హెలికాప్టర్లో దుమ్మురేపుతున్న పార్టీలు

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో రేవంత్ రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

Update: 2024-05-06 07:52 GMT

అధికారంలో ఉన్నపార్టీకి డబ్బుకు లోటేముంటుంది ? అందుకనే ఎన్నికల ప్రచారంలో రోడ్డుమీద వెళ్ళటం కన్నా గాలిలో ప్రయాణంచేయటంపైనే ఎక్కువ ఇష్టపడుతుంది. ఇపుడు రేవంత్ రెడ్డి వ్యవహారం అలాగే ఉంది. రేవంత్ తో పాటు బీజేపీ కూడా అదే ఫాలో అవుతోంది. విషయం ఏమిటంటే ఎన్నికల ప్రచారంలో ఒకేరోజు మూడు, నాలుగు చోట్ల బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల్లో పాల్గొనాలంటే గాలిలో ప్రయాణంచేయటం ఒకటే మార్గం. అందుకనే హెలికాప్టర్లను అద్దెకు తీసేసుకుంటున్నాయి పార్టీలు. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో రేవంత్ రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రోడ్డుమీద వెళితే గంటల పాటు సమయం వేస్టయిపోతుంది. అందుకని హెలికాప్టర్లోనే తిరిగేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గరనుండి రేవంత్ రోడ్డుమీద ప్రయాణంచేసిందానికన్నా హెలికాప్టర్లో తిరిగిందే చాలా ఎక్కువ. అధికారంలో ఉన్న పదేళ్ళు కేసీయార్ చేసింది కూడా ఇదే. ఏ నియోజకవర్గంలో పర్యటించాలన్నా కేసీయార్ ఎక్కువగా హెలికాప్టర్నే ఉపయోగించేవారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీయార్ పార్టీ కోసమని ప్రత్యేకంగా ఒక విమానమే కొనబోతున్నట్లు జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే ఏమైందో ఏమగాని ప్రత్యేకవిమానం కొనుగోలు చేయలేదు కాని హెలికాప్టర్లో మాత్రం విపరీతంగా తిరిగారు. ఇపుడు రేవంత్ అంతకుమించి తిరుగుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి పెద్దగా హెలికాప్టర్ ను ఉపయోగించటంలేదు. నరేంద్రమోడి, అమిత్ షా తెలంగాణా పర్యటనకు వచ్చినపుడు మాత్రమే వాళ్ళతో హెలికాప్టర్లో వెళుతున్నారు. నిజానికి కిషన్ గ్రేటర్ హైదరాబాద్ వదిలి బయట నియోజకవర్గాల్లో చేసిన ప్రచారం కూడా తక్కువే.

 

ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా రేవంత్ కోసమే ఒకటుంది. బయటనుండే వచ్చే రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళకోసం మిగిలిన రెండింటిని ఉపయోగిస్తున్నారు. అలాగే బీజేపీ రెండు హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. ఢిల్లీ, ముంబాయ్, బెంగుళూరుకు చెందిన సంస్ధలు హెలికాప్టర్లను గంటల లెక్కన అద్దెకు ఇస్తున్నాయి. మోడల్ ను బట్టి సంస్ధలు గంటకు రు. 4-6 లక్షలు అద్దె వసూలు చేస్తున్నాయి. కర్నాటకతో పాటు 11 రాష్ట్రాల్లో ఆదివారం నాడు పోలింగ్ ముగిసింది. కాబట్టి వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ప్రముఖులు ప్రచారంకోసం తెలంగాణాలో పర్యటించబోతున్నారు. ఇందుకని రెండుపార్టీలు ముందుగానే మరో 4 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నాయి.

ప్రచారం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీలుపడి హెలికాప్టర్లను ఉపయోగిస్తుంటే బీఆర్ఎస్ అధినేత మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా హెలికాప్టర్ ను ఉపయోగించలేదు. కేసీయార్ వ్యూహం ప్రకారం బస్సుయాత్రకే ప్రాధాన్యతిస్తున్నారు. ఛాపర్ ప్రయాణం ప్రధానంగా వాతావరణం మీద ఆధారపడుంది. మంచు ఎక్కువగా కురుస్తున్నా, వర్షాలు పడుతున్నా హెలికాప్టర్లో ప్రయాణం సాధ్యంకాదు. మోడల్ ను బట్టి గంటకు సగటున 250 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణంచేస్తాయి. డబల్ ఇంజన్ కెపాసిటి ఉండే హెలికాప్టర్లకు గంట ప్రయాణానికి 310 లీటర్ల ఇంధనం అవసరం. అలాగే సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ కు గంట ప్రయాణానికి 150 లీటర్ల ఇంధనం కావాలి.

 

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క హెలికాప్టర్ను మాత్రమే వాడిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు మూడింటిని వాడుతోంది. అగస్త్య-169, అగస్త్య -109, బెల్-429 వెరైటిలను ఉపయోగిస్తోంది. అగ్రనేతలు రాహుల్, ప్రియాంకకు బెల్-429 హెలికాప్టర్ను కేటాయించారు. ఇక బీజేపీ విషయానికి వస్తే నరేంద్రమోడి, అమిత్ షా తెలంగాణా పర్యటనల్లో ప్రత్యేక హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. రాబోయే ఐదురోజుల్లో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు తెలంగాణా ప్రచారం చేయటంకోసం కమలంపార్టీ అదనంగా మరో రెండు హెలికాప్టర్లను రప్పించబోతోంది. మొత్తంమీద ఎన్నికల ప్రచారం పేరుతో రెండు పార్టీలు హెలికాప్టర్ల వాడకంలో దుమ్ము రేపేస్తున్నాయి.

Tags:    

Similar News