నేనొస్తున్నా అని చెప్పండి..!

రాయలసీమలో పార్టీ ప్రక్షాళనపై వైసీపీ దృష్టి నిలిపింది. అంతరంగీకులకే ఆ పార్టీ అధ్యక్షుడు జిల్లా సారధ్య బాధ్యతలు అప్పగించారు. మాట వినని నేతలపై బహిష్కరణ వేటు వేశారు.

Update: 2024-09-13 15:43 GMT

అధికారం కోల్పోయిన తరువాత నిస్తేజంగా మారిన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పడానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ ఫోకస్ పెట్టారు. ఇందుకోసం రాయలసీమ ప్రాంతం నుంచే శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా చిత్తూరు జిల్లా మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన తాడేపల్లి కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో నగరిలో వ్యతిరేకంగా పనిచేసిన ఇద్దరు నేతలపై శుక్రవారం బహిష్కరణ వేటు వేశారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాజీ మంత్రులకే అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్టోబర్ లో జిల్లాల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.



2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 సీట్లు టీడీపీ కూటమి అభ్యర్థులే దక్కించుకుని వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టారు. మిగతా రెండు స్థానాల్లో పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి విజయం సాధించారు. ఈ రెండు నియోజకవర్గాలు అంతర్భాగంగా ఉన్న రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా,
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి సీఎం ఎన్. చంద్రబాబునాయుడు సారధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీడీపీకి గండి కొట్టాలని వైసీపీ అధికారంలో ఉండగా, ఎన్నో ఎత్తులు వేసింది. మార్పు కోరుకున్న ప్రజలు వైసీపీకి 2019 ఎన్నికల్లో ఇచ్చిన 13 అసెంబ్లీ స్థానాలను టీడీపీ ఖాతాలో వేయడానికి ఓట్ల వర్షం కురిపించారు. దీంతో వైసీపీ, ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యానికి కూడా అడ్డుకట్ట పడింది.
ఆ తరువాత ఏమైంది...
అధికారం కోల్పోయిన తరువాత పుంగనూరు నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరిలోకి పాదం మోపలేని స్థితిలో ఉన్నారు. ఇది వైసీపీకి ఛాలెంజ్ గా మారింది. అనేకసార్లు పెద్దిరెడ్డి పుంగనూరుకు వెళ్లాలని ప్రయత్నం చేసిన ప్రతిసారీ తిరుగుబాటు అనివార్యమైంది. దీంతో వైసీపీ అధినేత వైఎస్. జగన్ కూడా పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి సారించకుండా, తాడేపల్లి, పులివెందుల, బెంగళూరు నివాసాలకు పరిమితమయ్యారు. మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి. ఈ వ్యవహారం కాస్తా నాయకుల పరిస్థితి అగమ్యగోచరకంగా మారింది. రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బహిరంగంగా రాలేని స్థితి ఏర్పడింది. దీనివల్ల పార్టీ శ్రేణులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.

ఆంతరంగికులకే పదవులు
అధికారం కోల్పోయిన మూడు నెలల తరువాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ పార్టీ పరిపుష్టిపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అందులో ప్రధానంగా పార్టీ పదవులు కూడా తనకు ఆంతరంగికులైన వారికే జిల్లాల సారధ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కనిపిస్తోంది. గత నెలలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), మాజీ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), వేంపల్లి సతీష్ రెడ్డికి పదవులు కట్టబెట్టారు.

తాజాగా అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడింది. అయితే, అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని నియమించారు. కర్నూలు జిల్లాకు మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ. మోహన్ రెడ్డిని నియమించారు. నంద్యాల జిల్లాకు మాత్రం కాటసాని రాంభూపాల్ రెడ్డిని కొనసాగిస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డిని నియమించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షత బాధ్యతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, నెల్లూరుకు మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మినహా, అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఈ మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.

మార్పు ఎందుకు?
చిత్తూరు జిల్లాకు ఎంఎల్సీ భరత్ అధ్యక్షుడిగా సారధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసి, సీఎం ఎన్. చంద్రబాబు చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఆయన హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యారు. కుప్పంలో వైసీపీ కార్యాలయాన్ని కూడా మూతవేసిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షత బాధ్యతలు నిర్వహిస్తున్న భరత్ స్వీయ నిర్ణయాలు తీసుకునే సాహసం చేయలేరనేది ఆ పార్టీ వర్గాల టాక్. ప్రతి విషయం మాజీ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే సాగుతుందనేది బహిరంగ రహస్యం. దీంతో చిత్తూరు జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న పెద్దిరెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించడానికి అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

నేనొస్తానని చెప్పండి..


చిత్తూరు జిల్లా నేతలతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశమైన వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ పార్టీ క్యాడర్ స్థితిపై వాకబు చేశారని సమాచారం. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే. రోజా, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. రెడ్డెప్ప, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎంఎల్సీ సిపాయి సుబ్రమణ్యం, డిప్యూటీ మాజీ సీఎం కే. నారాయణస్వామి, గత ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన కుమార్తె కృపారాణితో పాటు మిగతా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి, ఓటమి చెందిన నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కూడా హాజరయ్యారు.
టీడీపీ కూటమి వల్ల ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఇబ్బందిగా ఉంది? కేసులకు గురైన వారి పరిస్థితి ఏమిటీ? వారికి అండగా నిలుస్తున్నారా? లేదా? అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
"ఏం పరవాలేదు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం. ధైర్యంగా ఉండమనండి" నేను జిల్లాలకు వస్తానని వైఎస్. జగన్ పార్టీ నాయకుల ద్వారా క్యాడర్ కు సందేశం పంపినట్లు తెలుస్తున్నది. జిల్లాలో పార్టీ క్యాడర్ కు భరోసా ఇవ్వండని వైఎస్. జగన్ పార్టీ నేతలకు గట్టిగా సూచనలు చేశారని సమాచారం.

ఇద్దరు నేతలపై వేటు


2024 సార్వత్రిక ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఆర్కే. రోజా ఓటమి చెందారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రధాన నేతలు టీడీపీలోకి వెళ్లారు. వారంతా మూకుమ్మడిగా,
" రోజా మినహా, స్థానికుల్లో ఎవరో ఒకరికి సీటు ఇవ్వండి" అని గట్టిపట్టు పట్టారు. దీనిని ఖాతరు చేయని వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ నగరి నుంచి ఆర్కే. రోజాకే అవకాశం కల్పించారు. దీంతో ఆమెకు పార్టీ నాయకులు సహాయ నిరాకరణ చేశారు. ఎన్నికలు ముగిసిన మూడు నెలల తరువాత తాజాగా శుక్రవారం నగరి నియోజకవర్గంలో కీలకమూన నేతల్లో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, రాష్ట ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ కేజీ. శాంతి, ఆమె భర్త వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజే. కుమార్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ మేరకు వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కేఆర్జే. భరత్ ప్రకటన విడుల చేశారు.
Tags:    

Similar News