ఫ్యామిలీ సర్వేలో చుక్కలు కనబడుతున్నాయా ?

ఇంటి వివరాల కోసం యజమానులతో మాట్లాడిన సర్వే బృందాలకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది.

Update: 2024-11-10 06:16 GMT

ఫ్యామిలి సర్వే చేస్తున్న సిబ్బందికి జనాలు చుక్కలు చూపిస్తున్నారు. ఈనెల 6వ తేదీనుండి తెలంగాణా వ్యాప్తంగా ప్రభుత్వం సుమారు 90 వేలమంది సిబ్బందిని ఫ్యామిలీ సర్వే(Telangana Family Survey) కోసం రంగంలోకి దింపింది. సర్వేకి ముందు సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లోవాళ్ళతో మాట్లాడి ఇంటికి స్టిక్కర్ అంటించాలి. స్టిక్కరింగ్ ఆధారంగా తాము తిరిగిన ఇళ్ళను కోడింగ్ ద్వారా ఆ తర్వాత వేరే సిబ్బంది వచ్చి యజమానులతో మాట్లాడి ఇంట్లోని సభ్యుల వివరాలు అన్నీ తెలుసుకుని నోట్ చేసుకుంటారు. ఇందుకోసం ప్రభుత్వం రెండు రకాల ఫామ్ లతో 75 ప్రశ్నలను రెడీచేసి సిబ్బందికి అందించింది. స్టిక్కరింగ్ కూడా నూరుశాతం ఇళ్ళకు పూర్తికాలేదు. కొన్నిచోట్ల అయ్యింది మరికొన్ని ఇళ్ళకు స్టిక్కరింగ్ కాలేదు. అయినా సరే సర్వే బృందాలు 6వ తేదీనుండి ఇంటింటి సర్వే పేరుతో రంగంలోకి దిగేశాయి.

ఇక్కడే సర్వే బృందాలకు చుక్కలు కనబడుతున్నాయి. ఇంటి వివరాల కోసం యజమానులతో మాట్లాడిన సర్వే బృందాలకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఏ రూపంలో అంటే సర్వే బృందం అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పటానికి చాలామంది యజమానాలు ఇష్టపడటంలేదు. ఇంట్లో సభ్యుల సంఖ్య, పెద్దవాళ్ళు ఏమి చేస్తున్నారు ? పిల్లలు ఏమి చదువుతున్నారు ? అందుకుంటున్న ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డు వివరాల వరకు సమాధానాలు ఇస్తున్నారు. ఆ తర్వాత అడుగుతున్న ప్రశ్నలకే యజమానులు సమాధానాలు ఇవ్వటానికి ఇష్టపడటంలేదు. సర్వే బృందాలు ఇవే ప్రశ్నలను పదేపదే అడగటంతో ఇళ్ళల్లోని వాళ్ళు సమాధానాలు ఇచ్చేదిలేదని అడ్డంతిరుగుతున్నారు.

ఇంతకీ ఇళ్ళ యజమానాలను ఇబ్బందులు పెడుతున్న ప్రశ్నలు ఏమిటి ? ఏమిటంటే ఇంట్లోని వాళ్ళ ఉద్యోగాలు, జీతాలు, వార్షిక ఆదాయాలు, కడుతున్న ఆదాయపు పన్నులు, బ్యాంకు ఖాతాలు, ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలున్నాయి ? ఎవరెవరికి ఏ బ్యాంకులో ఖాతాలున్నాయి ? ఆధార్ కార్డు నెంబర్, ప్యాన్ నెంబర్, యజమానికి ఉన్న ఆస్తులు, అప్పులు, ఆస్తులుంటే ఏ రూపంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ? వాటి ప్రస్తుత విలువెంత ? ఆస్తులు కొనుగోలు చేస్తే ఎక్కడ కొనుగోలు చేశారు ? ఆస్తులు కొనేందుకు డబ్బులు ఎక్కడినుండి వచ్చాయి ? లాంటి అనేక ప్రశ్నలున్నాయి. నిజానికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి ఎవరు కూడా ఇష్టపడరు. తమ వ్యక్తిగత ఆస్తులు, అప్పుల వివరాలు, సంపాదన, కడుతున్న ఆదాయపు పన్ను వివరాలను తమ తోబుట్టువులు, దగ్గరి బంధువులతో పంచుకోవటానికి కూడా చాలామంది ఇష్టపడరని అందరికీ తెలిసిందే.

ఇంత గోప్యంగా ఉంచుకునే వివరాలను ప్రభుత్వం సర్వే పేరుతో అడిగితే ఎంతమంది ఇస్తారు ? పైగా ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమపథకాలు అందుకోని మధ్య, ఎగువమధ్య తరగతి జనాలు పై ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పాలని సర్వే బృందాలను ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇంటి యజమాని అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పాల్సిన, వివరణలు ఇవ్వాల్సిన బాధ్యత సర్వే బృందాలపైన ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Dy Chief Minister) (Bhatti Vikramarka) ఏసీ ఛాంబర్లో కూర్చుని మాట్లాడుతున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో ఇళ్ళ యజమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, వివరణలు ఇవ్వలేక సర్వే బృందాలు బాగా ఇబ్బందులు పడుతున్నాయి. ఉదాహరణకు ఒక ఇంటి యజమాని తమకు గృహలక్ష్మి, 200 యూనిట్ల విద్యుత్ లబ్ది ఇంతవరకు దొరకలేదని చెప్పి ఎప్పుడు అందుతుందని అడిగితే సర్వే బృందం సమాధానం చెప్పలేక దిక్కులు చూసింది.

పలనా పథకం తమకు ఎప్పటినుండి వస్తుంది ? తమకు రైతు రుణమాఫీ లబ్ది(Farmer Loan Waiver) అందలేదు ఇప్పిస్తారా ? అని గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలు అడుగుతుంటే సర్వే బృందాలు సమాధానాలు చెప్పలేకపోతున్నాయి. నిజామాబాద్ డిచ్ పల్లి, సత్తుపల్లిలో సర్వే బృందాలు ఇళ్ళకు వెళ్ళినపుడు సంక్షేమపథకాలు తమకు ఎప్పుడు అందుతాయో చెప్పమని ఇళ్ళల్లోని వాళ్ళు నిలదీయటంతో సమాధానం చెప్పలేక బయటకు వచ్చేశారు. ఇదే విషయాన్ని ఖమ్మం(Khammam) జిల్లా, వైరాలో ఎన్యుమరేటర్ గా పనిచేస్తున్న వేలిశెట్టి నరసింహారావు మాట్లాడుతు తమ ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు చెప్పటానికి యజమానాలు ఇష్టపడటంలేదన్నారు. ముఖ్యంగా ఆస్తులు, అప్పుటు, బ్యాంకులకు సంబందించిన వివరాలు చెప్పటానికి అంగీకరించటంలేదన్నారు. హైదరాబాద్(Hyderabad), బంజారాహిల్స్(Banjara Hills) లోని అరోరా కాలనీలో ఒక అపార్టమెంటుకు సర్వేకోసం వెళ్ళిన టీచర్లపై ఒక ఇంటి యజమాని కుక్కలను వదిలిపెట్టాడు. అపార్టుమెంటులోని ఒక యజమానికి ఇంటకి టీచర్లు అపురూప, రమ్యశ్రీ వెళ్ళారు. ముందు యజమాని వీళ్ళతో మర్యాదగానే సమాధానాలు చెప్పాడు.

ఎప్పుడైతే టీచర్లు ఆస్తులు, అప్పులు, బ్యాంకుల వివరాలపై ప్రశ్నలు అడిగారో వెంటనే యజమానికి మండిది. టీచర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనని యజమాని చెప్పాడు. అయినా సరే టీచర్లు వదలకుండా ఫామ్ నింపాల్సిన బాధ్యత తమపైన ఉందని కాబట్టి సమాధానాలు చెప్పాలని అడిగారు. దాంతో మండిపోయిన సదరు యజమాని టీచర్లపైకి కుక్కను ఉసిగొల్పాడు. దాంతో భయపడిన టీచర్లు ఇద్దరు బతుకుజీవుడా అనుకుని అపార్టుమెంటు నుండి బయటకు పరిగెత్తారు. సర్వే బృందాలు అడుగుతున్న ప్రశ్నల్లో చాలామంది సమాధానాలు చెప్పటానికి ఇష్టపడటంలేదు. బృందాలు గనుక గట్టిగా ఒత్తిడి తెస్తే కుక్కలను వదలటంలేదు కాని దాదాపు అంతపనీ చేస్తున్నారు. అందుకనే సర్వేల్లో బృందాలకు చుక్కలు కనబడుతున్నాయి. ఇవంతా సర్వే మొదలైన మూడురోజులకే. ఈనెలాఖరువరకు సర్వే జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. ముందు ముందు ఇంకెన్ని గొడవలవుతాయో అని సర్వే బృందాలు తలలు పట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News