు అధిక వడ్డీలు (సగటున రూ.1.53 లక్షల అప్పు) చెల్లించాల్సి వస్తోంది. యజమాని రైతులతో పోలిస్తే (రూ.1.87 లక్షలు) తక్కువ ఆదాయం వారిది.

ప్రభుత్వం చర్యలు, వైఫల్యాలు

ప్రభుత్వం క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు (CCRC) లేదా కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేయాలి. ఇవి రుణాలు, బీమా, సబ్సిడీలకు అర్హత ఇస్తాయి. 2019-2024 మధ్య నాటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 25.94 లక్షల కార్డులు ఇచ్చింది. దీంతో రూ.8,345 కోట్ల రుణాలు అందాయి. అయితే 2025లో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన కార్డులు చాలా తక్కువ. శ్రీకాకుళంలో 223, పార్వతీపురం మన్యంలో 300, విజయనగరంలో 73 మాత్రమే. మొత్తంగా ఇప్పటి వరకు సుమారు 6 లక్షల కార్డులు ఇచ్చినప్పటికీ, చాలా మంది రైతులు (ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో) కార్డులు లేకుండా ఉన్నారు. దీంతో అక్కడక్కడ ఆందోళనలు చేస్తున్నారు. క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ 2019 ఉన్నప్పటికీ, అమలు బలహీనంగా ఉంది. భూమి యజమానులు ఒప్పందాలు రాయడానికి ముందుకు రావడం లేదు.


ఈ చట్టాలు ఏమయ్యాయి?

2011లో కేంద్ర ప్రభుత్వం కౌలు రైతుల కోసం భూ అధీకృత సాగు దారుల లైసెన్స్ యాక్ట్ ను తీసుకొచ్చింది. ఈ చట్టం రాష్ట్రాల్లో వారికి ఇష్టమైతే అమలు చేయవచ్చని, లేకుంటే వదిలేయ వచ్చని కేంద్రం చెప్పింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ చట్టాన్ని అమలు చేశారు. ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం పక్కన బెట్టింది. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసి భూమి యజమానికి మరింత భరోసా ఇస్తూ క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు (CCRC) వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ కార్డులు రుణాలు తీసుకునేందుకు పనికి రావడం లేదు.

రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదు?

2024 జూన్ లో రిజర్వ్ బ్యాంకు వారు నిర్వహించిన సమావేశంలో కౌలు రైతుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో కౌలు రైతుల కోసం పలు తీర్మానాలు చేశారు. కౌలు రైతులకు ఇస్తున్న రుణాన్ని రూ. 1.65 లక్షల నుంచి రెండు లక్షలకు పెంచారు. ఎటువంటి హామీ లేకుండా ఈ రుణం అందించేందుకు తీర్మానించారు. అయితే బ్యాంకులు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి సమావేశాల్లో రిజర్వు బ్యంకు ఉత్తర్వులను పక్కన బెట్టి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ (ఎస్ ఓ పీ) ఏ భూమిపై అయితే కౌలు రైతుకు అప్పు ఇవ్వాలనుకుంటున్నారో ఆ భూమి కౌలుకు ఇచ్చిన భూ యజమాని క్రాప్ లోన్ తీసుకొని ఉండకూడదని నిర్ణయించారు. భూ యజమాని బ్యాంకుకు బకాయి ఉండకూడదు అనేది మరో నిబంధన. 4 శాతం వడ్డీకి బ్యాంకు రుణం ఇస్తున్నప్పుడు సహకార బ్యాంకుల్లో అప్పు తీసుకోని రైతు ఉండే అవకాశం లేదు. అందువల్ల కౌలు రైతుకు రుణం ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. బ్యాంకర్ల కమిటీ వారు చేసిన ఈ నిర్ణయాలు ఆపివేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.


అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం ఎప్పుడిస్తారు?

ఏపీలో కౌలు రైతులకు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయం 46 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చింది. సుమారు 32 లక్షల మందిగా ఉన్న కౌలు రైతులకు అక్టోబర్ లో ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అప్పటికైనా కౌలు రైతులు ఎంత మంది ఉన్నారని తేలుస్తారా? తేల్చలేరా? అనేది సందిగ్ధంగా వుంది.

రుణాల కుంభకోణం

కౌలు రైతులకు రుణాలు ఇస్తున్నమని చెబుతున్న బ్యాంకులు కుంభకోణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల్లో 4 శాతం వడ్డీకి క్రాప్ రుణాలు పొందేందుకు అధికారులు, భూమి యజమానులు కుమ్మక్కయి రుణాల కుంభ కోణానికి పాల్పడుతున్నారు. ఒక రైతుకు పది చోట్ల పదెకరాలు పొలం ఉందని భావిస్తే అందులో ప్రతి ఎకరాకు వేరు వేరుగా సర్వే నెంబర్లు ఉంటాయి. ఈ సర్వే నెంబర్ల ఆధారంగా బినామీలను తయారు చేసుకుని వారి పేర్లతో భూమి యజమాని కౌలు అగ్రిమెంట్లు రాసి ఇస్తారు. దీంతో బ్యాంకుల వారు కౌలు అగ్రిమెంట్లు ఉన్న వారికి తక్కువ వడ్డీకి క్రాప్ లోన్స్ ఇస్తోంది. ఈ రుణం పూర్తిగా భూమి యజమానే వాడుకుంటాడు. ఆ తరువాత తిరిగి బ్యాంకుల వారీకి కడుతున్నారు.

భూమి యజమాని ఒకరు సర్వే నెంబర్ల వారీగా కౌలు రైతులకు రాసి ఇచ్చినట్లు చూపించడం వల్ల కృష్ణా జిల్లా గుంటుపల్లిలోని ఒక రైతు బినామీ పేర్లతో ఏకంగా 64 కౌలు రైతుల కార్డులు పొందారు. మరో రైతు కూడా 25 కార్డులు పొందారు. ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తుందని కౌలు రైతుల సంఘం నాయకుడు జమలయ్య తెలిపారు. ఉదాహరణకు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని గొడవర్రు గ్రామానికి చెందిన నాగభైరవ బాలమ్మ కు చెందిన భూమిని తన ఇంట్లో వ్యవసాయ పనులు చేసే జనార్థన్ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చినట్లు కౌలు రైతు కార్డు సంపాదించారు. భూమిని కౌలుకు తీసుకుని చేస్తున్నది మాత్రం బాయమ్మ అనే మహిళా రైతు. ఈ విధంగా కౌలు రౌతులను కూడా బినామీలను ఏర్పాటు చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పొందే వారు ఉన్నారన్నారని జమలయ్య పేర్కొన్నారు. ఈ బాలమ్మ ఎవరో కాదని లోక్ సత్తా పార్టీ అధినేత ఎన్ జయప్రకాష్ నారాయణ తల్లి అని చెప్పారు.

రాధాకృష్ణ కమిషన్ సిఫార్స్ లు ఎందుకు అమలు చేయడటం లేదు?

2015లో కౌలు రైతులపై అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ ను అప్పటి కూటమి ప్రభుత్వం నియమించింది. రాధాకృష్ణ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి కౌలు రైతులు సుమారు 32 లక్షల మంది ఉన్నారని, ఇందులో 12 లక్షల మంది పూర్తిగా భూమిని తీసుకుని కౌలుకు చేస్తున్నారని, కేవలం దళితులు 6లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, కొంతవరకు సొంత భూమి ఉండి, మరికొంత కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న మిక్చర్ రైతులు 18 లక్షల మంది వరకు ఉన్నట్లు నివేదికలో రాధాకృష్ణ కమిషన్ స్పష్టం చేసింది. ఈ నివేదికను 2016లో అప్పటి కూటమి ప్రభుత్వానికి అందించింది. ఇప్పటి వరకు ఈ డేటా ప్రభుత్వం వద్ద లేదు. ప్రతి సంవత్సరం 3.50 లక్షల మందికి కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది.

బడాబాబుల చేతుల్లోకి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా రైతుల పొలాలు

గతంతో పోలిస్తే పేద, మధ్యతరగతి రైతుల వద్ద వారి పొలాలు లేవు. ఈ రెండు జిల్లాలోని ఆస్పత్రుల యజమానుల చేతుల్లోకి వెళ్లినట్లు ఒక సర్వే స్పష్టం చేసింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాలో ఆస్పత్రులు నిర్వహించే వారు ఎక్కువగా భూములు కొనుగోలు చేశారు. కౌలుకు ఇచ్చినట్లు తమ బినామీల పేర్లు రాసి బ్యాంకు రుణాలు పొంది సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ భూ స్వామి, ఆయన భూమి కౌలుకు ఇచ్చినట్లు రికార్డులు ఉంటాయి. భూమిలో వ్యవసాయం చేసే వారు ఒకరైతే, కౌలు దారుడు మరొకరు ఉంటారు. ఇక ఆస్పత్రులు పలానా అని చెప్పేందుకు వీలు లేదు. ప్రస్తుతం కౌలు రైతుల చేతుల్లో ఉన్న భూములన్నీ దాదాపు ఆస్పత్రుల యజమానులకు చెందినవే కావడం విశేషం.

రైతు సంఘాల నాయకుల విమర్శలు

రైతు సంఘాల నాయకులు ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టెనెంట్ ఫార్మర్స్ అసోసియేషన్ (APTFA) నాయకులు, పెండింగ్ రబీ డ్యూస్ (రూ. 1000 కోట్లు) వెంటనే చెల్లించాలని, ID కార్డులు, రుణాలు, ఇన్వెస్ట్‌మెంట్ సపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జూన్ 9, 2025న ప్రోటెస్టులు నిర్వహించారు. కార్డులు లేకుండా రైతులు రుణాలు పొందలేకపోతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కౌలు రైతులను విస్మరించిందని, 32 లక్షల మంది ఇబ్బందుల్లో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం రుణాలు ఇవ్వడంలో విఫలమైందని, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. X ప్లాట్‌ఫామ్‌లో కూడా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు V V లక్ష్మీనారాయణ (JD) చిత్తూరు మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. MSP లేకుండా పంటలు చేతికొచ్చిన తరువాత పనికి రాకుండా పోతున్నాయని విమర్శించారు.

వ్యవసాయం సంక్షోభంలోకి వెళుతోంది: వైఎస్సార్సీపీ రైతు సంఘం నాయకులు ఎంవీఎస్ నాగిరెడ్డి

ప్రస్తుతం గ్రామాల్లోనే వ్యవసాయం సాగుతోంది. పట్టణాల్లోని వారు పూర్తిగా వ్యవసాయం మానేశారని వైఎస్సార్సీసీ రైతు సంఘం అధ్యక్షులు ఎవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడారు. గ్రామాల్లో కూడా తమ పిల్లలను తల్లిదండ్రులు చదివించుకుంటూ వ్యవసాయం వైపు వారు కన్నెత్తి చూడకుండా పిల్లలను చేస్తున్నారని, దాంతో గతానికి ఇప్పటికి సగానికి సగం మంది వ్యవసాయం మానేశారన్నారు. పట్టణాల్లో గ్రామాల వారు చాలా మంది వచ్చి స్థిరపడుతున్నారని, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఉన్నాయన్నారు.

కౌలు రైతుల విషయానికి వస్తే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కౌలు రైతుల (tenant farmers)కు 5లక్షల వరకు కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు చెప్పారు. ఇది రైతుకు, కౌలుకు పొలం చేసుకున్న వారికి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ను బట్టి రాసుకున్న ఒప్పందం మేరకు కార్డులు ఇచ్చినట్లు చెప్పారు. ఒప్పందం లేకుండా పొలాలు కౌలుకు చేస్తున్న వారిని గుర్తించి క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు (CCRC) సుమారు 26 లక్షల మందికి ఇచ్చినట్లు చెప్పారు.

బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడానికి కారణాలు ఉన్నాయన్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్నా ఆ ఏడాది కౌలు రైతుకు లాభాలు వస్తే బాగానే ఉంటుంది. ఒక వేల లాభాలు రాకుంటే బ్యాంకులకు తిరిగి రుణం చెల్లించే అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల బ్యాంకులు ముందుకు రావడం లేదన్నారు. కౌలు అనేది ఏడాది కాలానికి రాసుకునే అగ్రిమెంట్ మాత్రమేనని చెప్పారు. గతంలో ఏర్పాటు చేసిన రైతు మిత్ర గ్రూపులకు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, అందులోనూ ఒకరికి ఒకరు షూరిటీలు పెట్టుకోవడం ద్వారా రుణాలు పొందుతున్నట్లు చెప్పారు. ఈ రుణానికి బ్యాంకులు 11 శాతం వడ్డీ తీసుకుంటుందన్నారు. నిజానాకి కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఉంటే క్రాప్ లోన్ బ్యాంకు వారు ఇవ్వాలి. అలా ఇస్తే 4 శాతం వడ్డీతో సరిపోతుంది. అలా కాకుండా గ్రూపులకు రుణాలు ఇచ్చి 11 శాతం వడ్డీ తీసుకోవడం వల్ల కౌలు రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లకుండా ఉండాలంటే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు (CCRC) ఉన్న వారందరికీ 4 శాతం వడ్డీకి రుణాలు బ్యాంకులు ఇవ్వాలని ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

కౌలు రైతులకు (tenant farmers) గుర్తింపు కార్డులు ఇవ్వాలి: కేవీవీ ప్రసాద్

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లిబరల్ గా ఇవ్వడం ద్వారా వారు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అర్హులు అవుతారని, క్రాప్ లోన్స్ తీసుకునేందుకు వారికి అర్హత వస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అన్నారు. ఆయన ది ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ కౌలు రైతులకు భూమి యజమానులు అగ్రిమెంట్ లు ఇవ్వకపోవడానికి కారణాలు ఏమైనా భూమిపై ఆ సంవత్సరం ఎవరు ఉన్నారు. వాళ్లు ఎంత మొత్తం కౌలుకు భూమిని తీసుకున్నారనే వివరాలు వ్యవసాయ శాఖ వారు స్థానికంగా సర్వేచేసి వారికి ప్రభుత్వం కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత ప్రభుత్వం ఆ విధంగానే 26 లక్షల మందికి కార్డులు ఇచ్చిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 6 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోకుంటే కౌలు రైతుల కుటుంబాలు దీన స్థితికి వెళతాయన్నారు.

వడ్డీ వ్యాపారులపై ఆధార పడుతున్న కౌలు రైతులు: ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి జమలయ్య

మారిన వ్యవసాయ పరిస్థితులలో మన రాష్ట్రంలో సాగు భూమిలో 70 నుంచి 80 శాతం కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు. అన్ని పంటల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ కౌలు రైతులే గణనీయమైన సంఖ్యలో సేద్యం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య అన్నారు. ఆయన ది ఫెడలర్ ప్రతినిధితో మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, బ్యాంకు శాఖల సహాయ సహకారాలు భూ యజమానులే ఇంకా వ్యవసాయం చేస్తున్నట్టుగా భావించి వారికే పథకాలు అందే విధంగా రూపకల్పన చేయటం బాధాకరం. ప్రస్తుతం వ్యవసాయరంగంలో చోటు చేసుకున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ప్రణాళికలు రూపొందించడం శోచనీయమన్నారు.

రాష్ట్రంలో పంటలు పండిస్తున్న కౌలు రైతులకు పంట రుణాలు, పంటల బీమా, ఇన్పుట్‌ సబ్సిడీలు, పంటలు అమ్ముకునే వెసులుబాటు, సాగు సాయం లాంటి పథకాలు అందటం లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడే పంటలు పండిస్తున్నారు. ప్రతి ఏడాది కౌలు రేట్లతో పాటు సాగు ఖర్చులు పెరిగి ప్రభుత్వ మద్దతు దక్కకపోగా ఆదాయాలు పడి పోయి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి నెట్టివేయబడుతున్నారని జమలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి స్థితిలో సాగుకి అత్యంత కీలకమైన పెట్టుబడి అంటే పంట రుణాలు అందించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, కానీ మాటల్లో మాత్రం కౌలు రైతులను ఉదారంగా ఆదుకోవాలని చెబుతూ ఆచరణలో మాత్రం కౌలు రైతులకు ఎటువంటి సహాయ, సహకారాలు అందించకుండా విస్మరించడం చాలా అన్యాయమని పేర్కొన్నారు.

సమస్యల మూలాలు

రాజకీయ నాయకులు పట్టించుకోక పోవడం. ఉన్నతాధికారు ఆలస్యాలు, భూమి యజమానుల భయాల వల్ల కౌలు రైతుల్లో సమస్యలు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వం 26 లక్షల కార్డులు ఇచ్చినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఇచ్చినవి తక్కువ. దీంతో రైతులు అసంతృప్తి చెందుతున్నారు. రాజకీయంగా, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అమలు చేయకపోవడం సాధారణంగా మారింది. రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ‘యాంటి ఫార్మర్’ అని విమర్శిస్తున్నాయి. ఇది వ్యవసాయ సంక్షోభాన్ని పెంచుతోంది. ఆత్మహత్యలు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం రాతపూర్వక లీజ్ ఒప్పందాలను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. కార్డుల ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలి. లేకపోతే రైతు సంఘాల ప్రోటెస్టులు మరింత తీవ్రమవుతాయి. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతుంది.

మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులు గుర్తింపు, ఆర్థిక సహాయం లేకుండా సతమతమవుతున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News